రామ్‌గోపాల్‌ వర్మ శైలి కూడా అలాగే ఉంటుంది: కోట (పార్ట్ 23)

మరుసటి రోజు చెన్నైకి చేరుకున్నా. అక్కడి నుంచి వరుస చిత్రాలతో బిజీబిజీగా సాగింది వ్యవహారం. అప్పట్లో చెన్నైలో నుంగంబాక్కంలో మా ఇల్లు ఉండేది. వళ్లువర్‌ కోట్టమ్‌ పక్క సందుల్లోనే అన్నమాట. ఆ పక్కనే అశ్వనీదత్‌గారి ఆఫీసు. మా ఏరియా ఎంట్రన్స్‌లోనే గుడ్‌లక్‌ ప్రివ్యూ థియేటర్‌ ఉండేది. అందులో ‘శివ’ ప్రివ్యూ వేసి నన్నూ పిలిచారు. అప్పట్లో నన్ను సినిమా ప్రివ్యూకి పిలవడం, నేను వెళ్లి ప్రివ్యూ చూడటం అంటే చాలా గొప్ప. సరేనని పిలవగానే వెళ్లా. నేను చూసిన తొలి ప్రివ్యూ కూడా నాకు గుర్తున్నంత వరకూ అదే. సినిమా చూసి బైటకు రాగానే శివనాగేశ్వరరావు, ఉత్తేజ్‌.. వీళ్లందరూ నన్ను చుట్టేశారు. ‘కోటగారూ సినిమా ఎలా ఉందండీ? సినిమా ఎలా ఉందీ?’ అని అడిగారు. ‘సినిమా చాలా బాగా వచ్చిందండీ. కాకపోతే ఏంటంటే దీని రేంజ్‌ని మాత్రం నేను గెస్‌ చేయలేకపోతున్నాను’ అన్నా. నిజంగా ఆ సినిమా ఎంత అనూహ్యమైన సక్సెస్‌ సాధించిందో అందరికీ తెలిసిందే. వేషానికి ఎంత పేరు వచ్చిందో! ఇప్పటికీ చాలామంది నన్ను చూసినప్పుడల్లా ‘మాచిరాజు... మాచిరాజు’ అనే పిలుస్తుంటారు. అప్పుడనే కాదు.. ఆ తర్వాత కూడా రామ్‌గోపాల్‌వర్మకు ఏ సినిమా చేసినా సరే.. నన్ను ఆ చిత్రంలోని పాత్రతోనే జనాలు పిలుస్తారు. అంత పాపులర్‌ అయ్యాయి అతని చిత్రాల్లో నేను చేసిన పాత్రలు. ఏదైతేనేం.. శివతో మొదలైన మా పరిచయం ఆ తర్వాత కూడా కంటిన్యూ అయింది.


మనీ సినిమా చాలా స్పెషల్‌

‘కోటగారు, ఒకసారి రండీ’ అని వర్మగారు కబురుపెడితే వెళ్లాను. మామూలుగా రామ్‌గోపాల్‌వర్మ సినిమాల్లో స్ర్కిప్ట్‌ పుంఖానుపుంఖాలుగా రాసిన పుస్తకంలాగా ఏమీ ఉండదు. ఆయన తన భావాలను అసిస్టెంట్లకు చెప్పి ఉంచుతారు. స్పాట్‌లో డైలాగ్‌ రైటర్లు ఉంటారు కాబట్టి అప్పటికప్పుడు డైలాగ్స్‌ అనుకుంటారు. వాటిని టేప్‌రికార్డర్‌లో రికార్డు చేసేస్తారు. మనీ సినిమా చేసేనాటికి నాకు వాళ్లతో కాస్త చనువు రావడంతో నేను కూడా తోచింది చెప్పేవాణ్ణి. ఆ చిత్రంలో ‘భద్రం బీకేర్‌ఫుల్‌ బ్రదరూ..’ అనే పాట ఉంది కదా. అదీ, దాంతో పాటు కొన్ని సీన్లు ఒక్కరోజులోనే పూర్తి చేశారు. ఆ పాటకు సంబంధించి డ్యాన్స్ డైరెక్టర్‌ ఉన్నట్టు కూడా నాకు గుర్తు లేదు. ఉదయం 11-11.30 మధ్యలో షూటింగ్‌ మొదలుపెట్టారు. మామూలుగానే లంచ్ బ్రేక్‌ ఇచ్చారు. అయితేనేం రాత్రి ఏడున్నరకి మొత్తం ఆ పార్ట్‌ షూటింగ్‌ పూర్తి చేసేశారు. ఇక్కడో విశేషం చెప్పుకోవాలి. అదేంటంటే ఆ పాటను ముందు పరేశ్ రావల్‌గారిమీద తీశారట. అది వర్మగారికి పెద్దగా నచ్చలేదట. అందువల్ల నాతో రీషూట్‌ చేశారని తెలిసింది. అయినాగానీ, ఆ సినిమా ప్రివ్యూ చూసిన వారు నా ట్రాక్‌, ఆ పాట బాగోలేదని, తీసేయమని చెప్పారట. కానీ వర్మగారు మాత్రం ఎవరి మాటా వినలేదు. సినిమా విడుదలైన తర్వాత వర్మ కాన్ఫిడెన్స్‌కే మార్కులు పడ్డాయి. ఇప్పటికీ అమెరికాకు వెళ్లినప్పుడు పిల్లలు మనీ సీన్‌ గుర్తుంటే చెప్పమని అడుగుతుంటారు. సేమ్‌ కార్‌.. అనే డైలాగ్‌ ఇప్పటికీ చెప్పుతుంటా.

టాలెంట్‌ వెలికితీసే వర్మశైలి

రాముగారితో ‘మనీ’ తర్వాత చేసిన సినిమా ‘గాయం’. ఎస్‌ఎస్‌ క్రియేషన్స్‌ చిత్రం. అందులో వేషం ఎంత పెద్దదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాలుగున్నర రోజుల్లో నావేషం చిత్రీకరణ పూర్తిచేశారు. అందుకే అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. వర్మగారు ఈ జనరేషన్‌లో గొప్ప డైరెక్టర్‌, చాలా మంచి టెక్నీషియన్‌ అని. ఆయన చిత్రంలో ప్రతి క్యారెక్టర్‌నీ చాలా బాగా డిజైన్‌ చేస్తారు. ఆయన డైరెక్షన్ శైలి చూస్తే, మన ఊళ్ళలో కురుక్షేత్రం నాటకం వేయించిన దర్శకులు గుర్తుకొస్తారు నాకు. ఆ నాటకం ప్రత్యేకత ఏంటంటే, అందులో ముగ్గురు కృష్ణులు ఉంటారు. పడకసీన్‌ కృష్ణుడు, రాయబారం కృష్ణుడు, యుద్ధం కృష్ణుడు. ఈ తరానికి తెలియకపోవచ్చు. ఒకప్పుడు ఊళ్లలో ఇవన్నీ చాలా బాగుండేవి. అసలు ఆ కృష్ణుడికి, ఈ కృష్ణుడికి పర్సనాలిటీ వేరు. వాయిస్‌ వేరు. పద్ధతి వేరు. హార్మోనియం పెట్టె వేరు. అంతా సెపరేటే.. అయితే జనాలు ముగ్గురికీ వన్స్‌మోర్‌లు కొట్టేవారు. ఎందుకంటే, ఆర్టిస్ట్‌ అనేవాడు ‘విత్ దేర్‌ పర్ఫార్మెన్స్‌, దె అరెస్ట్‌ ద ఆడిటోరియం’ అని మా గురువుగారు దేశిరాజు హనుమంతరావుగారు చెప్పేవారు. అలా వర్మ నటుడి టాలెంట్‌ బైటికి తీస్తాడు. పాత్ర, సన్నివేశం మాత్రమే చెప్పేవారు వర్మ. ఫలానా తరహాలో చేయమని ఎప్పుడూ చెప్పేవారు కాదు. ‘నువ్వు ఎలా చేస్తావో అలా చెయ్‌’ అంటారు అంతే. నా నాటకాల గురువు భావనాచార్యులుగారి దర్శకత్వంలో ‘దేశంలో దొంగలు పడ్డారు’ నాటకం వేశాం. నలుగురు నిరుద్యోగులైన కుర్రాళ్లు పస్తులతో బాధపడే సీన్‌. నేనూ వాళ్లలో ఒకడిగా చేశా. ఓ సన్నివేశంలో కోపంగా అరవాలి. ‘ఈ దేశం ఏమైపోతుంది?’ అని గట్టిగా అరిచా. వెంటనే మా గురువుగారు చేతికి అందిందితీసి నాపైన విసిరేశారు. ‘ఒరేయ్‌ గాడిద.. అట్టా దున్నపోతులా అరుస్తావేంట్రా? తిండీతిప్పలు లేనివాడు అలా అరుస్తాడట్రా?’ అని తిట్టారు. ‘మరేంచెయ్యమంటారు?’ అని అడిగా. ‘నువ్వేం చేస్తావో నాకు తెలియదు. కానీ చెయ్యి. నువ్విట్టా చెయ్యి అని చెప్పాననుకో. నన్ను ఇమిటేట్‌ చేస్తావు. అది తప్పు. అలా వద్దు. నువ్వు ఎలా చేస్తావో అలా చెయ్యి. అందులో ఏది బావుంటుందో చెప్తా’ అన్నారు.. సరిగ్గా రామ్‌గోపాల్‌వర్మ శైలి కూడా ఇలాగే ఉంటుంది.


ఆ తరహా శైలి వల్ల నటుడిలోని ఒరిజినాలిటీ బైటపడుతుంది. ‘నువ్వు చేసింది ప్రజలకు నచ్చితే వెరీ గుడ్‌. అలా కాకపోతే నీ బ్యాడ్‌లక్‌’ అంటారాయన. వర్మగారు సెట్‌లో కోపంగా ఉండరు. సరదాగా ఉంటారు. వర్మ వర్క్‌లోకి వస్తే, సెట్‌ పిన్‌డ్రాప్‌ సైలెన్స్‌తో, వర్క్‌ మోడ్‌లో ఉంటుందంతే. ఒక్కసారి ఆయన స్టార్ట్‌ అన్నారంటే, వర్క్‌ చేస్తూనే ఉంటారు. అనవసర బ్రేకులు, కబుర్లు చెప్పుకోవడాలు ఉండవు. ప్రతి క్షణం షూటింగ్‌ జరుగుతూనే ఉంటుంది.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

FilmSerialమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.