బాబూమోహన్‌‌ని నిజంగానే తన్నేశా.. అప్పుడు భయపడ్డా: కోట (పార్ట్ 33)

బాబూమోహన్‌ పెక్యూలియర్‌ టైమింగ్‌!

నేను ఏ సినిమా చేసినా దాదాపు బాబూమోహన్ నా పక్కనే ఉండేవాడు. అతనిలో నాకు బాగా నచ్చిన విషయం టైమింగ్‌. ఆర్టిస్ట్‌కి ఆ టైమింగ్‌ చాలా ముఖ్యం. బాబూమోహన్ ఓ పెక్యూలియర్‌ టైమింగ్‌ ఉన్న ఆర్టిస్‌. దాన్ని ఎవరూ ఇమిటేట్‌ చేయలేరు. అతని ఫేస్‌కూడా అతనికి చాలా అడ్వాంటేజ్‌. భగవంతుడు ఇచ్చిన రూపాన్ని అతను ఎంతో గొప్పగా ఉపయోగించుకున్నాడు. దాదాపు ప్రతి చిత్రంలోనూ నేను అతన్ని కొట్టేవాణ్ణి, తన్నేవాణ్ణి. చూసిన జనాలు కడుపుబ్బ నవ్వుకునేవారు. అన్ని షాట్స్‌లోనూ నిజంగా నేను అతన్ని తన్నివుంటే ఈ సమయానికి నా కాళ్ళు వాచిపోయి పనికిరాకుండా పోయుండేవి. అతని నడుము సంగతైతే వర్ణనాతీతం. కానీ బాబూమోహన్‌లో ఉన్న టైమింగ్‌వల్ల అలాంటి ఇబ్బందులేవీ రాలేదు. డైరెక్టర్‌గారు రెడీ అనగానే ఆ టైమింగ్‌లో కరెక్ట్‌గా నడుము నావైపు పెట్టేవాడు. నేను కాలితో టచ్ చేయగానే అలా పడిపోయేవాడు. ఆ పడటంకూడా ఎంత నేచురల్‌గా ఉండేదనీ..

నిజంగా భయపడ్డా!

ఎప్పుడూ ఉత్తుత్తినే తన్నే నేను ఒకసారి నిజంగానే తన్నా. ఫలితం అతను 50, 60 అడుగులు దొర్లుకుంటూ పడిపోయాడు. నాకు ఒక్కక్షణం నిజంగా వెన్నులో వణుకు మొదలైంది. ‘చినరాయుడు’ షూటింగ్‌లో ఈ ఘటన జరిగింది. బి. గోపాల్‌ దర్శకత్వంలో వెంకటేశ్, విజయశాంతి జంటగా నటించారు. రాజమండ్రి దగ్గర రామచంద్రాపురంలో ఒకరోజు షూటింగ్‌ జరుగుతోంది. లొకేషన్‌లో నేను, బాబూమోహన్ ఉన్నాం. వాడు తన సీన్లన్నీ పూర్తిచేసి సాయంత్రం ట్రైన్‌కి తిరుపతి వెళ్ళాలి. అక్కడ ఇంకేదో షూటింగ్‌ ఉంది. దాంతో ఉదయం నుంచి లొకేషన్‌లో హడావిడి మొదలైంది. ఇద్దరం దోబీ వేషాలు వేసుకుని స్పాట్‌లో ఉన్నాం. ఆ సినిమా మొత్తం పాత్రలో వాడు నన్ను ఏవో సందేహాలు అడుగుతూనే ఉంటాడు. ఆ రోజుకూడా కొబ్బరి చెట్టు చూపించి సందేహం అడగాల్సిన సన్నివేశం ప్లాన్ చేశారు. బి.గోపాల్‌గారు నా దగ్గరకు వచ్చి, ‘కోటగారు కాస్త కో ఆపరేట్‌ చేయండి. అవతల బాబూమోహన్ వెళ్ళాలి’ అన్నారు. ‘అలాగేనండీ, చేసేద్దాం’ అన్నా. యూనిట్‌ మొత్తం కూడబలుక్కుని లంచ్ కూడా చేయకుండా నిర్విరామంగా షూటింగ్‌ చేస్తూనే ఉన్నాం. డైరెక్టర్‌గారు ‘యాక్షన్’ అన్నారు. ఒక షాట్‌లో నేను వేలుపైకెత్తి ఓ వైపు చూపించి ‘ఆ చెట్టుకి కొబ్బరికాయలు ఎన్ని ఉంటాయిరా’ అని అడిగా. బాబూమోహన్ అటువైపు తిరిగి ‘ఒకటీ, రెండూ..’ అని లెక్కపెట్టసాగాడు. కాలితో నడ్డిమీద తన్నా. మామూలుగా నేను తంతే కాలు అలా టచ్ అవుతుందో, లేదో వెంటనే పడి పోయేవాడు. కానీ ఆ వేళ నా కాలు కాస్త బలంగా తగిలింది. వాడు బొక్కబోర్లాపడ్డాడు. ఆ చెరువు గట్టుమీంచి 50 అడుగులు దొర్లుకుంటూ పోయాడు. నాకు కంగారులో చెమటలు పట్టేశాయ్‌. మిగిలిన యూనిట్‌ అంతా అది నటన అనుకుంటున్నారు. కానీ నిజం నాకు మాత్రమే తెలుసు. వాడు అసలే వేరే షూటింగ్‌కి వెళ్ళాలి. ఏమైనా దెబ్బలు తగిలాయేమోనని నాకు ఒకటే ఆదుర్దా. అంతలోనే పైకి లేచి ‘టేక్‌ ఓకేనా సార్‌’ అన్నాడు. డైరెక్టర్‌గారు ‘ఓకే’ అనగానే గబగబా పైకి వచ్చాడు. నేను వాడికి ఎదురెళ్ళి ‘సారీరా ఏమీ అనుకోకు.. కాస్త కాలు తగిలింది’ అన్నా. ‘ఫర్వాలేదన్నా. ఏం ఫర్లేదు. మనకి సీన్ బాగా రావాలి అంతే. సీన్ బాగొచ్చిందిగా.. సరే రెండు మెతుకులు తిందాం పదన్నా.. అవతల టైమ్‌ అవుతోంది’ అన్నాడు.


ముద్దలు కలిపి పెట్టేవాణ్ణి

బాబూమోహన్ కమిటెడ్‌ ఆర్టిస్టు. ప్రతిభావంతుడు. నటనంటే అభిలాష ఉన్న మనిషి. తను నమ్ముకున్నదాన్ని బతికించాలనుకునే తత్వం గలవాడు. ‘నేను చేసినట్టు ఎవరూ చేయకూడదు. అందర్నీ మించిపోయేటంత బాగా నటించాలి’ అని నిత్యం అనుకునే వ్యక్తి. నాకు ఇంకో మంచి తమ్ముడు దొరికాడని నాలో నేను అనుకున్నా. అప్పటినుంచి ఎన్నోసార్లు తనకి ముద్దలు కలిపి పెట్టేవాణ్ణి.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

FilmSerialమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.