‘సమ ఉజ్జీ లేకపోయెనే’.. : బాబూ మోహన్ స్పందన (కోట పార్ట్ 35)

టిక్కెట్ల గోల్‌మాల్‌

ఇప్పుడంటే రైల్వేలో కన్‌ఫర్మ్‌ టిక్కెట్లు పెద్దవి, ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్లు చిన్నవి అని ఉన్నాయి. కానీ అప్పట్లో పరిస్థితి వేరు. ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌ దగ్గర్నుంచి, రిజర్వేషన్ టిక్కెట్లవరకు అన్నీ చిన్నవే ఉండేవి. మేం ఏ రోజూ రైల్వేస్టేషన్‌కి ముందుగా వెళ్ళగలిగేవాళ్ళం కాదు. అప్పుడున్న బిజీ అలాంటిది మరి. ముందు ఎవరో ఒకరిని పంపేవాళ్ళం. ఎక్కువగా ప్రొడక్షన్ మేనేజర్లు వెళ్ళేవారు. మేమేమో ట్రైన్ బయలుదేరుతుందనగా స్టేషన్‌కి చేరుకునేవాళ్ళం. హడావిడిగా ట్రైన్ ఎక్కుతున్నప్పుడు వాళ్ళు మా చేతిలో టిక్కెట్లు పెట్టి ‘సార్‌ మీ సూట్‌కేసు లోపల పెట్టాం. టీసీతో మాట్లాడాం. వెళ్ళిరండి’ అనేవారు. టీసీ వచ్చాక టిక్కెట్లు చూపించేవాళ్ళం.‘ఏం సార్‌.. జోక్‌ చేస్తున్నారా’ అని అడిగేవాడు టీసీ. ‘ఏమైంది సార్‌’ అని అడిగితే ‘ఇది ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌ సార్‌’ అనేవారు. అంటే ఆ ప్రొడక్షన్ మేనేజర్లు హడావిడిలో మాకు ఒరిజినల్‌ టిక్కెట్ల బదులు ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్లు ఇచ్చేవారన్నమాట. ట్రైన్ బయలుదేరి అప్పటికే అరగంటయ్యేది. ఇంక ఆలోచన వేస్ట్‌ అని, అప్పుడు టీసీ ఏం రాసిస్తే ఆ ఫైన్ కట్టేసేవాళ్ళం. ఆ తర్వాత మమ్మల్ని ట్రైన్ ఎక్కించిన వాళ్ళు ఎప్పుడో కనిపించేవారు. మాకేమో ఆ విషయం ప్రస్తావించాలనిపించేది కాదు.

మా కాంబినేషన్ మారినప్పుడు నటనలో తృప్తి ఉండేది కాదు: బాబూమోహన్

బి.గోపాల్‌గారు తెరకెక్కించిన ‘బొబ్బిలిరాజా’ షూటింగ్‌లో కోటన్నతో మంచి పరిచయం ఏర్పడింది. ‘తెలంగాణ యాసలో డైలాగులు చెప్పండి’ అని బి.గోపాల్‌గారు అన్నచేత డైలాగులు చెప్పించుకుని వినేవారు. నేనుకూడా పక్కనచేరి చాలా బాగా ఎంజాయ్‌ చేసేవాణ్ణి. అలా మొదలైన మా పరిచయం ‘మామగారు’ నుంచి ‘జంట’ అనే పేరు తెచ్చుకుని వెండితెరమీద ముమ్మరమైంది. ‘బావ బావమరిది’ సినిమాతో మా కాంబినేషన్ ముదరపాకానికి వచ్చింది. ఇక ‘వీళ్ళ కాంబినేషన్‌ మస్ట్‌’ అనే ఫీలింగ్‌ పరిశ్రమలోనూ, ప్రజల్లోనూ వచ్చింది. అప్పటినుంచి మామీద డిఫరెంట్‌ డిఫరెంట్‌ క్యారెక్టర్లు రాసేవారు. సెటైర్లుగానీ, ఎక్స్‌ప్రెషన్స్ గానీ ‘ఈ టైపు పెడితే వీళ్ళమీదనే పెట్టాలి’ అన్నట్టు చేసేవారు. కోటన్న ఎలాంటివాడంటే గ్లాసులో పోసిన నీరులాగా, తనకు ఇచ్చిన పాత్రకు అనుగుణంగా అందులో నటుడు. అప్పటికే విలన్‌గా నెంబర్‌ వన్ పొజిషన్‌లో ఉన్నాడు. ఆయనలో గొప్పతనమేంటంటే నాతో చేసేటప్పుడు ఫ్యామిలీలకు నచ్చే విధంగా నటించేవాడు. నేను ‘అన్నా..’ అని పిలిస్తే, ‘ఆ.. ఏంటీ’ అని వింత ఎక్స్‌ప్రెషన్ ఇచ్చేవాడు. దాంతో ఆబాలగోపాలానికీ నచ్చేవాడు. ‘రాజేంద్రుడు గజేంద్రుడు’లో నీ భార్య డ్రెస్సు వేసుకుంటే చూశాను అనే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్‌లో ఆయన తంతాడు. నేను పడతాను. పడిపోయి స్టైల్‌గా కృష్ణుడులాగా పడుకుని ‘ఆ ఏంటన్నా’ అని ఎక్స్‌ప్రెషన్ పెడతా. ఆ సినిమాలు ఇప్పుడు టీవీల్లో వస్తుంటే ‘అసలు ఇవన్నీ ఎలా చేశాం? చేసింది మేమేనా? ఇప్పుడు అలాంటి కామెడీ ఏదీ? రోజులు ఎలా మారిపోయాయి?’ అనిపిస్తూ ఉంటుంది. మా జ్ఞాపకాలు ఒకటీ అరా కాదు. 


నాకు నటనలో బెటర్‌మెంట్‌ నేర్పినవాడు కోటన్న. పేర్లు ఎందుకులేగానీ, కోటన్న ప్లేస్‌లో కొన్నిసార్లు మిగిలిన ఆర్టిస్టులు వచ్చేవారు. నాకేమో వాళ్లతోకలిసి నటిస్తే తృప్తిగా ఉండేది కాదు. ఏదో చప్పగా ఉండేది. ‘సమ ఉజ్జీ లేకపోయెనే’ అనే ఫీలింగ్‌ ఉండేది. మరలా ఇద్దరం మరుసటి రోజో, ఎప్పుడో కలుసు కునేవాళ్ళం. ‘ఏరా.. ఎక్కడ?’ అనేవాడు. ‘ఫలానా షూటింగ్‌ అన్నా. ఇంతకీ నువ్వెక్కడ’ అనేవాణ్ణి నేను. ‘ఏదోరా.. ఫలానా దగ్గర. వాడెవడో చేశాడ్రా.. నాకు ఆనలేదు’ అనేవాడు. నేను కూడా వెంటనే ‘నాక్కూడా అంతేనన్నా. నువ్వు లేకుంటే తోచలేదన్నా’ అని చెప్పేవాణ్ణి.


అంటే ఇద్దరం చెప్పుకునేది ఒకటే. మేం ఇద్దరం కలిసి షాట్‌ చేశామంటే ఒకరికొకరం ఇచ్చుకునే రియాక్షన్లు కరెంట్‌ షాక్‌ కొట్టినట్టు ఉండేవి. అదే మిగిలిన ఆర్టిస్టుకైతే అంత తేలిగ్గా అవి వీలయ్యేవి కావు. మా ఇద్దరినీ దేవుడే కలిపాడని నా ఫీలింగ్‌. మా ఇద్దరికీ రాత కూడా ఒకలాగే రాశాడు దేవుడు. మా అబ్బాయి, కోటన్న కొడుకు ఇద్దరూ యాక్సిడెంట్‌లోనే కన్నుమూశారు. మా బాబుకి యాక్సిడెంట్‌ అయిన రోజు తను బైక్‌ మీద ఉన్నాడు. వెనుక మా చిన్నబాబు కారులో ఉన్నాడు. అలాగే అన్న వాళ్లబ్బాయి ముందు బైక్‌ మీద వెళ్తున్నాడు. వెనుక భార్యాపిల్లలు కారులో వెళ్తున్నారు. నా కొడుకు గుర్తొస్తే వెంటనే అన్న కొడుకు గుర్తొస్తాడు. అన్నకీ అంతే. అసలు అంత పెద్ద శోకాన్ని ఎలా దిగమింగుతున్నామో భగవంతుడికి తెలుసు. నేను రాజకీయాల్లో ఉన్నా, అన్న సినిమాల్లో ఉన్నా అప్పుడప్పుడూ వచ్చి కలుస్తూ ఉంటా. ఆ రోజుల్ని గుర్తుచేసుకుంటూ ఉంటాం.  

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

ఇవి కూడా చదవండిImage Caption

‘అబ్బా ఏం చేశాడ్రా బ్యాంకోడు’ అనేవారు: కోట (పార్ట్ 8)

FilmSerialమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.