‘బాటిల్‌లో వైన్ పాతదే.. కానీ షేప్‌ కొత్తది. వైన్ మీదేనండీ’ అని చెప్పా: కోట (పార్ట్ 25)

ABN , First Publish Date - 2021-09-17T01:57:28+05:30 IST

‘అయ్యా కోటయ్య.. మీతో రెండు నిమిషాలు మాట్లాడుదామని... కాలక్షేపం’ అన్నారు. ‘ఇప్పుడే వచ్చానండీ షూటింగ్‌ నుంచి. మీరు కబురుపెడితే నేనే వచ్చేవాణ్ణి కదా’ అన్నా. ‘అట్టాకాదుగానీ ఫర్వాలేదు. కాసేపు మాట్లాడుకుందాం. అరగంటో, పావుగంటో కూర్చుంటాను’ అని లోపలికి..

‘బాటిల్‌లో వైన్ పాతదే.. కానీ షేప్‌ కొత్తది. వైన్ మీదేనండీ’ అని చెప్పా: కోట (పార్ట్ 25)

గుమ్మడి ప్రశంస

నా నటన గురించి ఎంతమంది ప్రశంసించినప్పటికీ, గుమ్మడిగారు నన్ను తొలిసారి పలకరించి, మనసారా ఆశీర్వదించిన తీరు జీవితాంతం గుర్తుండి పోతుంది. ఓ రోజు విజయనిర్మలగారి దర్శకత్వంలో సినిమా చేస్తున్నా. కృష్ణగారు హీరో. నేను తొమ్మిది గంటలకు ఇంకో షూటింగ్‌కి వెళ్లాలి. అందుకోసం నాకు సంబంధించిన సన్నివేశాలు ముందు తీశారు. అందులో భాగంగానే గుమ్మడిగారిని, కృష్ణగారిని స్తంభాలకు కట్టేశారు. నాకు ఇచ్చిన డైలాగ్స్‌ చెప్పేశా. షాట్‌ ఓకే అయింది. ‘ఏయ్‌. ఎవరయ్యా అక్కడ? ముందు మా కట్లు విప్పదీయండి. ఎండ చిటచిటమంటోంది’ అన్నారు గుమ్మడిగారు. ఆయన మాటలు వింటూనే నేను మేకప్‌ తీస్తున్నా. వీపుమీద తాడుతో సర్రున చరిచినట్టైంది. గభాల్న వెనక్కి తిరిగి చూశా. ఇంకో రెండు పీకారు గుమ్మడిగారు. ‘ఏంటండీ’ అనబోయా. అంతలోనే ఆయన, ‘నీ దుంపతెగ ఇన్నాళ్లూ ఎక్కడున్నావయ్యా అసలు. నువ్వు చేస్తుంటే నాకు నాగభూషణం, రావుగోపాల రావు గుర్తుకొస్తున్నారు. అంత పెద్ద డైలాగు గుక్కతిప్పుకోకుండా ఎంత స్పష్టంగా చెప్పావ్‌’ అని మెచ్చుకున్నారు. గుమ్మడిగారితో పోలిస్తే నేనెక్కడ? తెలుగుభాషను ఆయన చాలా స్పష్టంగా పలుకుతారు. డైలాగ్‌ డిక్షన్, క్లారిటీ, ఒత్తుల్ని స్పష్టంగా పలకడం... ఇలా భాషకు సంబంధించి ఎన్నిరకాల మాటలుంటాయో అన్నిటిలోనూ ఆయన పర్ఫెక్ట్‌. అలాంటి వ్యక్తి మెచ్చుకునేసరికి ఆనందమేసింది.


‘థాంక్యూ సార్‌. వస్తానండీ. ఇంకో షూటింగ్‌ ఉంది’ అని చెప్పి ఆ రోజుకు సెలవు తీసుకున్నా. ఆ తర్వాత చాలాసార్లు ఆయనతో కలిసి ఔట్‌డోర్‌ షూటింగ్‌లకు వెళ్లా. షాట్‌ గ్యాపుల్లో మేం కలిసి కూర్చున్న ప్రతిసారీ ఆయన ‘ఎక్కడ కామా ఉండాలి? ఎక్కడ ఫుల్‌స్టాప్‌ ఉండాలి? ఎక్కడ ప్రశ్నార్ధకం ఉండాలి?’ వంటి విషయాల గురించి చెప్పేవారు. మేం ఎక్కువగా నాటకాల గురించి మాట్లాడుకునేవాళ్లం. మాధవపెద్ది వెంకట్రామయ్యగారి శిష్యుడు గుమ్మడిగారు. ఎప్పుడూ తన గురువు గారిని గుర్తుచేసుకునేవారు. ఆయన దగ్గర శిష్యరికం చేసిన కారణంగానే తెలుగుపై తనకు మంచిపట్టు వచ్చిందని చెప్పేవారు. ఎప్పుడైనా ఆయనకు నా నటన నచ్చితే ‘బావుంది’ అని ఏదో ఒక్కమాటలో తేల్చి చెప్పడంలాంటివి చేసేవారు కాదు. ఫోన్ చేసి ‘కోటా.. ఫలానా పాత్ర చూశా. ఫలానా సన్నివేశంలో బాగా చేశావ్‌. నువ్వు చేసిన ఫలానా అంశం బాగుంది’ అని వివరంగా చెప్పేవారు.


రావుగోపాలరావు ప్రశంస

నేను పరిశ్రమలో అడుగుపెట్టేనాటికే రావుగోపాలరావుగారు విలక్షణ నటుడిగా అత్యున్నతమైన స్థాయిలో ఉన్నారు. ఆయనతో కలిసి చాలా చిత్రాల్లో నటించినా రెండు, మూడు సన్నివేశాలు మాత్రం ఎప్పుడూ నా మనసులో పదిలంగా ఉంటాయి. రావుగోపాలరావుగారు హైదరాబాద్‌ షూటింగ్‌కి వస్తే ప్రశాంత కుటీర్‌లో బస చేసేవారు. ఆయన ఎప్పుడొచ్చినా ఫ్యామిలీతోనే వచ్చేవారు. నేను కూడా అక్కడే ఉండేవాణ్ణి. నాది రూమ్‌ నంబర్‌ నాలుగు. అది పర్మనెంట్‌. ‘అల్లరి అల్లుడు’ షూటింగ్‌ జరుగుతున్నప్పుడు అనుకుంటా. ఇద్దరం ప్రశాంత కుటీర్‌లోనే ఉన్నాం. ఆ చిత్రంలో నాగార్జునగారు హీరో. నగ్మా, మీనా హీరోయిన్లు. అందులో వాణిశ్రీగారి బ్రదర్‌గా నేను, భర్తగా రావు గోపాలరావుగారు నటించాం. ఒకరోజు షూటింగ్‌ అయిపోయింది. నేను కుటీర్‌కి వెళ్లా. స్నానం చేసి ఫ్రెష్‌ అవుదామనుకుంటున్నప్పుడు కాలింగ్‌ బెల్‌ మోగింది. ఎవరో రూమ్‌బోయ్‌ అనుకుని తలుపు తీశా. ఎదురుగా రావుగోపాలరావుగారు. నేనేమో తుండుగుడ్డ చుట్టుకుని ఉన్నా.


‘అయ్యా కోటయ్య.. మీతో రెండు నిమిషాలు మాట్లాడుదామని... కాలక్షేపం’ అన్నారు. ‘ఇప్పుడే వచ్చానండీ షూటింగ్‌ నుంచి. మీరు కబురుపెడితే నేనే వచ్చేవాణ్ణి కదా’ అన్నా. ‘అట్టాకాదుగానీ ఫర్వాలేదు. కాసేపు మాట్లాడుకుందాం. అరగంటో, పావుగంటో కూర్చుంటాను’ అని లోపలికి వచ్చారు. నేను లుంగీ కట్టుకుని వచ్చి కూర్చున్నా. ఏవేవో విషయాలు, పిచ్చాపాటీ మాట్లాడుకున్నాం. అరగంట, గంట దాటింది. ఆయన ఒక్క నిమిషం గంభీరంగా మారిపోయారు. ‘ఏం లేదయ్యా. మా పిల్లలు నీకు ఫ్యాన్స్ అయ్యా. ఆయన నటించిన ఓ సినిమా చూడండి నాన్నా అని మూడేళ్లుగా చంపుతున్నారయ్యా నన్ను. ‘ఒక్క సినిమాను చూడండి, అందులో కోటగారు ఎలా చేశారో మీకే తెలుస్తుంది అని మరీ మరీ చెప్పారు. నా బిజీ, నా గోలలో నేను ఇన్నాళ్లూ చూడ లేదు. ఇదిగో ఈ రోజు నా రూమ్‌లో నీ సినిమా వీడియో కేసెట్‌ వేస్తే పిల్లలు చెప్పిన మాట గుర్తొచ్చి చూశాను’ అన్నారు.


అప్పట్లో రూమ్‌లో కేసెట్లు వేసేవారులెండి. రూముల్లో ఉన్న వారికి ఖాళీ ఉంటే కాలక్షేపం కోసమని ఏదో ఒక కేసెట్‌ వేసేవారు. ‘ఇవాళే ఆ కేసెట్‌ చూశానయ్యా. నీకు మంచి భవిష్యత్తు ఉంది. మరలా విలన్ అనే పదానికి కొత్త ఒరవడి తెచ్చే నటుడు దొరికాడని నాకు అనిపించింది. నువ్వు డైలాగ్‌ చెబుతుంటే ఫైర్‌ ఇంజన్ గణగణగణమని గంట కొట్టినట్టు ఉంటుంది’ అని ప్రశంసించారు. ‘ఏ సినిమా సార్‌ అది’ అన్నా. ‘శత్రువు’ అన్నారు. నేను వెంటనే సమాధానంగా ‘నా గొప్పతనం ఏమీ లేదండీ. బాటిల్‌లో వైన్ పాతదే. కానీ షేప్‌ కొత్తది. వైన్ మీదేనండీ. కాకపోతే బాటిల్‌ షేప్‌ నా రూపంలో ఉందండీ. మీలాగే చేశాను’ అన్నా. అందుకాయన కాస్త దగ్గరగా జరిగి, ‘చూడు కోటయ్యా. రావుగోపాలరావులో ఒక్క రావుగోపాలరావు మాత్రమే ఉన్నాడు. నాగభూషణంగారు నటిస్తే ఆయనే కనిపిస్తారు. కానీ నువ్వు వేషం చేస్తే ఆ వేషంలో నాగభూషణం, రావుగోపాలరావు ఉన్నారు. అంతేకాదు మాతోపాటు కోట శ్రీనివాసరావు ప్రత్యేకత కూడా కనిపిస్తోంది. చక్కటి భవిష్యత్తు ఉన్న నటుడివి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి’ అన్నారు. నేను రెండు చేతులెత్తి నమస్కారం చేస్తూ ఆయనవైపు అలాగే చూస్తూ కూర్చున్నా. ‘సర్లేవయ్యా. ఫ్రెష్‌ అయి రెస్ట్‌ తీసుకో. రేపు ఉదయం కలుద్దాం’ అని తన రూమ్‌కి వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా రెండుమూడు సార్లు నేను డైలాగు చెప్పినప్పుడు రావుగోపాలరావుగారు మెచ్చుకున్నారు. కాకపోతే ఓ మోస్తరు పరిచయం కలిగే సమయానికే గోపాలరావుగారు రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఆయన్ని కలవడానికి ఎవరో ఒకరు వస్తూ ఉండేవారు. షాట్‌ చేయడం, వాళ్లతో మాట్లాడటం, కార్యాచరణ రూపకల్పన చేయడంలో ఆయన బిజీగా ఉండేవారు. మరికొన్నాళ్లకి ఆరోగ్యం కూడా క్షీణించసాగింది. షాట్‌ ఉన్నప్పుడు వచ్చి డైలాగ్‌ చెప్పేవారు. ఆ తర్వాత వెళ్లి సోఫాలో కూర్చునేవారు. ఆ సమయంలో వాళ్ల కుటుంబసభ్యులు ఆయనతోపాటే ఎక్కువ సమయం గడిపేవారు. ఏదేమైనా విలక్షణ నటుడితో పనిచేసే అవకాశాలు అలా నాకు పలుమార్లు వచ్చాయి.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-09-17T01:57:28+05:30 IST