బాబూమోహన్‌తో నా కాంబినేషన్‌ సెట్ చేసింది ఆయనే: కోట (పార్ట్ 32)

ABN , First Publish Date - 2021-09-29T03:13:05+05:30 IST

నేను, బాబూమోహన్ అడపాదడపా సినిమాలు చేశాంగానీ అవేమీ మా కాంబినేషన్ చిత్రాలు కాదు. తెలుగు వారిని కడుపుబ్బనవ్వించిన మా ఇద్దరి కాంబినేషన్‌కు శ్రీకారం చుట్టిన ఘనత ఆయనదే..

బాబూమోహన్‌తో నా కాంబినేషన్‌ సెట్ చేసింది ఆయనే: కోట (పార్ట్ 32)

స్పెషల్‌ చిత్రం ‘మామగారు’

ముత్యాల సుబ్బయ్యగారు దర్శకుడైన తర్వాత నాతో చాలా మంచివేషాలు వేయించారు. నాతో కామెడీ చేయించిన ఘనత కూడా ఆయనదే. ఆ చిత్రాలు అన్నిటిలోకీ ‘మామగారు’ చాలా స్పెషల్‌ చిత్రం. ఈ సినిమాను ఎడిటర్‌ మోహన్ నిర్మించారు. ‘మామగారు’ చిత్రం ఎలా మొదలైందంటే.. ఒకరోజు ఉదయం నాకు ఒక ఫోన్ వచ్చింది. ‘ఏవండీ నేను ఎడిటర్‌ మోహన్ అండీ. తెలుగు సినిమా నిర్మాతని’ అని అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నారు. అంతకుముందు ఆయన నాకు తెలియదు. అందుకే ‘అలాగా అండీ. నమస్కారం. చెప్పండి సార్‌’ అన్నా. ‘ఏం లేదు శ్రీనివాసరావుగారూ.. ఒక అరవ సినిమా తీసుకున్నాను. తెలుగులో రీమేక్‌ చేయాలనుకుంటున్నాను. అందులో ఓ వేషం మీరు చేయాలి. టికెట్లు పంపిస్తాను. ఫ్యామిలీతో మీరు ఒకసారి ఆ సినిమా చూసిరండి’ అన్నారు. సరేనండీ.. అలాగే చూస్తాను అన్నా. అన్నట్టుగానే టికెట్లు పంపించారు. సినిమా చూసొచ్చాం. మరుసటిరోజు ఉదయాన్నే ఆయన మళ్ళీ నాకు ఫోన్ చేశారు. ‘శ్రీనివాసరావుగారూ.. చూశారా... తెలుగుకు ఎలా ఉంటుందీ?’ అని అడిగారు. ‘బావుంటుంది సార్‌. మన నేటివిటీకి సరిపోతుంది’ అన్నా. ఆయనతో మాట్లాడుతున్నానేకానీ నా మనసంతా ఒక పాత్ర మీదే ఉంది. అయినా ముందు నేనే చెబితే బావుండదు కదా.. ఆయన ఏమనుకుంటారో అని వెయిట్‌ చేశా. నేననుకున్నట్టే ఆయనే ఆ విషయం ప్రస్తావించారు. ‘నేను ఫలానా పాత్ర చేస్తాను సార్‌. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా బాగా ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపూ ఆ పాత్రనే గమనించాను’ అని గబగబ చెప్పేశాను. ఎందుకో ఆయన ఒక్కక్షణం ఆగి ‘ఆ పాత్ర మీరు చెయ్యదగ్గదేనండీ. నేను కాదనను. ఆ విషయంలో ఎలాంటి అనుమానాలూ లేవు. కానీ ఆ ఒక్క పాత్రనూ వదిలేయండి సార్‌. మేం ఇంతకుముందే కమిట్‌ అయ్యాం. దానికి దాసరి నారాయణరావుగారిని అనుకుంటున్నాం. అది ఫిక్స్‌ అయిపోయింది’ అన్నారాయన. ‘మరి అందులో నేను చేయదగ్గ పాత్రలు ఇంకేమున్నాయో మీరే చెప్పండి సార్‌. ఏ పాత్ర చేయమంటే అదే చేస్తాను. నాకేం ఫర్వాలేదండీ’ అన్నా. నా గొంతులో నిరుత్సాహం ధ్వనించినట్టుంది, ఆయన గమనించినట్టున్నారు. ‘మీరేం ఆలోచించకండి. నిరుత్సాహపడకండి. తమిళంలో కౌండర్‌మణి చేసిన పాత్రకు మిమ్మల్ని అనుకుంటున్నాం. ముత్యాల సుబ్బయ్యగారు మీతో మాట్లాడతారు. బాబూమోహన్‌గారిని మీకు పెయిర్‌గా పెడతాం. ఆయన్నీ అడుగుతున్నాను’ అని చెప్పారు.


బాబూమోహన్‌తో నా కాంబినేషన్‌ ఘనత ఆయనదే

ముత్యాల సుబ్బయ్యగారు నన్ను కలిసి ‘నువ్వేం నిరుత్సాహపడొద్దు. తమిళ్‌కన్నా తెలుగులో ఆ పాత్ర చాలా బాగా వస్తుంది. నామీద నమ్మకంతో చెయ్యి’ అన్నారు. నిర్మాతగారు కూడా మరోసారి ఆ మాటే చెప్పి అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారు. అలా బాబూమోహన్‌తో నా కాంబినేషన్ సెట్‌ అయింది కూడా ముత్యాల సుబ్బయ్యగారి సినిమాతోనే. నేను, బాబూమోహన్ అడపాదడపా సినిమాలు చేశాంగానీ అవేమీ మా కాంబినేషన్ చిత్రాలు కాదు. తెలుగు వారిని కడుపుబ్బనవ్వించిన మా ఇద్దరి కాంబినేషన్‌కు శ్రీకారం చుట్టిన ఘనత ముత్యాల సుబ్బయ్యగారిదే. ‘మామగారు’ సినిమా సక్సెస్‌కి మా ఇద్దరి కామెడీ పెద్ద ఎస్సెట్‌ అయింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ‘మీ ఇద్దరి కామెడీ లేకపోతే ఆ సినిమా ఆ స్థాయిలో ఆడేది కాదేమో. ఏదో మూడు, నాలుగు వారాల సినిమా అయ్యేది. మీ ఇద్దరి కామెడీ సినిమాను మరో లెవల్‌కి తీసుకెళ్ళింది’ అని ప్రశంసించారు. అలా ఆ చిత్రం 100 రోజులు ఆడింది. దాంతో ఆల్‌రౌండ్‌ ఆర్టిస్ట్‌గా ఫిక్స్‌ అవుతున్నాననే ధైర్యం నాకు వచ్చింది. ఎందుకంటే అప్పటికే విలన్‌గా చేశా. ఈ చిత్రంలో కామెడీ కూడా బాగా చేయగలిగా.


బాబూమోహన్‌తో దాదాపు 50 చిత్రాలు

‘మామగారు’ రిలీజైన తర్వాత నేను, బాబూ మోహన్ కలిసి తక్కువలో తక్కువ 50 సినిమాలు చేశాం. అవన్నీ బడ్జెట్‌ చిత్రాలే. మా కాంబినేషన్ మొదలైన సమయంలోనే ఇండస్ట్రీ మెల్లిగా హైదరాబాద్‌కి తరలి వస్తోంది. ఇక్కడ తీసిన తెలుగు సినిమాలకు ఎనిమిది శాతం రాయితీ ఇచ్చేవాళ్లు. దాంతో బడ్జెట్‌ సినిమాలు విరివిగా వచ్చాయి. సినిమా పరిశ్రమలోనూ చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. చాలాకాలం నుంచి పెద్ద దర్శకుల దగ్గర కో-డైరెక్టర్లుగా చేస్తున్న వారందరూ డైరెక్టర్లు కావడం కూడా అందులో భాగమే. అందులో నాకు కలిసొచ్చిన విషయం ఏమిటంటే ఒక క్యాడర్‌ హీరోలు, దర్శకుల చిత్రాల్లో విలన్, ఫాదర్‌, కమెడియన్ వంటి వేషాలన్నిటికీ నేను షిఫ్ట్‌ అయ్యా.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-09-29T03:13:05+05:30 IST