ఈ హోల్‌ ఇండస్ట్రీ‌లో ఆయన నాకు చాలా స్పెషల్: కోట (31)

పోలీసంటే రాజశేఖరే!

రాజశేఖర్‌ ఫస్ట్‌ పిక్చర్‌ ‘వందేమాతరం’లో నేను విలన్‌గా చేశా. రావడం రావడమే రాజశేఖర్‌గారు విజయశాంతి సినిమాలో చేశారు. ఆ తర్వాత ఉషాకిరణ్‌ మూవీస్‌లో ‘ప్రతిఘటన’లో. ఒక ప్రత్యేకత ఉన్నటువంటి నటుడు రాజశేఖర్‌. టి.కృష్ణగారికి ఇష్టమైన హీరో. నేను ఇంతకుముందు మీతో చెప్పాను కదా, ఒకసారి నాకు ఫుడ్‌ అలర్జీ అయితే, వెంటనే ఆ విషయం ముందుగానే గుర్తించి నన్ను కాపాడాడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో చాలా మంచి సినిమాలు చేశాడు. పోలీస్‌ అంటే రాజశేఖరే అనే ఇమేజ్‌ తెచ్చుకున్నాడు. అందుకనే అతను తెలుగు సరిగా మాట్లాడలేకపోయినా.. ‘ఇతనికి లాంగ్వేజ్‌ రాదుగా, డబ్బింగ్‌ ఇంకొకడు చెబుతాడు’ అని తెలుగువారు ఎప్పుడూ అనుకోలేదు. ఇన్‌స్పెక్టర్‌ అంటే ఆయనే అన్నట్టు ఫీలయ్యారు. తెరమీద అగ్రెసివ్‌గా కనిపించేవాడు రాజశేఖర్‌. మంచి పర్సనాలిటీతో పాటు ఆయన ముఖం మీద ఎక్స్‌ప్రెషన్స్ బాగా పలికేవి. ఆ సీరియ్‌స్‌నెస్‌, ఆయన వాయిస్‌ అన్నీ ఆయనకే సాధ్యమయ్యాయి. అందుకే సక్సెస్‌ఫుల్‌ హీరోగా కొనసాగాడు. 


తెరమీద అగ్రెసివ్‌గా కనిపించేవాడు రాజశేఖర్‌. మంచి పర్సనాలిటీతోపాటు ఆయన ముఖంమీద ఎక్స్‌ప్రెషన్స్ బాగా పలికేవి. ఆ సీరియ్‌స్‌నెస్‌, ఆయన వాయిస్‌ అన్నీ ఆయనకే సాధ్యమయ్యాయి. అందుకే సక్సెస్‌ఫుల్‌ హీరోగా కొనసాగాడు. ఒక మనిషికి అదృష్టం కలగాలంటే, జీవితం మంచి మలుపు తిరగాలంటే ఎవరో ఒకరి సాయం కావాలి. మనకు ఎవరూ ధనరూపేణ, వస్తురూపేణ ఆ సాయం చేయక్కర్లేదు. ఒక్కమాట చెబితేచాలు. ఆ మాటతో జీవితం మారిపోతుంది. అలా మాటసాయంతో పైకివచ్చిన వాళ్లలో నేనూ ఒకణ్ణి. నేను నాటకాలు వేశాను, బాగా నటించగలిగాను. అవన్నీ పక్కనపెడితే సినిమాల్లో ఎప్పుడూ ట్రై చేయలేదు.

ఒకేఒక్కమాట!

ఇంతకుముందే చెప్పాగా, హైదరాబాద్‌ రవీంద్రభారతిలో నాటకాలు వేసేవాణ్ణి. ఒకసారి టి.కృష్ణగారు, ముత్యాల సుబ్బయ్యగారు నా నాటకం చూశారట. తర్వాతికాలంలో వారే ఈ విషయం చెప్పారు. విలేజ్‌ పాలిటిక్స్‌ మీద ‘వందేమాతరం’ సినిమా తీయాలని కృష్ణగారు అనుకుని, అందులో ఒక వేషానికి నర్రాగారిని బుక్‌ చేశారు. అప్పటికి ఆయన ఫేమ్‌లో ఉన్నారు. రెండో పాత్రను ఎవరితో వేయించాలనుకున్నప్పుడు, ‘సినిమా ఆర్టిస్ట్‌లు ఎవరూ వద్దు, స్టేజీ ఆర్టిస్టులైతే బాగుంటుంది’ అని టి.కృష్ణగారు అన్నప్పుడు ముత్యాల సుబ్బయ్యగారు ‘ఏవండీ మీకు గుర్తుందా.. మనం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఒక నాటకం చూశాం. సమయం వచ్చినప్పుడు అందులో ఒక నటుడి గురించి గుర్తు చేయమని నాతో అన్నారు మీరు’ అని చెప్పారు. ఆ క్షణంలో సుబ్బయ్యగారు అలా కృష్ణగారికి గుర్తు చెయ్యడం కేవలం నా పూర్వజన్మసుకృతం కాక మరేంటి? అలా టి.కృష్ణగారి సినిమాలో నా వేషం ఖరారైంది. ఆ సినిమాలో నాతోపాటు ముత్యాల సుబ్బయ్యగారు కూడా నటించారు. నర్రాగారి పక్కన చేశారాయన. సుబ్బయ్యగారు మంచినటుడు. కానీ ఎందుకో తర్వాతి కాలంలో ఆయన దర్శకత్వాన్ని వృత్తిగా తీసుకున్నారు. టి.కృష్ణగారు ఉన్నప్పుడే సుబ్బయ్యగారు దర్శకత్వం చేశారు. ముత్యాల సుబ్బయ్య లేకపోతే ఇవాళ నేను లేను. మా ఇద్దరివీ ఒకే ప్రాంతాలు కావు. ఆయనతో ముందస్తు పరిచయం లేదుగానీ, సినిమాల్లోకి నా ఎంట్రీ ఆయన నోటిమాట వల్ల జరిగింది. అందుకే ఈ హోల్‌ ఇండస్ట్రీ‌లో ముత్యాలసుబ్బయ్యగారు నాకు చాలా స్పెషల్‌.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

FilmSerialమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.