అయ్యగారూ డబ్బులు అంటే.. ‘ఆడపారేసి పోరా’ అనేవారు: కోట (పార్ట్ 4)

ABN , First Publish Date - 2021-08-17T02:20:59+05:30 IST

ఇప్పుడు ప్రైవేటు ఆసుపత్రులు రేయింబవళ్ళు పనిచేస్తున్నట్టుగానే, ఆ రోజుల్లో మా ఇంట్లోనూ వైద్యంకోసం ఎందరో వచ్చేవారు. నాన్నగారు వైద్యంలో దిట్ట. గంపెడు సంసారం ఉన్నా ఎవర్నీ డబ్బులడిగేవారు కాదు. ఉచిత వైద్యమే. పైగా ఎవరైనా..

అయ్యగారూ డబ్బులు అంటే.. ‘ఆడపారేసి పోరా’ అనేవారు: కోట (పార్ట్ 4)

అమ్మ గారాబం

మా అమ్మ కోట విశాలాక్షి. మా ఇంట్లో నేను ఒక్కణ్ణే చదువు కోసం బయట ఉండేవాణ్ణికదా, అందుకే సెలవులకు వెళ్ళినప్పుడు అమ్మ నన్ను చాలా గారాబం చేసేది. రకరకాల వంటలు వండిపెట్టేది. ‘అది కావాలి, ఇది కావాలి’ అని నేనెప్పుడూ అడిగేవాణ్ణి కాదు. ఎందుకంటే మా అమ్మ ఏం చేసినా గొప్ప రుచిగా ఉండేది. ప్రతి పూటా 20 విస్తర్లకైనా వడ్డించేది. ఇంట్లో ఎంతో పని ఉండేది. అయినాగానీ ఏరోజూ, ఎవరూ నాకు పనిచెప్పేవారు కాదు. నాకు పెద్దగా స్నేహాలు కూడా ఉండేవి కావు. కాకపోతే అందరితో సరదాగా ఉండేవాణ్ణి.


రంగస్థల నటులకు ఆనాడెంతో ఆదరణ

అన్నయ్యతో వెళ్ళి నాటకాలు చూసేవాణ్ణి. నాటకం చూసి ఇంటికొచ్చేసరికి తెల్లావారుజామున నాలుగయ్యేది. అప్పట్లో రంగస్థల నటులను ఎంతో గౌరవంగా చూసేవారు. పొద్దంతా పని చేసుకుని సాయంత్రం నాటకాలు వేసేవాళ్ళకి మంచి ఆదరణ ఉండేది. మా నాన్నగారికి కళలంటే ఇష్టం. అందుకేనేమో మేం నాటకాలు చూసేందుకు వెళ్ళినా, నాటకం చూసి ఆలస్యంగా వచ్చినా ఏమీ అనేవారు కాదు. దానికి తోడు రాత్రనక, పగలనక మా ఇంటి నిండా ఎప్పుడూ వైద్యం కోసం వచ్చే జనం ఉండేవారు. సందడి సందడిగా ఉండేది. ఈ వాతావరణం వదిలి మళ్ళీ పెనమలూరు, మాస్టారి ఇంటికెళ్లేటప్పుడు మాత్రం మనసులో అదోరకం బాధగా ఉండేది.


నాన్నగారి ఉచిత ఆసుపత్రి

ఇప్పుడు ప్రైవేటు ఆసుపత్రులు రేయింబవళ్ళు పనిచేస్తున్నట్టుగానే, ఆ రోజుల్లో మా ఇంట్లోనూ వైద్యంకోసం ఎందరో వచ్చేవారు. నాన్నగారు వైద్యంలో దిట్ట. గంపెడు సంసారం ఉన్నా ఎవర్నీ డబ్బులడిగేవారు కాదు. ఉచిత వైద్యమే. పైగా ఎవరైనా ‘అయ్యగారూ డబ్బులు’ అన్నాగానీ ‘ఆడపారేసి పోరా’ అనేవారు. రోజుకి 150 నుంచి 200 మంది వైద్యం చేయించుకు వెళ్ళేవారు. మా ఇంటి ముందు వేపచెట్లు, పక్కనే పూరిపాకలు ఉండేవి. ఒక్కొక్కపాకలో ఐదేసి నులక, నవారు మంచాలుండేవి. అవే ఆసుపత్రి బెడ్లు! ఇంటిబైట నాపరాయి ఉండేది. అదే ఆపరేషన్‌ థియేటర్‌. అక్కడే పిల్లల్ని కూర్చోబెట్టి టాన్సిల్స్‌ ఆపరేషన్లు చేసేవారు. సన్నగా వీణ తీగలా ఒకటి, దానికన్నా కాసింత లావుగా మరో తీగ ఉండేవి. దవడలకి మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి, నోరు తెరుచుకుని ఉండేలాగా ఏదో ఒకటి అడ్డుపెట్టేవారు. ఆ తీగల్ని అటూ ఇటూ తిప్పి టాన్సిల్స్‌ కత్తిరించేసేవారు. ‘ఇదిగోరా చింత గింజల్లా ఉన్నాయి చూడు’ అని చూపించేవారు. పక్కనే సోడా కొట్లో సోడాతాగి పుక్కిలించమని చెప్పేవారు. దాంతో రక్తస్రావం కూడా ఆగిపోయేది. అంత తేలిగ్గా ఆపరేషన్లు చేసేవారు. రోగులకు కూడా తట్టుకునే శక్తి ఉండేది. ఇప్పటి ఎంబీబీయస్‌ డాక్టర్ల గురించి చెప్పేదేముంది? అన్నీ మెషిన్లేగా.


బిళ్ళంగోడు ఆటలు - మోటారుబావి స్నానాలు

నాన్నగారు ఆపరేషన్లు చేస్తున్నప్పుడు చూస్తూ ఉండేవాణ్ణి లేకపోతే సావాసగాళ్లతో చెడుగుడు, వాలీబాల్‌ ఆడుకునేవాణ్ణి. అప్పట్లో బిళ్లంగోడు ఆడేవాళ్లం. క్రికెట్‌ లేదు. మిగిలినవాళ్ళు ఈతలు కొట్టేవారు. నేను ఈత కొట్టడానికి వెళ్లేవాణ్ణి కాదు. మా నాన్న నూజివీడులో 15-16 ఎకరాలు తోటకొన్నారు. బత్తాయిలు, మామిడికాయలు కాసేవి. ఆ తోటకెళ్ళినప్పుడు మోటారుబావి కింద స్నానాలు చేసి ఆటలాడుకునేవాళ్ళం. మా చిన్నతనంలో చెట్లకి ఏది కాసినా, పూసినా సీజనులోనే. ఇప్పుడు ఆనపకాయలు ఏడాదిపొడవునా దొరుకుతున్నాయి. కానీ అప్పుడు ఆనపకాయ పప్పు చేసుకోవాలంటే సీజన్‌ రావాల్సిందే.


పెద్దక్కయ్య ఇంట చదువు

నేను రాధా మాస్టారి దగ్గర చదువుకున్న తర్వాత పెద్దవాడినయ్యానని నన్ను మా పెద్దక్కయ్య వాళ్ళింటికి పంపించారు. మా పెద్దక్కయ్య నాకన్నా చాలా పెద్దది. మా బావగారు డాక్టర్‌ పిల్లుట్ల శర్మగారు. వైద్యుడు. ఎల్‌ఎంఎస్‌ డిగ్రీ చేశారు. ఆయన గవర్నమెంట్‌ డాక్టర్‌. వాళ్ళ పెళ్ళి కూడా నాకు గుర్తులేదు. వాళ్ళ పిల్లలతో కలిసి ఉండేవాణ్ణి. వాళ్ళకి ఏ ఊరు బదిలీఅయితే ఆ ఊరు వెళ్ళేవాణ్ణి. అలా నేను ఎస్సెస్సీ సగం చదువు నూజివీడు, సగం అవనిగడ్డలో చదివాను. ఎస్సెస్సీ పూర్తయ్యాక పీయూసీలో చేర్చేందుకు ఎక్కడికి పంపించాలనే మీమాంస వచ్చింది మా వాళ్లకి. అప్పట్లో గల్లీకొక కాలేజీ ఉండేది కాదు. విజయవాడలోనో, లేకుంటే మచిలీపట్నంలోనో కాలేజీ ఉండేది. నన్ను బెజవాడ ఎస్‌ఆర్‌ఎం కాలేజీలో పీయూసీలో చేర్పించారు. ఇక అది మొదలు ఊళ్ళో వాళ్ళందరూ మా నాన్నగారి దగ్గరికి వచ్చి ‘ఏవండీ. మీరు మంచి హస్తవాసి ఉన్న వైద్యులు. మీ తర్వాత ఇంకెవరు చేస్తారండీ వైద్యం.. పెద్దబ్బాయి వ్యవసాయానికి మొగ్గాడు. చిన్నబ్బాయిని డాక్టర్‌ చేస్తారా?’ అని అడిగేవారు. దాంతో నాన్నగారి దృష్టి నా మీద పడింది. నాపై కాసింత ఆశ పెంచుకున్నారాయన.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-08-17T02:20:59+05:30 IST