ఆయన చేయాల్సిన హిజ్రా పాత్ర నాకిచ్చారు: కోట (పార్ట్ 37)

ABN , First Publish Date - 2021-10-14T03:17:26+05:30 IST

నా జీవితంలో మంచిచెడులకు ఎప్పుడూ రామానాయుడుగారు తోడుగా ఉండేవారు. చాలా గొప్పమనసున్న వ్యక్తి ఆయన. ‘అలెగ్జాండర్‌’ తర్వాత సుమన్‌గారితో నేను చేసిన మరో మంచి చిత్రం ‘రెండిళ్ల పూజారి’. అందులో నాది హిజ్రా పాత్ర. ఆ చిత్రంలో మెయిన్ వేషం అదే. నా పాత్రకు ముందు..

ఆయన చేయాల్సిన హిజ్రా పాత్ర నాకిచ్చారు: కోట (పార్ట్ 37)

రాచకొండ లచ్చన్న

‘రక్షణ’ తర్వాత మరలా నాకు అంత తృప్తినిచ్చిన పాత్ర ‘అలెగ్జాండర్‌’ చిత్రంలో నేను చేసిన రాచకొండ లచ్చన్న పాత్ర. వరుణ్‌ మూవీస్‌ తెరకెక్కించిన చిత్రం. సుమన్ హీరో. వాణీవిశ్వనాథ్‌ నాయిక. కె. రంగారావు దర్శకత్వం. సత్యనారాయణ నిర్మాత. అప్పటికే డైరక్టర్‌ రంగారావుకు ఐదారు సినిమాల అనుభవం ఉంది. ఆ అనుభవంతో రాసుకున్న పాత్ర రాచకొండ లచ్చన్న. డైలాగులు కూడా అద్భుతంగా రాశారు. ఫ్రాంక్‌గా చెప్పుకోవాలంటే అప్పట్లో ఫామ్‌లో ఉన్ననటుడు గోపాలరావుగారు చేయాల్సిన పాత్ర అది. అంటే అంత లెవెలున్న, సీనియర్‌ ఆర్టిస్టు చేయాల్సిన పాత్ర నాకు రావడం చాలా అదృష్టం. ‘లచ్చన్న అంటే ఏమనుకుంటున్నావ్‌... ఇక్కడ చిటికేశానంటే ఢిల్లీ మెయిన్ రోడ్లమీద పోలీసు వ్యానులు తిరుగుతుంటాయి. ఇక్కడ అగ్గిపుల్ల వెలిగించానంటే ఢిల్లీ సెంటర్‌లో ఫైర్‌ సర్వీస్‌ తిరుగుతుంటుంది’ అనే పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ ఉన్న చిత్రం. లచ్చన్న ఎవరితో మాట్లాడినా అలాగే మాట్లాడుతాడు. ఆ చిత్రంలో కూడా బాబూమోహన్‌తో కాంబినేషన్ ఉంది.


గొప్ప మనసున్న రామానాయుడు

అలెగ్జాండర్‌ సినిమా ఎల్లుండి విడుదలవుతుందనగా రామానాయుడుగారు చూశారు. నేను ఆ రోజు విజయనిర్మలగారి డైరక్షన్‌లో సినిమా చేస్తున్నా. సాయంత్రం నాలుగు, ఐదు గంటలప్పుడు అనుకుంటా బ్రేక్‌ ఇచ్చారు. అటుగా వెళ్ళబోతుంటే ఒకతను వచ్చి ‘రామానాయుడుగారు మీకోసం వచ్చారండీ. బయట వెయిట్‌ చేస్తున్నారు’ అని చెప్పాడు. పెద్దాయన రావడం ఏంటి? అని కంగారుపడ్డా. హడావిడిగా బయటకెళ్ళి చూస్తే వరండాలో ఉన్నారు. ‘డిస్టర్బ్‌ చేయడం ఇష్టంలేక ఇక్కడేవున్నాను’ అన్నారు. ‘సార్‌ ఏంటి సార్‌ ఇలా వచ్చారు. కబురు పెడితే నేనే వచ్చేవాణ్ణిగా’ అన్నా. ‘కంగారుపడకు. ఏమీలేదు. ఇప్పుడే ‘అలెగ్జాండర్‌’ సినిమా ప్రివ్యూ చూసివస్తున్నా. నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసి కంగ్రాట్స్‌ చెబుదామని ఆగాను, మంచి ఆర్టిస్ట్‌ ఇండస్ట్రీకి వచ్చాడని అక్కడంతా అనుకున్నాం’ అన్నారు. చాలా సంతోషంగా అనిపించింది.


నా జీవితంలో మంచిచెడులకు ఎప్పుడూ రామానాయుడుగారు తోడుగా ఉండేవారు. చాలా గొప్పమనసున్న వ్యక్తి ఆయన. ‘అలెగ్జాండర్‌’ తర్వాత సుమన్‌గారితో నేను చేసిన మరో మంచి చిత్రం ‘రెండిళ్ల పూజారి’. అందులో నాది హిజ్రా పాత్ర. ఆ చిత్రంలో మెయిన్ వేషం అదే. నా పాత్రకు ముందు తనికెళ్ళ భరణిగారిని అడిగారట. కానీ ఆయన, ‘నాకన్నా కోట శ్రీనివాసరావు చాలా బాగా చేస్తాడు. పాత్ర పండుతుంది’ అన్నారట. ఈ విషయం తర్వాత నాకెవరో చెబితే తెలిసింది. అందులో నా పాత్ర తెలంగాణ మాండలికం మాట్లాడుతుంది. డైరెక్టర్‌ వచ్చి కథ చెప్పాడు. నా క్యారెక్టర్‌ గురించి విన్నప్పటినుంచి నాకు ఒకటే టెన్షన్.. టెన్షన్ అంటే ఆ పాత్ర ఎలా చేయాలి? ఎలా పండించాలి? అని! అంతకు ముందెప్పుడూ అలాంటి పాత్ర చేసింది కూడా లేదు. అప్పుడు నా మనసులోవున్న బాధంతా నా పర్సనాలిటీ గురించే. ఇప్పుడంటే కాస్త జంకినట్టు ఉన్నాను కానీ, అప్పుడు 43-44 ఏళ్ళప్పుడు మంచి పట్టుమీద ఉండేవాణ్ణి. అంత హుందాగా ఉండే ఆ శరీరంలో ఆడలక్షణాలు ఎలా పలికించాలి? ఆ మేనరిజం? ఆ నడక ఎలా? నాలుగైదు రోజులు ఇదే ఆలోచన. కాస్త ఇబ్బందిపడ్డా. ఇబ్బంది అంటే లొకేషనలో కాదు. సినిమా ప్రారంభానికి ముందు ఆ పాత్రను జీర్ణించుకుని ఒకరూపు తెచ్చుకోవడానికి ఇంట్లోనే నాలో నేను చాలా అంతర్మథనానికి గురయ్యానన్నమాట. అప్పుడు మెరుపులా ఓ ఆలోచన వచ్చింది.


మంచి క్యాలిబర్‌ ఉన్న నటుడు భరణి

తనికెళ్ళ భరణిగారిపట్ల నాది సోదర ప్రేమ. ఉద్యోగం చేసే రోజుల నుంచే నాకు భరణిగారు బాగా తెలుసు. అప్పుడు ఆయనకూడా ఉద్యోగం చేసేవారు. చాలా గొప్ప రచయిత. మంచి నటుడు. భరణిగారు, ఆయన గురువుగారు కలిసి చేతిలో ఏమీ లేకుండా చంకలో ఓ సంచి వేసుకునివెళ్ళి పరిషత్తులో ‘రెడీయా’ అని ఒకరంటే ‘ఆ.. రెడీ’ అని ఇంకొకరంటూ కూడబలుక్కుని నాటకాలు ఆడి ప్రైజ్‌లు తెచ్చేవారు. మంచి దమ్ము, క్యాలిబర్‌ ఉన్న నటుడు భరణిగారు. సినిమాల్లో ఆయనకు రావాల్సినంత పేరు ఇంకా రాలేదేమో అనిపిస్తుంది. ఆయన రాసిన ‘ఆటగదరా శివా’ నాకు చాలా ఇష్టం. భరణిగారి శైలిలో మహత్తు ఏంటంటే ఆయన పెన్నుపెడితే సగటు మనిషికి కూడా ఇట్టే అర్థమవుతుంది. నాకు మంచిఫ్రెండ్‌. గొప్ప వ్యక్తిత్వంగల వ్యక్తి. పుస్తకం హస్తభూషణం అన్నమాట జాగ్రత్తగా ఫాలో అవుతారు. ఎప్పుడూ ఏదో ఒకటి చదువుతూనే కనిపిస్తారు. మేం నాటకాలు వేసే రోజుల్లో రాత్రి ఒంటిగంట దాటాక కూడా కలిసి తిరిగేవాళ్ళం. కొన్నిసార్లు రాత్రి ఒంటిగంట దాటాక నాతో మా ఇంటికి వచ్చేవారు. అప్పుడు స్నానాలుచేసి, నేనేదో వండిపెడితే తిని వెళ్ళేవారు. రాళ్ళపల్లిగారు కూడా మాతో చాలాసార్లు కలిసేవారు. అప్పట్లో సినిమాల గోల లేదు. అందరం చాలా చక్కగా కబుర్లు చెప్పుకునేవాళ్ళం.


ఇక పాత్ర విషయానికి వస్తే.. ఆ సమయంలో ‘నర్తనశాల’ చిత్రరాజం గుర్తుకొచ్చింది. మహానుభావుడు రామారావుగారు ఆ చిత్రంలో ఎంతో బాగా చేశారు. నాకన్నా పెద్ద పర్సనాలిటీ ఉన్న వ్యక్తి. అయినా ఆ పాత్రను ఎంతో బాగా పండించారు. అప్పటికే నేను ఆ సినిమా చాలాసార్లు చూసేశాను. చూసిన ప్రతిసారీ ‘ఈయన ఇంత సునాయాసంగా ఎలా నటించారా?’ అనుకునేవాణ్ణి. ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చాయి. అంటే నాకు ముందర పెద్దాయన ఒక బాట వేశారన్నమాట అనిపించింది. ఆయనలాగా ప్రయత్నిస్తే ప్రేక్షకుల్ని మెప్పించవచ్చనే ధైర్యం వచ్చింది. మనసు కాస్త కుదుటపడింది. కంటినిండా కునుకుపట్టింది. అదేరోజు సాయంత్రం ఈ పాత్ర గురించి ఓ మిత్రుడికి చెబితే, ‘హిందీలో ఈ మధ్యనే ఒక సినిమా వచ్చింది. అందులో మీరు చెప్పినపాత్రను పోలిన పాత్ర ఉంది. ఒకసారి చూడండి’ అని రిఫరెన్స్ ఇచ్చారు. వినడమైతే విన్నాను కానీ సినిమా చూడలేదు. ఆ సంగతి వదిలేశాను.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-10-14T03:17:26+05:30 IST