ఒక మంచి నటుడు రానాలో నాకు ఆ రోజే కనిపించాడు: కోట (పార్ట్ 44)

ABN , First Publish Date - 2021-10-29T03:39:46+05:30 IST

ఒక నటుడిగా నాకు అనిపించింది చెబుతున్నా. నా మాటలు కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అదంతా వేరే విషయం. తొలి సినిమాలో అంత కేరక్టర్ చేయడం చాలా కష్టం. అందులోనూ ఆ సినిమాలో డ్యాన్సులు, ఫైట్లు లేవు. సెటిల్డ్ గా వెళ్ళాలి. అవతలేమో..

ఒక మంచి నటుడు రానాలో నాకు ఆ రోజే కనిపించాడు: కోట (పార్ట్ 44)

విశ్వనాథ్‌గారి మాటలే ఒక సర్టిఫికెట్‌

ఇక్కడ ఒకమాట తప్పకుండా గుర్తుచేసుకోవాలి. ఒకసారి కె. విశ్వనాథ్‌గారు నాతో ఒక మాటన్నారు. ఆ మాటే కొన్ని కోట్ల రూపాయలకు సాటి. భారతీయ సినిమా వందేళ్ళ వేడుక సమయంలో మద్రాసులో పెద్దలందరూ ఒకచోట కూర్చున్నారు. నేను వెళ్ళి ‘నమస్కారమండీ’ అని అందరినీ పలకరించా. కె.విశ్వనాథ్‌గారు కూడా అక్కడే ఉన్నారు. ఉన్నట్టుండి ఆయన ‘కోట శ్రీనివాసరావుగారిని నా సినిమాల్లో వాడుకోవడంలో నేను ఫెయిలయ్యానండీ. ఆయనలోని నటుణ్ణి సరిగా వాడుకోలేకపోయాననే బాధ నాకు ఎప్పుడూ ఉంటుంది. వండర్‌ఫుల్‌ ఆర్టిస్ట్‌. మామూలోడు కాదు. ఏ గ్లాసులో పోస్తే ఆ షేప్‌లో కనిపించే నీరు లాంటి నటుడు. చాలా వెరైటీ ఉన్న ఆర్టిస్ట్’ అని ఒక్క నిమిషం నా గురించి మాట్లాడితే అందరూ శ్రద్ధగా వింటూ నవ్వుతూ చూడసాగారు. ఆ మాటలు నాకో సర్టిఫికెట్‌లా అనిపించాయి. 


రవిరాజా పినిశెట్టిగారు కూడా నా జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఇప్పటికీ నేను చెన్నై వెళ్లానని తెలిస్తే ఆయనే వచ్చి కలుస్తారు. ‘ఎందుకండీ, నేనే వచ్చి కలిసేవాణ్ణిగా’ అంటే, ‘ఫర్వాలేదండీ. మీలాంటి వారిని నేను వచ్చి కలవడమే కరెక్ట్’ అంటారు. వాళ్ళబ్బాయిలకి పరిచయంచేసి ‘లెజండరీ పర్సనాలిటీరా’ అని నా గురించి చెప్పిన మాట మర్చిపోలేను. ఆర్టిస్ట్‌గా నేను సంపాదించుకున్నది రూపాయిలతో కొలిచేదీ కాదు, దాచిపెట్టేదీ కాదు. సినిమా రంగంలో నాకు హితులు చాలా మంది ఉన్నారు. సన్నిహితుల్లో తప్పక చెప్పుకోవాల్సింది కెమెరామేన్ ఎస్.గోపాలరెడ్డిగారు. నిర్మాతగానూ ప్రసిద్ధులే అనుకోండి. నిర్మాతలు కె.ఎల్.నారాయణగారు, డి.సురేశ్ బాబుగారితోనూ చాలా మంచి అనుబంధం ఉంది.


రానా లీడర్

సురేష్‌బాబుగారి పేరు గుర్తురాగానే చెప్పాల్సిన చాలా విషయాలు నా మనసులో క్యూ కడుతున్నాయండీ. ఇప్పుడు గుర్తుకొచ్చింది ‘లీడర్’ చిత్రం. శేఖర్ కమ్ములగారు ఒక రోజు ఫోన్ చేసి ‘కోటగారు ఒకసారి మిమ్మల్ని కలవాలండీ’ అన్నారు. మినర్వా కాఫీ షాప్‌లో అనుకుంటా.. కలిశాం. ‘చూడండి. ఈ వేషం మీకు చాలా పేరు తెస్తుంది. మీరు చేస్తారని, మీరే చేయాలని రాసుకున్నాను. మామూలు పొలిటికల్ వేషమే. సూపర్ వేషం అయితే కాదు మీరు చాలా సినిమాల్లో చేసిన రాజకీయ నాయకుడి వేషం వంటిదే. కానీ ఇది టిపికల్‌గా ఉంటుంది. సినిమా పూర్తయ్యాక మీరే నా మాట ఒప్పుకుంటారు’ అన్నారు. సరేనని వచ్చేశా.


ఆయన దర్శకత్వంలో కొన్నిసార్లు అనుకున్నది అనుకున్నట్టు జరగదు.‘రేపు చేద్దామండీ కోటగారు’ అనవచ్చు. వాయిదాపడినా, ముందే చేసినా ఆయన చెప్పే మాటల్లో ఒక జెన్యూన్ రీజన్ ఉంటుంది. అందులో నేను చేసింది ‘పెద్దాయన’ వేషం. ఆ సినిమా తర్వాత నన్ను అందరూ ‘పెద్దాయనా నమస్తే’ అనడం మొదలుపెట్టారు. ఆ సినిమా పూర్తయి గుమ్మడికాయ కొట్టిన తర్వాత శేఖర్ కమ్ములగారు నన్ను కావలించుకుని ‘చాలా అద్భుతంగా వచ్చింది సార్ మీ పోర్షన్’ అని సంతోషం వ్యక్తం చేశారు. విజయవాడలో ఆ సినిమా సక్సెస్ మీట్ లో నేను రానా గురించి కూడా చాలా బాగా చెప్పా. ఎందుకంటే రానా చాలా బాగా చేశాడు.


ఒక నటుడిగా నాకు అనిపించింది చెబుతున్నా. నా మాటలు కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అదంతా వేరే విషయం. తొలి సినిమాలో అంత కేరక్టర్ చేయడం చాలా కష్టం. అందులోనూ ఆ సినిమాలో డ్యాన్సులు, ఫైట్లు లేవు. సెటిల్డ్ గా వెళ్ళాలి. అవతలేమో సుహాసినిగారు, మామూలు నటి కాదు. అంతటి అనుభవం ఉన్న వారితో చేసేటప్పుడు సహజంగానే టెన్షన్ ఉంటుంది. అవన్నీ దాటుకుని సినిమా చేయడం మామూలు విషయం కాదు. అయినా చేసి మెప్పించగలిగాడు. ఒక మంచి నటుడు రానాలో నాకు ఆ రోజే కనిపించాడు. ఆ సినిమా రానాకే కాదు, నాక్కూడా చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత నేను ఎక్కడ కనిపించినా అందరూ ‘పెద్దాయనా’ అని పిలవసాగారు. నా లైఫ్ లో నా అదృష్టం ఏంటంటే నాకు కేరక్టర్లు ఒన్ బై ఒన్ పడసాగాయి. కేవలం నా వయసు పెరగడమే కాదు, దానికితగ్గ పాత్రలు కూడా పడసాగాయి. కోట పెద్దాయన అయ్యాడ్రా అని అందరూ అనుకునే సమయానికి కరెక్ట్ గా ‘పెద్దాయన’ అని శేఖర్ కమ్ముల పాత్ర రాయడం ముమ్మాటికీ నా అదృష్టమే.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-10-29T03:39:46+05:30 IST