నాకు సినిమాలంటేనే భయం.. కానీ: కోట (పార్ట్ 3)

ABN , First Publish Date - 2021-08-15T04:20:48+05:30 IST

‘కోట శ్రీనివాసరావు మనసులో కల్మషం ఏమీ ఉండదు. ఏమున్నా పైకే అంటారు’ అని పరిశ్రమ అర్థం చేసుకోబట్టే ఇన్నాళ్ళుగా ఇండస్ట్రీ‌లో ఉంటూ వచ్చాను. ఆ మాటకొస్తే నేను సినిమాల్లోకి వస్తాననిగానీ, ఇన్నేళ్ళుంటానని గానీ అనుకోలేదు. అసలు నాకు సినిమాలంటేనే భయం. అలా..

నాకు సినిమాలంటేనే భయం.. కానీ: కోట (పార్ట్ 3)

‘కోట శ్రీనివాసరావు మనసులో కల్మషం ఏమీ ఉండదు. ఏమున్నా పైకే అంటారు’ అని పరిశ్రమ అర్థం చేసుకోబట్టే ఇన్నాళ్ళుగా ఇండస్ట్రీ‌లో ఉంటూ వచ్చాను. ఆ మాటకొస్తే నేను సినిమాల్లోకి వస్తాననిగానీ, ఇన్నేళ్ళుంటానని గానీ అనుకోలేదు. అసలు నాకు సినిమాలంటేనే భయం. అలా ఊహించు కున్నవాణ్ణి కాదు. కానీ సినిమా నన్ను పిలిచింది. అక్కున చేర్చుకుంది. నెలలు, ఏళ్ళు దాటి పోయాయి. ‘‘కోట అనే కీర్తి మాత్రం ‘కోట’గట్టుకుని కూర్చుంది’’ అని గ్లాసులో నీళ్ళందుకున్నారు. ‘అన్నట్టు ఇంతకీ సినిమాలు అంటే నాకెందుకు భయమో, సినిమాల్లోకి రావాలని ఎందుకు అనుకోలేదో, నాటకాలు వేసుకుంటూ ఉంటేచాలని ఎందుకు భావించానో, నాటకాల నుంచి సినిమాల్లోకి ఎలా అడుగుపెట్టానో చెప్పనేలేదు కదూ.. ఆ వివరాలు తర్వాత చెప్తా’ అంటూ నమస్కారం చేశారాయన. లేచి నిల్చున్నారు. పాపం కాళ్ళు నొప్పేమో! బాధ అణచుకుని, నవ్వుతూ చూశారు.


నాన్నగారు డాక్టర్

మాది కృష్ణాజిల్లా గుడివాడ పక్కన బేతవోలు. మా తాతగారు కోట శేషయ్య. మా పెదతాతగారు (మా నాన్నగారి పెదనాన్నగారు) కోట కుటుంబయ్యగారు ఉపాధ్యాయుడు. ఆయనకు పిల్లలులేరు. మా నాన్నగారిని దత్తత తీసుకున్నారు. మా నాన్నగారు కోట సీతారామాంజనేయులు. ఆయన పుట్టింది పెరిగింది బేతవోలులోనే. చెన్నైలో వైద్యవిద్య అభ్యసించారు. వైద్యవిద్య అంటే ఇప్పట్లా ఎంబీబీయస్‌ కాదు. ఆ కాలంలో మెడిసిన్‌లో ఎల్‌ఎంపీ, డీసీఎం, ఆర్‌ఎంపీ డిగ్రీలు ఇచ్చేవారట. అలా మా నాన్నగారు ఎల్‌ఎంపీ చదివి కంకిపాడులో ప్రాక్టీసు పెట్టారు. అందువల్ల మా కుటుంబం బేతవోలు నుంచి కంకిపాడు వచ్చి స్థిరపడింది.


ఊళ్ళో గౌరవం

మా అమ్మానాన్నలకు పుట్టి పోయినవాళ్ళు పోగా మేం నలుగురు అప్పచెల్లెళ్ళు, ముగ్గురు అన్నదమ్ములు వెరశి ఏడుగురం మిగిలాం. మేం అందరం కంకిపాడులోనే పుట్టాం. నేను మధ్యవాణ్ణి. మా అన్నయ్య కోట నరసింహారావు. తమ్ముడు కోట శంకర్రావు. అప్పట్లో సమాజంలో టీచర్‌, డాక్టరు, లాయరు, కరణం, ఊరి ప్రెసిడెంట్‌.. ఇలా కొన్ని వృత్తులు, పదవుల్లో ఉన్నవారికి అమితమైన గౌరవం ఉండేది. వాళ్ళ కుటుంబంలోని వ్యక్తులపై కూడా ఆ గౌరవం, ప్రేమాభిమానాలు చూపించేవారు. ఎందుకు చెబుతున్నానంటే, మా అన్నయ్య నరసింహారావు కంకిపాడులోనే చదువుకున్నాడు. డాక్టర్‌గారి అబ్బాయి కదా అని టీచర్లు మా అన్నయ్యని ఏమీ అనేవారు కాదట. అసలు భయం నేర్పకపోగా, కేకలేయడానికి కొట్టడానికి కూడా జంకేవారట. అందువల్లనే మా అన్నయ్య చదువు చెడిపోయిందని మా నాన్నగారి భావన. అప్పటికీ మా అన్నయ్య ఓల్డ్‌ ఇంటర్మీడియట్‌ చేశాడు. అయితే పై చదువులు చదవకుండా ‘నాకు చదువు అబ్బడం లేదు నాన్నగారండీ’ అని ఒక శుభముహూర్తాన చెప్పేసి వ్యవసాయం చేసుకోవడం ప్రారంభించాడు. అక్కడుంటే నేను కూడా వాడిలానే అవుతానని అనుకున్నారేమో, నేను సెకండ్‌ఫారంలో ఉండగా నన్ను కంకిపాడు నుంచి పంపేయాలనుకున్నారు.


గురువు ఇంట్లో మకాం

కంకిపాడు పక్కనే పెనమలూరు. అక్కడ మా బంధువు రాధామాస్టరుగారు ఉండేవారు. ఆయన పూర్తిపేరు మల్లాది రాధాకృష్ణమూర్తి. అప్పట్లో పిల్లల్ని కూర్చోబెట్టి ట్యూషన్లు చెప్పేవారు. బంధువేకదా అని నన్ను తీసుకెళ్ళి వాళ్ళింట్లో ఉంచారు. అప్పట్లో ఎనిమిదో తరగతివరకు డైరెక్ట్‌ పరీక్షలు ఉండేవికావు. అప్పటిదాకా ప్రైవేటుగానైనా చదువుకోవచ్చన్నమాట. అలా సెకండ్‌ ఫారం నుంచి నా చదువు, మకాం రాధామేస్టారి ఇంట్లోనే. నాతో పాటు మా మేనత్తగారు కూడా అక్కడే ఉండేది. నేను చిన్నపిల్లాణ్ణి కావడంతో రాధామాస్టారి తమ్ముడు శివాజీ, ఆయన సోదరి రమణగారు అందరూ నన్ను గారాబంగా చూసుకునేవారు. నాతోపాటు ఆయన దగ్గర దాదాపు 50 మంది పిల్లలు చదివేవారు. ఆ విధంగా నేను గురువు ఇంట్లోనే ఉండి చదువుకుంటూ వారానికి ఒకసారి మా ఇంటికి వెళ్లేవాణ్ణి.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-08-15T04:20:48+05:30 IST