ఇప్పుడా విషయం మా చిన్నమనవడు కూడా చెప్పేస్తున్నాడు: కోట (పార్ట్ 27)

ABN , First Publish Date - 2021-09-19T03:33:09+05:30 IST

కానీ సినిమాల్లోకి వచ్చి ప్రయత్నాలు చేస్తున్న కుర్రాళ్లకి నేను చెప్పేది ఒక్కటే. ‘పాత సినిమాలు చూడాలి’. ‘పాత సినిమాలు టెక్నికల్‌గా ఏం బావుంటాయండీ?’ అంటారు కొందరు. అలాంటి వారు ముందు సాంకేతిక అంశాలు పక్కనపెట్టి..

ఇప్పుడా విషయం మా చిన్నమనవడు కూడా చెప్పేస్తున్నాడు: కోట (పార్ట్ 27)

కుర్రకారుకి సాధన తక్కువ-వాదన ఎక్కువ

కొన్నిసార్లు ఇంట్లో ఉన్నప్పుడు నాక్కూడా చాలా అనిపిస్తూ ఉంటుంది. కొత్త కొత్త ఐడియాలు వస్తుంటాయి. ఏవో ఆలోచిస్తూ ఉంటా. ఫలానా తరహా పాత్రలు చేస్తే బావుంటుంది అని కోరిక కలుగుతుంది. కానీ నిజంగా నాకు ఆ పాత్రలు వచ్చినా చేయగలనా? ఆయా వేషాలకు తగ్గ వయసు ఉంటుంది. ఆ వయసులోనే వాటిని చేసేయాలి. మలి వయసులో చేయలేం. నిజంగానే ఐడియా గొప్పగా ఉంది.. ఎందుకు వేస్ట్‌ చేయడం అని ఆలోచించి ఎవరికైనా ‘నాయనా ఇదిగో ఈ వేషం అనుకున్నా. ఎవరికైనా బావుంటుందేమో చూడండయ్యా’ అని డైరెక్టర్లతో చెప్పామనుకోండి. వినరు. ‘ఆ వీళ్లకేం పనీపాటా లేదు. ఏం చెయ్యాలో అర్థంకాక ఇలాంటి మాటలు మాట్లాడుతూ కూర్చుంటారు. పాత చింతకాయ పచ్చడి’ అని పెడచెవిన పెడతారు. ‘ఏదో పెద్దాయన చెబుతున్నాడే, వింటే బావుంటుందేమో’ అనే ఆలోచన ఎవరికీ లేదు. నా దృష్టిలో ఇప్పుడున్న కుర్రకారుకు సాధన తక్కువ. వాదన ఎక్కువ. సాక్షాత్తు సిటీ పోలీసు కమిషనరే వచ్చి ‘నాయనా ఎడమవైపు నడవండ్రా’ అన్నారనుకోండి. ఏదో బాధ్యతగల అధికారి చెబుతున్నాడని ఎవరూ అనుకోరు. ‘ఏం కుడివైపు నడిస్తే ఏమవుతుంది’ అని ఎవడో మొదలుపెడతాడు. వాడి చుట్టూ కొంతమంది చేరుకుంటారు. అలాంటివారికి చెప్పి ఏం ప్రయోజనం? కానీ సినిమాల్లోకి వచ్చి ప్రయత్నాలు చేస్తున్న కుర్రాళ్లకి నేను చెప్పేది ఒక్కటే. ‘పాత సినిమాలు చూడాలి’. ‘పాత సినిమాలు టెక్నికల్‌గా ఏం బావుంటాయండీ?’ అంటారు కొందరు. అలాంటి వారు ముందు సాంకేతిక అంశాలు పక్కనపెట్టి సినిమా చూడాలి. భాష, యాస ముఖ్యం. భాషలో పట్టువిడుపులు ముఖ్యం. పాతతరం నటీనటుల డైలాగ్స్‌లో ‘ఎక్కడ ఫుల్‌స్టాప్‌ ఉంటుంది? ఎక్కడ కామా ఉంటుంది? ఎక్కడ ఆశ్చర్యార్థకం ఉంటుంది?’ వంటి వన్నీ గమనించాలి. అలా చేయాలంటే పాత సినిమాలు చూడాలి. జనరంజకంగా సినిమా తియ్యడం కోసం ద్వందార్థాలతో డైలాగులు రాయాల్సిన అవసరం లేదు.


మేక్‌ బిలీఫ్

రేలంగి వెంకట్రామయ్యగారు చేసిన కామెడీలో ద్వంద్వార్థాలు లేవు కదా. ఉదాహరణ ‘మాయాబజార్‌’. ఆ సినిమాలో వంగరగారు, అల్లు రామలింగయ్యగారు భోజనం చేసివచ్చి తివాచీమీద కూర్చునే సీన్ ఉంది. దానికి వైర్‌వర్క్‌ వాడారని మనకు తెలుస్తుందా? ఇప్పుడు అలాంటి షాట్‌లు తీయాలంటే లక్షలు కావాలి. అంత ఖర్చుపెట్టి తీసినా ‘అవన్నీ గ్రాఫిక్స్‌ తాతా’ అని మా చిన్నమనవడు కూడా చెప్పేస్తున్నాడు. నిజానికి అప్పటి ఎక్విప్‌మెంట్‌ చిన్నది. అంత తక్కువలోనే అప్పటివారు అంతగొప్ప సినిమా తీసి చూపించారు. సినిమా అనేది మేక్‌ బిలీఫ్‌. ప్రేక్షకులను నమ్మించాలి. ఏడవకుండా ఏడిపించాలి, నవ్వకుండా నవ్వించాలి. కొట్టకుండా కొట్టాం అనిపించాలి.


కథే కీలకం!

సినిమా తీయాలంటే సబ్జెక్ట్‌ అవసరం. దాసరి నారాయణరావుగారు, రాఘవేంద్రరావుగారు, విశ్వనాథ్‌గారు లాంటి గొప్ప డైరెక్టర్లు అప్పట్లో రైటర్లని పెట్టుకుని ప్రతిపాత్రనీ డిస్కస్‌ చేసేవారు. దాని వల్ల నాణ్యత పెరుగుతుంది. కొంతమందిలాగా వాళ్ళే రాసి, వాళ్ళే తీస్తే... చూసేది కూడా వాళ్ళేనేమో! రాయడం తప్పు అనను. కాకపోతే దర్శకుడే రాసినప్పుడు యాక్సిడెంటల్‌గా బావుంటే ఫర్వాలేదు. ఒకవేళ బాగోపోతే...? కొన్నిసార్లు షూటింగ్‌లకు వెళ్ళినప్పుడు ‘రేపటి సీన్ ఏంటి బాబూ’ అని అడుగుతాను. ‘రేపు షూటింగ్‌కి రాగానే చెప్తానండీ’ అంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి అలవాటు ఈవీవీకి లేదు. అందరినీ కూర్చోపెట్టి ముందే చెప్పేసేవాడు. నేను కూడా పాత్రపరంగా ఏమైనా చెప్పాలంటే బైట మాట్లాడుకున్నప్పుడు తప్ప, ఎప్పుడూ సెట్లో నోరుతెరిచి ఇలాచేస్తే బావుంటుందని ఈవీవీకి చెప్పలేదు.


ఆ టోపీ స్పెషల్‌!

జగపతిబాబు హీరోగా రమ్యకృష్ణ, ఊహ హీరోయిన్లుగా ఈవీవీ తీసిన ఆయనకిద్దరు చిత్రంలో నా పాత్ర చాలా గమ్మత్తుగా ఉంటుంది. మొదటిరోజు షూటింగ్‌ కోసం సెట్‌కి వెళ్ళా. నేను వేసుకోవాల్సిన కాస్ట్యూమ్స్‌ ఇచ్చారు. వేసుకున్నాక అక్కడో టోపీ కనిపించింది. చూడ్డానికి చాలా తమాషాగా ఉంది. అది పెట్టుకుని వెళ్ళి ఈవీవీ ముందు నిలుచున్నా. ‘భలే ఉంది కోటయ్యా. ఎక్కడపట్టావు?’ అన్నాడు. ‘అక్కడ నా కాస్ట్యూమ్స్‌ పక్కనవుంటే నువ్వే తెప్పించావనుకున్నా’ అన్నా. ‘అబ్బే లేదే. ఇందులో నువ్వు చేసే కేరక్టర్‌కి చక్కగా సరిపోతుంది. వాడుకుందాం’ అన్నాడు. ఆ ఒక్క సందర్భంలో తప్ప ఈవీవీ, నేనూ సెట్లో ఎప్పుడూ పాత్రల గురించి మాట్లాడుకున్నది లేదు. అప్పటి డైరెక్టర్లు ఓ పాత్రని డిజైన్ చేసినా, ఒక కేరక్టర్‌ రాసినా చాలా స్టడీ చేసేవారు. ఇప్పట్లా గాలివాటం కాదు. అప్పుడు సినిమా ప్రభావం మనుషులమీద ఉంది. ఇప్పుడు మనుషుల ప్రభావం సినిమామీద ఉంది.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-09-19T03:33:09+05:30 IST