రాజమండ్రి అనుకుని బెజవాడలో దించేశాడు: కోట (పార్ట్ 34)

ABN , First Publish Date - 2021-10-01T03:30:26+05:30 IST

‘ఏరా.. ఏంట్రా ఇది. రైలెక్కేటప్పుడు కాస్త కాలు జారి ఉంటే ఏమయ్యేదిరా..’ అని తిట్టా. ‘ఏం లేదన్నా... సారీ! బెజవాడ కృష్ణా బ్యారేజ్‌ సౌండ్‌ వినేసరికి గోదావరి బ్యారేజ్‌ సౌండ్‌లానే వినిపించింది. అందుకే నిద్రలేపా’ అన్నాడు. ఉదయాన్నే రైలు దిగి లొకేషన్‌కి వెళ్ళాం. అప్పటికే..

రాజమండ్రి అనుకుని బెజవాడలో దించేశాడు: కోట (పార్ట్ 34)

అప్పట్లో ఏసీ టూ టైర్లు వంటివి లేవు. అందరికీ ఫస్ట్‌ క్లాసే ఇచ్చేవాళ్ళు. మేమిద్దరం చాలా వరకు కలిసే ట్రావెల్‌ చేసేవాళ్ళం. ఒకసారి తిరుపతిలో ఏదో షూటింగ్‌ చేశాం. అక్కడ రైలెక్కి మరుసటి రోజు ఉదయాన్నే రాజమండ్రి చేరుకోవాలి. షూటింగ్‌ ప్యాకప్‌ చెప్పగానే మేకప్‌ తీసేసి గబగబా స్టేషన్‌కి చేరుకుని ట్రైన్ ఎక్కాం. రాత్రి పదిన్నరదాకా ఏవో కబుర్లు చెప్పుకుని పడుకున్నాం. ‘తెల్లారుజామున ఐదుగంటలకి లేవాల్రోయ్‌. నాకు కాస్త నిద్రపట్టినా, నువ్వు రవ్వంత మెలకువగా ఉండు’ అని వాడితో చెప్పా. ‘సర్లేన్నా పడుకో, లేపుతాలే’ అన్నాడు బాబూమోహన్. అలా నిద్రలోకి జారుకున్నట్టు అనిపించింది.. అంతలోనే, ‘అన్నా లేలేలే. బ్రిడ్జి వచ్చేసింది. మనం అన్నీ సర్దుకుని దిగాలి’ అని లేపుతున్నాడు.‘అప్పుడే వచ్చిందేరా’ అని అడిగా నిద్రమత్తులో.. నాకేమో అప్పుడే పడుకున్నట్టుంది. ‘వచ్చింది.. లేలేలే’ అన్నాడు. స్టేషన్‌లో దిగి సూట్‌కేస్‌ పోర్టర్‌కిచ్చి నడుస్తున్నాం. చుట్టూచూస్తే స్టేషన్ చాలా పెద్దగా ఉంది. ఎందుకో అనుమానం వచ్చి, ‘ఏమయ్యా.. ఇది రాజమండ్రి స్టేషనేనా’ అన్నా.. ‘ఇది రాజమండ్రి ఏమిటండీ.. బెజవాడండీ’ అన్నాడు పోర్టర్‌. ‘ఓరి నీ దుంపదెగ..’ అని బాబూమోహన్ని ఏదో అనబోయేసరికి మేం దిగిన ట్రైన్ కదులుతోంది. ఒక్కక్షణం ఇద్దరికీ భయమేసింది. నిద్రమత్తు ఒక్కసారి వదిలినట్టైంది. పోర్టర్‌ చేతిలో ఉన్న సూట్‌కేసులు లాగి ట్రైన్ లోపలికి విసిరేసి ఇద్దరం చకచకా ఎక్కేశాం. ఎలా ఎక్కామో దేవుడికే తెలియాలి. నిద్ర టైమ్‌లో అలా పరిగెత్తించాడని నాకు వాడిమీద చాలా కోపం వచ్చింది. సినిమాలో కొట్టినట్టు ఒకటి కొట్టా.


‘ఏరా.. ఏంట్రా ఇది. రైలెక్కేటప్పుడు కాస్త కాలు జారి ఉంటే ఏమయ్యేదిరా..’ అని తిట్టా. ‘ఏం లేదన్నా... సారీ! బెజవాడ కృష్ణా బ్యారేజ్‌ సౌండ్‌ వినేసరికి గోదావరి బ్యారేజ్‌ సౌండ్‌లానే వినిపించింది. అందుకే నిద్రలేపా’ అన్నాడు. ఉదయాన్నే రైలు దిగి లొకేషన్‌కి వెళ్ళాం. అప్పటికే కోడి రామకృష్ణ అండ్‌ యూనిట్‌ మొత్తం అక్కడ ఉంది. మేం వెళ్ళగానే మా కాంబినేషన్‌లో సీన్లు తీసేలా ప్లాన్ చేసుకున్నట్టున్నారు. మేకప్‌ వేసుకుని మా సీన్లు చేస్తున్నాం. లంచ్ బ్రేక్‌లో కోడి రామకృష్ణగారు వచ్చి ‘మీరిద్దరూ కాస్త ఆ లొకేషన్‌కు వెళ్ళిరండి’ అన్నారు. ఏ లొకేషనా? అని ఆరా తీస్తే, అది రేలంగి నరసింహారావుగారి లొకేషన్. ఆయన ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’ సినిమా తీస్తున్నారప్పుడు. మా ఇద్దరి కాంబినేషన్‌లో కొన్ని సీన్లు మిగిలిపోయాయి. వాటిని షూట్‌ చేసేందుకు మా కాల్షీట్లు దొరకలేదు. దాంతో రేలంగిగారు యూనిట్‌తో సహా రాజమండ్రికి వచ్చేశారు. ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయాం. అక్కడికి వెళ్ళి ‘ఎందుకండీ పాపం ఇంతదూరం రావడం.. ఎలాగోలా అడ్జస్ట్‌ చేసేవాళ్ళంగా’ అన్నాం.


‘ఫర్వాలేదండీ. మీ పరిస్థితి చూస్తూనే ఉన్నాం. మీరు రావడంకన్నా, మేం రావడమే నయమనిపించింది’ అన్నారు రేలంగిగారు. అప్పుడే కాదు, ఆ తర్వాతకూడా ఎన్నోసార్లు కాల్షీట్లు అడ్జెస్ట్‌ చేసేవాళ్ళం. ఆ అడ్జస్ట్‌మెంట్‌లో భాగంగా చాలా ఇబ్బందులు అవస్థలు పడాల్సి వచ్చేది. మరీ ముఖ్యంగా రైలు ప్రయాణంలో. హడావిడిగా వెళ్ళి రైలు ఎక్కేస్తే సీట్లు దొరికితే దొరికినట్టు, లేకుంటే లేదు. దొరకనప్పుడు బాత్రూమ్‌ల దగ్గర పేపర్లు పరుచుకుని కూర్చునేవాళ్ళం. ఆ పక్కనే మామూలుగా అటెండర్‌ పడుకోవడానికి ఓ చెక్క ఉండేది. అటెండర్‌ మమ్మల్ని గౌరవించి ఎప్పుడైనా ఆ చెక్క మాకు ఇచ్చి తను ఆ పక్కన ఎక్కడో పడుకునేవాడు. బాబూమోహన్ నా పక్కనే కింద పడుకునే వాడు. కొన్నిసార్లు నాకే బాధగా అనిపించేది. ‘నువ్వు పైన పడుకోరా, నేను కింద పడుకుంటాలే’ అనేవాణ్ణి. ఆ సమయానికి మనసులో ఏది తోస్తే అలా జరిగిపోయేది.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-10-01T03:30:26+05:30 IST