మెగా ఫ్యామిలీ మెంబర్‌ని.. బన్నీ మాటలు మరచిపోలేను: కోట (పార్ట్ 22)

డా.వెంకటేశ్వరరావు నిర్మించిన ‘రౌడీ అల్లుడు’ సినిమాలో నటించాను. అందులో నా క్యారక్టర్‌ అల్లు రామలింగయ్యగారి పక్కన. తొలి రోజు షూటింగ్‌కి వెళ్లినప్పుడు అల్లు రామలింగయ్యగారు నన్ను పిలిచి, ‘జాగ్రత్త జాగ్రత్తయ్యో... అదీ నా పక్కన వేషం. జాగ్రత్తగా చెయ్యి. రావు గోపాలరావుగారి వేషం నీకు వచ్చింది’ అని జాగ్రత్తలు చెప్పారు. ఆ సినిమా వంద రోజుల వేడుక నెల్లూరులో జరిగింది. కారులో తీసుకెళ్లారు నెల్లూరికి. అక్కడికి రావుగోపాలరావుగారు వచ్చారు. ‘ఇది నేను వేయాల్సిన వేషం. కాల్షీట్లు కుదరలేదు. శ్రీనివాసరావుగారు బాగా చేశారు’ అన్నారు. ఆ తర్వాత ముత్యాలసుబ్బయ్యగారి దర్శకత్వంలో ‘అన్నయ్య’లో నటించాను. అందులో మెగాస్టార్‌కి బాబాయ్‌గా చేశా. ఆ తర్వాత ‘బావగారు బావున్నారా’ అనే సినిమా చేశా. ఆ పాత్రలు కూడా బాగా పండాయి. వరుసగా సినిమాలు చేయడంవల్ల చిరంజీవిగారితో చనువు ఏర్పడింది. వాళ్ల ఫ్యామిలీలో నేనూ ఒక మెంబర్‌లాగా అయిపోయా. ఆ మధ్య అల్లు రామలింగయ్యగారి అవార్డు నాకు ఇచ్చారు. ఆ వేడుకలో బన్నీ మాట్లాడుతూ ‘నా మనసులో నుంచి వచ్చిన మాట ఇది... తాతగారి అవార్డు ఇప్పటికి చాలా మందికి ఇచ్చారు. ఈరోజు కోట శ్రీనివాసరావుగారికి ఇవ్వడంతో ఆ అవార్డుకి గౌరవం వచ్చినట్టు అనిపించింది’ అన్న మాటలు మరచిపోలేను.


బక్కపలచటి ఓ కుర్రాడు.. వర్మ

ఖైదీ నెంబర్‌ 786లో నటిస్తుండగా ఒకరోజు మధ్యాహ్నం మూడున్నర, నాలుగు సమయంలో బాయ్‌ వచ్చి ‘సెట్‌ బయట ఒకతను మీకోసంవచ్చి వెయిట్‌ చేస్తున్నారండీ. హైదరాబాద్‌ నుంచి వచ్చారట. కలవాలంటున్నారు. ఏదో సినిమా గురించట’ అని చెప్పాడు. ఎవరా? అని బయటికివెళ్లి చూశా. బక్కపలచటి కుర్రాడు కనిపించాడు. నన్ను చూడగానే ఎదురుగా వచ్చి ‘నమస్కారమండీ. నా పేరు రామ్‌గోపాల్‌వర్మ. మీరు నన్ను చూశారో లేదో, మీరు కలెక్టర్‌గారి అబ్బాయి చేస్తున్నప్పుడు నేను అక్కడ ఉండేవాడిని’ అని ఇంట్రడ్యూస్‌ చేసుకున్నారు. ‘నాగార్జునగారితో ఓ సినిమా చేస్తున్నాను. ‘శివ’ అని టైటిల్‌ పెట్టాం. అందులో మీకో వేషం ఉందండీ. దాని గురించి మీతో మాట్లాడదామని వచ్చాను’ అన్నారు. కేవలం నా గురించే వచ్చారో లేదో ఆయనకే తెలియాలి. ఏదైతేనేమీ వచ్చి మాట్లాడారు. అలా పొరుగూరు నుంచి నాకోసం ఒకరు రావడం, నన్ను కాల్షీట్లు అడగడం అదే తొలిసారి. అంతకు ముందెప్పుడూ అలా జరగలేదు. ‘మీరేమీ డేట్లు పెద్ద అడ్జస్ట్‌ చేయాల్సిన అవసరం లేదండీ. ఒకే ఒక్క రోజు వేషం. మీరు ఉదయాన్నే ఫ్లయిట్‌కి వస్తే, ఈవెనింగ్‌ ఫ్లయిట్‌కి పంపించేస్తా’ అని చెప్పారు. ఒకరోజు, రెండు రోజులు వేషాలు చేయను... ఇన్ని రోజులైతే చేస్తాను అని చెప్పే ఆలోచన అప్పట్లో నటులు ఎవరికీ ఉండేది కాదు. ఏ వేషాలు వెతుక్కుంటూ వస్తే అవి చేసుకుంటూ పోవడమే. అంతే. అంతకు మించి ఇంకేమీ తెలిసేది కాదు. ఆయన చెప్పిన తారీఖు రానే వచ్చింది. హైదరాబాద్‌కి వచ్చా. అన్నపూర్ణ స్టూడియో పక్కనే ఒక గెస్ట్‌హౌస్‌లో దిగా.

ఓన్‌ గెటప్‌, సింపుల్‌ డైలాగ్స్

‌నేను అప్పట్లో మామూలుగా పంచెని లుంగీలా కట్టుకుని, పైన తెల్ల చొక్కా వేసుకునేవాణ్ణి. అదే నా వేషధారణ. స్నానాలు చేసి రెడీ అయి ఎప్పట్లా పంచె కట్టుకుని అన్నపూర్ణలో షూటింగ్‌ అంటే అక్కడికి వెళ్లా. తీరా అక్కడ ఎస్‌. గోపాల్‌రెడ్డిగారు కనిపించారు. ‘శివ’ సినిమాకు కెమెరామేన్ ఆయనే. అప్పటికే ఆయనతో ‘అహనా పెళ్లంట!’ చేసిన అనుభవం ఉంది. పాత పరిచయం కావడంతో నన్ను చూడగానే ఆయన ‘ఏం కోటా బావున్నావా? ఏంటి సంగతులు? ఏమేమి సినిమాలు చేస్తున్నావు?’ అని ఆత్మీయంగా పలకరించారు. కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఉన్నాం. ‘సరే రెడీ అవ్వు. తర్వాత నీదే షాటు’ అన్నారాయన. ‘అదేనండీ. ఏం చేయాలో అర్థం కావడంలేదు. అసలు మేకప్‌ ఏంటో? గెటప్‌ ఏంటో? డ్రస్సు ఏంటో? అడుగుదామనుకుంటే ఎవరూ కనిపించడం లేదు. ఎవరిని అడగాలి? ఏమీ అర్థం కావడం లేదు. డైరెక్టర్‌గారు ఎక్కడున్నారో కనిపించడం లేదు. ఒకసారివెళ్లి కలవాలి కదా...’ అని అంటున్నా...‘ఏం అవసరం లేదు. మీరేసుకున్న డ్రస్సు సరిపోతుంది. బానే ఉంది. కూర్చోండి’ అనే గొంతు వినిపించింది. చూస్తే నా వెనుక నుంచి రామ్‌గోపాల్‌వర్మ గొంతు. డైరెక్టర్‌గారే చెప్పాక తిరుగేముంది. అలాగే కెమెరా ముందుకు నా కాస్ట్యూమ్స్‌తోనే వెళ్లా. ‘వాడెవడో కుర్రాడు.. మిమ్మల్ని మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు’.. అని డైలాగ్‌ చెప్పమన్నారు రాముగారు.


ఒకసారి రిహార్సల్‌ చేసి, కెమేరా ముందుకు వచ్చి చెప్పేశా. వెంటనే టేక్‌ ఓకే అన్నారు. ‘బావుంది కదా బావుంది’ అని వాళ్లు ఒకరితో ఒకరు అనుకుంటూ వెంటనే రెండో షాట్‌కి వెళ్లారు. అది కూడా సింగిల్‌ టేక్‌లో ఓకే కావడంతో యూనిట్‌ అంతా ‘షిఫ్ట్‌ షిఫ్ట్‌’ అన్నారు. అందరూ హడావిడిగా బయలుదేరారు. అన్నపూర్ణ స్టూడియో నుంచి సికింద్రాబాద్‌ చేరుకున్నాం. అక్కడ ఓ హౌస్‌లో షూటింగ్‌. అక్కడికి వెళ్లగానే రాముగారు నా దగ్గరకు వచ్చి ‘శివ అంటే నువ్వా, చాలా చిన్న కుర్రాడివయ్యా’ అనే డైలాగ్‌ చెప్పి నన్ను చెప్పమన్నారు. ‘ఏంటీ డైలాగ్‌... ఇంత సింపుల్‌గా ఉండాలా’ అని మనసులో అనుకున్నా. నన్ను తెలంగాణ నేటివ్‌ అనుకున్నారు నాగార్జున. నాటకాల్లో నటించడంవల్ల పెద్ద యాక్టర్లతో పనిచేయాల్సి వచ్చినప్పుడు కూడా దడ ఉండేది కాదు నాకు. డైరెక్టర్‌గారు చెప్పింది చేసేవాణ్ణి. అంటే అది పొగరు కాదు. నాటకాలవల్ల వచ్చిన అనుభవం.


నాగార్జునగారి కాంబినేషన్‌లో ఆ డైలాగ్‌ చెప్పేశా. అంతలో మళ్ళీ షిఫ్ట్‌ షిఫ్ట్‌ అన్నారు. ఆ గ్యాప్‌లోనే నాగార్జునగారితో మాట్లాడాను. ‘విన్నామండీ మీ గురించి. వెరీ గుడ్‌. చాలా బాగా చేశారు. మీ ప్రతిఘటన అవీ చూశాం’ అన్నారు నాగార్జునగారు. హీరో అలా చెప్తుంటే ఆనందంగానే ఉంటుంది కదా. ‘థాంక్సండీ’ అన్నాన్నేను. ‘మీ వాయిస్‌ విని తెలంగాణ నేటివ్‌ అనుకున్నామండీ’ అన్నారు నాగార్జునగారు. ‘కాదండీ... మాది కృష్ణాజిల్లా. కాకపోతే హైదరాబాద్‌లో కొన్నేళ్లు బ్యాంకు ఉద్యోగం చేశాను. ఈ మధ్యనే మద్రాసుకు షిఫ్ట్‌ అయ్యాను’ అని చెప్పి ఆయన దగ్గర నుంచి సెలవు తీసుకున్నా. సాయంత్రానికి సికింద్రాబాద్‌ నుంచి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాం. అక్కడ రఘువరన్‌ ఉన్నాడు. తనతో కాసేపు మాట్లాడా. డైనింగ్‌ టేబుల్‌మీద కూర్చుని తింటుంటే మాట్లాడుతూ మాట్లాడుతూ మెళ్లో ఒక టవల్‌ వేసి ఊపిరాడనీయకుండా లాగి చంపే సీన్ తీశారు. అది కూడా గంటా గంటన్నరలోపే అయిపోయింది. అప్పుడు సమయం చూస్తే సాయంత్రం ఏడయింది. రామూగారు దగ్గరికి వచ్చి ‘మీ పార్ట్‌ ఓవర్‌ సార్‌’ అన్నారు. అప్పుడు నైట్‌ ఫ్లయిట్‌లు లేవు. అందువల్ల ఆ నైట్‌ అక్కడే ఉన్నాను.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

FilmSerialమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.