ఆ పాత్రకి నంది అవార్డు వస్తుందనుకున్నా.. కానీ రాలేదు: కోట (పార్ట్ 30)

కెరీర్‌లో అదో గొప్ప పాత్రగా మిగిలిపోయింది

నేను వెళ్ళి భోజనంచేసి అరగంట పడుకున్నా. పడుకున్నానేగానీ మనసంతా ఇదే ఆలోచన. ‘ఎట్టారా, ఎట్టా చేయాల్రా... ఆ మేనరిజం మనకు ఎందుకు అంతుబట్టటం లేదు’ అని. సరేనని లేచి సెట్‌కి వెళ్ళా. అక్కడ డైరెక్టర్‌గారు ఉన్నారు. నేరుగా వెళ్ళి ‘ఇంకొక్కసారి చెప్పండి’ అన్నా. ఆయన కూడా చేసి చూపించారు. ‘రెడీ అండీ’ అన్నా. టేక్‌ అనగానే ఫట్‌మని చేశా. డైరెక్టర్‌గారు ‘ఓకే’ అన్నారంతే. ఆ నటరాజే నన్ను కాపాడాడనుకున్నా. అంతేనండీ... అక్కడి నుంచి ఆ వేషాన్ని చెడుగుడు ఆడుకుంటూ వెళ్ళిపోయా. దాన్లో ఎన్నెన్ని డైలాగులు ఉంటాయో! ‘ఈ ఫోన్ కనిపెట్టినవాడెవడ్రా?, హోటల్లో జలపాతాలేంట్రా?....’ అంటూ... ఒకటా రెండా? ఇలా చాలా డైలాగులు ఉంటాయి. అందులో నాకు బాగా నచ్చిన సీన్ ఒకటుంది. ఇప్పుడు చూసినా నాకు ఇంకోసారి చూడాలనిపిస్తూ ఉంటుంది.‘మేడమీద కూర్చుని కలగంటాను. 24 గంటలు తాగుతూనే ఉంటాను. అది ఎక్కదు. అంతలో హీరోని చూస్తా. ‘దొరికాన్రా బాబూ’ అంటా. అంతలోనే హీరో వచ్చి ‘ఎలా చంపమంటావ్రా నిన్ను’ అని అడుగుతాడు. నాలుగు పీకుతాడు. ‘బేర్‌’ మని అరిస్తే చిన్న బిల్డింగ్‌ దగ్గర తలకాయ ఉంటుంది.‘బిల్డింగ్‌ చిన్నదైపోయిందేంట్రా బాబూ’ అని అరుస్తా. తీరా చూస్తే అది కల. నిజంగా హీరో అప్పుడొస్తాడు. ఏదో డైలాగ్‌ చెప్తాడు. ‘ఇది కలే’ అంటా. అనడం కాదు కలే అనుకుని సీక్రెట్‌ అంతా హీరోకి చెప్పేస్తా. చెప్పి ఊరుకోకుండా ‘నువ్వేంది నన్ను పీకేది, ఇది కలే కదా’ అంటా. ‘థాంక్స్‌’ అని వెళ్ళిపోతాడు హీరో. అప్పుడు జ్ఞానోదయం అయ్యి ‘నా మస్తిష్కం దెబ్బతిందిరా బాబూ’ అంటా. ఇలా సాగుతుంది ఆ సీన్. ప్రజలకు కూడా బాగా రీచ్ అయింది ఆ సీన్. ఈ సినిమాకూ దాంతోపాటు నాకూ వచ్చినంత పేరు ఇంక దేనికీ రాలేదు. నా కెరీర్లో గొప్ప పాత్రల్లో ఇది కూడా ఒకటిగా మిగిలిపోయింది.

నంది అవార్డు వస్తుందని ఎదురుచూశా

అలాగే కోడి రామకృష్ణగారు మరో సినిమాలో చాలా మంచి వేషం చేయించారు నాతో. ఆ చిత్రం పేరు ‘పంజరం’. అందులో మీనా హీరోయిన్. మీనా భర్తగా నటించా. ‘అహనా పెళ్లంట’ ఛాయలున్న పాత్ర అందులో చేశా. సబ్జెక్ట్‌ కూడా చాలా బావుంటుంది. కానీ ఆడలేదు. ఎందుకు ఆడలేదో తెలియదు. నేను 102, 103 టెంపరేచర్‌తో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మొదలైంది ఆ సినిమా. అప్పుడు ముక్కా నరసింహారావు అని ఒక ఆర్టిస్ట్‌ ఉండేవాడు. ఆయనిప్పుడు లేడనుకోండి. కాలం చేసినట్టున్నాడు. ఆసుపత్రికి వచ్చి షూటింగ్‌కి రమ్మని పిలిచాడు. ‘జ్వరం అయ్యా.. నాకు. ఓపిక లేదు’ అన్నా.‘ఎహే, జ్వరం లేదు. ఏమీ లేదు. అవతల మీనా కాల్షీట్లు టైట్‌గా ఉన్నాయి. చచ్చిపోతున్నాం’ అని లాక్కెళ్లినంత పనిచేసి తీసుకెళ్లాడు. పిసినిగొట్టు పాత్ర అది. అందుకే ‘అహనా పెళ్లంట’ ఛాయలున్నాయని అన్నా. ‘పంజరం’లో ఓ సీన్ నాకు ఇష్టం. అందులో నా పాత్ర గమ్మత్తుగా ఉంటుంది. చెంబుకు తాడు కట్టి చెరువు ఒడ్డున కూర్చుని నీళ్ళు తోడుకుని పోసుకుంటా. ‘ఏంటండీ చెరువు ముందు పెట్టుకుని ఇలా తోడుకుని పోసుకుంటున్నారు’ అని అటుగా పోయేవారు అడుగుతుంటారు. ‘జలగండం ఉందంట్రా నాకు’ అంటా. ఇలా చాలా ఫన్నీ సన్నివేశాలు రాయడంలో కోడిగారు దిట్ట. పంజరం సినిమా ఆడకపోయినా నంది అవార్డులకు వెళ్తుందేమో, నంది అన్నా వస్తుందని చాలా ఎదురుచూశా. అక్కడ కూడా రాలేదు. పాపం కోడి రామకృష్ణగారు కూడా ఫీలై ఉంటారేమో. ఆయన ఎందుకు అవ్వరు... ఎంతైనా క్రియేటర్‌ కదా. బాధపడి ఉంటారు. నాకే అంతుంటే, ఆయనకి ఎంత ఉండాలి. అయినా ఒక్క మాటలో చెప్పాలంటే ఈవీవీగానీ, కోడిగారు కానీ ఈ కాలానికి పనికొచ్చే డైరెక్టర్లు కాదు. వాళ్ళ కథలు వేరు. వాళ్ళ క్రియేషన్ వేరు. వాళ్ళది చాలా గొప్ప, పెద్ద వ్యవహారం. వాళ్ళు కథలను, వైవిధ్యాన్ని నమ్ముకున్నారు. ఇప్పటివారి పరిస్థితి వేరు. అంతా టెక్నికల్‌గా ఆధారపడుతున్నారు. కథ, పటుత్వం లేదు. నాలాంటివాళ్లు ఆ మాటలంటే వినేవాళ్ళకి కోపం వస్తుంది. నిజానికి ఇప్పటివాళ్ళకి ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ పెద్దగా లేదు.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

FilmSerialమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.