వెంకటేశ్‌, నేను కలిసి చేస్తున్నామంటే.. అందరూ అదే అనుకునేవారు: కోట (పార్ట్ 43)

ABN , First Publish Date - 2021-10-26T03:33:23+05:30 IST

ఆ రోజుల్లో అంటే ఒకటీ, రెండు దశాబ్దాల క్రితం విలన్ పాత్రలను రూపుదిద్దేతీరు, ఆ పద్ధతి వేరుగా ఉండేది. ఇప్పుడు సినిమాలన్నీ వేరు. అలాంటి గొప్ప చిత్రాలు ఇప్పట్లో రావాలంటే కొత్తగా జనరేషన్ మారాలి. లేకుంటే సినిమాలో పట్టు ఏం ఉంటుందండీ. డబ్బులు పోసి ఏదో చేశామని..

వెంకటేశ్‌, నేను కలిసి చేస్తున్నామంటే.. అందరూ అదే అనుకునేవారు: కోట (పార్ట్ 43)

ఇంకెన్ని చేసేవాడో!

‘గణేశ్’ దర్శకుడు తిరుపతిస్వామి చాలా గ్రేట్‌ డైరక్టర్‌. పాపం చాలా చిన్న వయసులో చనిపోయాడు. లేకుంటే ఇంకా మంచి మంచి సినిమాలు తీసి ఉండేవాడు. ‘గణేశ్’ షూటింగ్‌ జరిగినన్ని రోజులు మిగిలిన చిత్రాలకు ఆటంకం రాకుండా నన్ను చాలా కాపాడాడు. గుండు కొట్టించుకోకుండా ఉన్న సన్నివేశాలన్నీ ప్లాన్ చేసి ముందు తీసేశాడు. ఆ తర్వాత గుండుతో నాలుగైదు రోజులు తీశాడు. మహా అయితే గుండుతో వారం రోజులు ఉన్నానేమో. ప్రతిరోజూ సెట్‌కి వెళ్లడం నున్నగా గుండు కొట్టించుకోవడం, సన్నివేశాలు చేయడం. ఇదీ తంతు. ఆ సినిమా విడుదలైన తర్వాత వచ్చిన పేరు మామూలు పేరు కాదండీ. తోటి ఆర్టిస్టులు కూడా చాలా మెచ్చుకున్నారు. కనిపించిన ప్రతి ఒక్కరూ ‘ఏం చేశావయ్యా కోటయ్యా’ అని మెచ్చుకున్నారు. అంటే ఆ పాత్ర అంత పవర్‌ఫుల్‌గా వచ్చింది. నాయకుడు, ప్రతినాయకుడు పోటాపోటీగా ఉన్న సన్నివేశాలు చూసిన ప్రతి ఒక్కరినీ మెప్పించాయి.


ఇలాంటి పాత్రల వల్ల కథలో ఒకరకమైన పటుత్వం వస్తుంది. నా ప్రకారం విలన్ అనేవాడికి కాసింత రిలీఫ్‌ ఉండాలి. ఊరికే ఏదో కర్కశంగా డైలాగులు చెప్పడం వంటివి చేయకూడదు. చేసేది విలన్ పాత్ర అయినా కాస్త ఎంటర్‌టైనమెంట్‌ ఉండాలి. ఉదాహరణకు ‘గణేశ్’లో కారులో వెళ్తూ చెప్పే డైలాగులు ఉంటాయి. ఎంత బావుంటాయో.. ‘ఆ ఫైల్‌ నాతానకి ఎట్ట వచ్చిందనుకుంటున్నావయ్యా.. పది లచ్చలు మీ ఎడిటర్‌కి కొట్టినా అంతే. అది తీసుకుని పన్నీరు పోసుకున్న పందిలాగా గెంతులు వేసుకుని ఏదో చోళీకే పీచే క్యాహే అని పాటలు పాడుకుంటూ వచ్చి ఇచ్చి వెళ్లాడు’ అని అంటాను. చాలా బావుంటుంది ఆ సీన్. అలాంటిదే మరో సన్నివేశం ఆ సినిమాలో ఉంది. హాస్పిటల్‌కి వెంకటేశ్ వస్తే అతని చెల్లెలు ‘నన్ను ముట్టుకోకన్నా..’ అని చెప్పి మేడమీద నుంచి దూకేస్తుంది. మరో వైపు అతని తండ్రి చంద్రమోహన్ చనిపోయి పడి ఉంటాడు. ఆ సమయంలో వెంకటేశ్ ఏం చేయాలో అర్థం కాక అలా స్థాణువై నిలబడిపోతాడు. మామూలుగా మనం మాట్లాడుకునేటప్పుడు ‘నిర్ఘాంతపోయాడు’ అని అంటాం కదా.. అలా నిలబడిపోయాడు. ఏం లుక్‌ పెడతాడో... సూపర్‌ అసలు. ఏం తోచనట్టు... అది నిజమా? కలా? అన్నట్టు ఒక లుక్‌ ఇస్తాడు. ఒక ఆర్టిస్ట్‌గా అవతలి ఆర్టిస్ట్‌ చేసిన విధానం మనకు అర్థమవుతుంది. ‘ఎంత బాగా చేశారండీ’ అని ఆయనతో ఎన్ని సార్లు అన్నానో. అలాగే లెజండ్రీ పర్సనాలిటీ చంద్రమోహన్‌గారిని గుర్తుచేసుకోకపోతే పొరపాటే అవుతుంది.


నాకు వెంకటేశ్ అంటే చాలా ఇష్టం. ఇష్టం అంటే ప్రేమ, కొంచెం గౌరవం అన్నమాట. ఆయనకు కూడా అంతే ‘మంచి ఆర్టిస్ట్‌ కోటగారు’ అని చాలా సందర్భాల్లో, చాలా మందితో చెప్పేవారు. నేను, వెంకటేశ్ కలిసి చేస్తే ‘మరలా కాంబినేషన్ కుదిరిందిరా’.. ‘కోటగారు, వెంకటేశ్‌గారు సినిమాలో ఉన్నారంటే సినిమాలో ఏదో ఉంటుంది ’ అని అందరూ తప్పకుండా అనుకునేవారు. అది ఓ విశేషం కింద చెప్పుకునేవారు. ఆ రోజుల్లో... అంటే ఎన్నో దశాబ్దాలు అయ్యాయని కాదులెండి... ఆ రోజుల్లో అంటే ఒకటీ, రెండు దశాబ్దాల క్రితం విలన్ పాత్రలను రూపుదిద్దేతీరు, ఆ పద్ధతి వేరుగా ఉండేది. ఇప్పుడు సినిమాలన్నీ వేరు. అలాంటి గొప్ప చిత్రాలు ఇప్పట్లో రావాలంటే కొత్తగా జనరేషన్ మారాలి. లేకుంటే సినిమాలో పట్టు ఏం ఉంటుందండీ. డబ్బులు పోసి ఏదో చేశామని చెప్పుకోవడమో, ఫారిన్‌లో చేశామనో, ఇంకోటనో చెప్పుకోవడం తప్ప... అయితే ‘బాహుబలి’, లేకుంటే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి సినిమాలు తప్ప మిగిలిన వన్నీ ఇంచుమించు కాస్త కథ అటూఇటూగా ఒకేరకంగానే అనిపిస్తుంటాయి నాకు. పాత చిత్రాలు అలా లేవా? అని అడిగితే ఉండేవేమో... కాకపోతే ఏదో గమ్మత్తుగా, కాస్త పట్టుతో ఉండేవి.


రాఘ‌వేంద్ర‌రావుగారు, దాస‌రి నారాయ‌ణ‌రావుగారు, కె.విశ్వ‌నాథ్‌గారు, జంధ్యాల గారు, ఈవీవీ... ఇలా ఎవరి పంథాలో వారు సినిమాలు చేసేవారు. దాసరిగారు, జంధ్యాలగారు, ఈవీవీగారితో నేను చాలా సినిమాలే చేశానుగానీ, రాఘవేంద్రరావుగారితో మాత్రం అడపాదడపాగానే చేశాను. మహానుభావుడి సినిమాల్లో సరైన వేషాలు పడలేదు. ఎందుకో ఇప్పటికీ అర్థం కాదు. ఆ బాధే కె. విశ్వనాథ్ గారి చిత్రాల విషయంలోనూ ఉంది. 

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-10-26T03:33:23+05:30 IST