చిరంజీవిగారి సంస్కారం ఎంత గొప్పదో అప్పుడర్థమైంది: కోట (పార్ట్ 21)

ఆత్మీయ హెచ్చరిక

నేను సినిమాల్లోకి వచ్చిన కొన్నాళ్ళకి ఔట్‌డోర్‌లు మొదలయ్యాయి. ఒకరోజు జనాల మధ్య షూటింగ్‌ చేస్తున్నాం. చుట్టూ ఐదు ఆరువేల మంది జనం చేరారు. నేనూ, బ్రహ్మానందం, వై.విజయ, బాబూమోహన్.... అందరం ఉన్నాం స్పాట్‌లో. ఓ డైలాగ్‌ ఏదో చెప్పమన్నారు. అన్ని వేలమంది ముందు చెప్పడం నాకు కొత్త. ఆ డైలాగు క్లిష్టంగా ఉంది. నాకేమో వెంటనే ఒంటబట్టలేదు. మూడు టేకులో, నాలుగు టేకులో తీసుకున్నా. జంధ్యాలగారికి చిరాగ్గా ఉంది. పైకి చెప్పట్లేదు కానీ అర్థమవుతోంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఆయన కేకలేయడం కూడా స్పెషల్‌గానే ఉంటుంది. నా దగ్గరకు వచ్చి, ‘ఆ.. ఏం కోటా... సినిమా యాక్టర్‌వి నువ్వు. జనం చూశావా, నిన్ను చూడ్డానికి ఎంతమంది వచ్చారో. ఇలా చేస్తే ఎలా? అది నీకే అవమానం’ అన్నారు. ‘పదిమందిలో ఉన్నావు. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యి. టేకులు తినమాకు. పరువు పోతుంది’ అని నన్ను హెచ్చరించడం అన్నమాట. అంత టెక్నికల్‌గా కేకలేసేవారు.


చిరంజీవికి ప్రతినాయకుడి పాత్ర

‘ఖైదీ నెంబర్‌ 786’ లో విలన్ వేషం వేయమని విజయబాపినీడుగారు నన్ను సంప్రదించారు. హీరో ఎవరంటే చిరంజీవిగారి పేరు చెప్పారు. అప్పుడు చిరంజీవిగారు ఫుల్‌ఫాంలో ఉన్నారు. ఆ సినిమాలో విలన్ వేషం దొరకడం అంటే మామూలు విషయం కాదు. అప్పటికే విలన్ వేషాలతో బిజీగా ఉన్న మోహన్‌బాబుగారు కూడా అందులో ఉన్నారని తెలిసి కాస్త థ్రిల్‌గా అనిపించింది. మరోవైపు ఎలా చేస్తానో.. ఏమోనని దడ పుట్టింది. విజయబాపినీడుగారు చెయ్యి ఫర్వాలేదన్నారు. మండలాధీశుడు లాంటి సినిమానే ధైర్యంగా చేశాను. ఆ విషయమే గుర్తొచ్చి, చేస్తానండీ అని ఒప్పుకున్నా. ఆ సమయంలో విజయనిర్మలగారి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. కృష్ణగారు హీరోగా నటిస్తున్న ఆ సినిమాకు అప్పుడే పరశురాముడు అని పేరుపెట్టారు. కోర్టు ఎపిసోడ్‌ జరుగుతోంది. అదేరోజు నాకు ‘ఖైదీ నెంబర్‌ 786’కి తొలి రోజు షూటింగ్‌. ‘రెండు గంటలు మా సెట్‌కి వచ్చి వెళ్ళండి. ఇంపార్టెంట్‌ సీన్’ అని విజయనిర్మలగారు నాకు కబురంపారు. తీరా వెళ్తే రెండు గంటల సమయం అంతకు అంత అవుతూనే ఉంది. నా మనసు మనసులో లేదు. అప్పటికీ ధైర్యం చేసుకుని ‘కాల్షీట్‌ బాపినీడుగారిదండీ’ అన్నా. ‘మేం మాట్లాడేశాం లేవయ్యా. మరేం ఫర్వాలేదు’ అన్నారు కృష్ణగారు.


మద్రాసు మౌంట్‌రోడ్డులో రాజాజీ భవన్ ఉంది. పెద్దమెట్లతో చాలా బావుంటుంది. ఆ మెట్ల మీద పరశురాముడు సన్నివేశాలు ఎలా చేశానో నాకు గుర్తే లేదు. విజయనిర్మలగారు ‘ఓకే ఇక మీరు వెళ్ళొచ్చు’ అనగానే కారులో వడపళని, విజయ స్టూడియోకు బయలుదేరా. ఏమనుకుంటారో అనే దిగులు. ‘చిరంజీవిగారితో తొలి సినిమా. మొదటిరోజే ఇలా ఆలస్యం చేస్తే ఏమనుకుంటారో? నన్ను ఉంచుతారో? తీసేస్తారో? ఒకవేళ తీసేస్తే చెడ్డ పేరు వస్తుంది. మళ్ళీ ఈ కాంబినేషన్ కుదరడానికి ఎన్నాళ్ళు పడుతుందో? ఇప్పటిదాకా విలన్‌గా చేయలేదు. గొప్ప అవకాశం.. ఏం చేయాలి భగవంతుడా’ అనుకుంటూ కంగారు కంగారుగా వెళ్ళాను. కారు డోర్‌ తీసుకుని గబగబా ఆ ఫ్లోర్‌వైపు అడుగులు వేశా. అక్కడ విజయబాపినీడుగారు రెడీగా ఉన్నారు. నన్ను చూడగానే ఆయనకి బీపీ పెరిగింది. ‘ఏమయ్యా అవతల ఉన్నది ఎవరనుకుంటున్నావ్‌? పెద్ద నటులందరూ వెయిట్‌ చేస్తున్నారు. అసలు నీకు పెద్ద స్టార్‌ హీరో సినిమా అనే భయంలేదు. భక్తి లేదు. నాకు కాల్షీట్‌ ఇచ్చి అక్కడికి షూటింగ్‌కి ఎందుకు వెళ్లావు? ఎవరు వెళ్లమన్నారు నిన్ను?’ అని కేకలేశారు. ‘లేదండీ. కృష్ణగారు మీతో మాట్లాడానని చెప్పారు..’ అని నేను అంటుండగానే... ‘సరే వెళ్లు. మేకప్‌ వేసుకో. త్వరగా కానీ’ అంటూ ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. సరేనని చిరంజీవిగారు ఉన్న చోటుకువెళ్ళాను. ఆయన్ను కలిసి నమస్కారం చేశా. అక్కడే మోహన్‌బాబుగారు కూడా కూర్చుని ఉన్నారు. వాళ్లిద్దరూ ఏవో జోకులు వేశారు. అంతకు ముందు నేను ప్రాణం ఖరీదులో నటించాను. కాక పోతే నేను, చిరంజీవిగారు కలిసి చేసింది ఏమీ లేదు. కాబట్టి ఆయనతో కలిసి నటించడం అదే తొలిసారి.

కాల్షీట్‌ సర్దుబాటు తప్పదు

‘టెన్షన్ ఏమీ లేదండీ. ఆర్టిస్టుగా బిజీ అవుతున్న కొద్దీ కాల్షీట్ల సర్దుబాటు తప్పదు’ అన్నారు చిరంజీవిగారు. ఓ పెద్ద హీరో అలా అనేసరికి కాస్తంత కుదుటపడ్డా. అలా చూస్తుండగానే ఖైదీ నెంబర్‌ 786 పూర్తయింది. మెగాస్టార్‌కి ప్రతినాయకుడుగా అప్పట్లో రావుగోపాలరావు లాంటివారు నటించేవారు. అలాంటి అవకాశం నాకు రావడంతో నాకు ఒక గ్రేడ్‌ పెరిగిందనిపించింది. ఆ సినిమా విజయవంతంగా ఆడింది.


చిరంజీవి ప్రశంసలు, సలహాలు

ఆ తర్వాత కొన్నాళ్ళకు సుమన్‌ హీరోగా నటించిన అలెగ్జాండర్ సినిమా విడుదలైంది. అన్నపూర్ణ స్టూడియో అనుకుంటా. ఒక సెట్లో నేను, పక్క సెట్లో చిరంజీవిగారున్నారు. ఇద్దరం ఎదురు పడ్డాం. ‘అలెగ్జాండర్ చూశానండీ. చాలా బావుంది. ఈ పాత్ర మిమ్మల్ని మరో మెట్టు ఎక్కిస్తుంది’ అన్నారు చిరు. ఇంకో నటుడి సినిమా గురించి ఆయన మాట్లాడాల్సిన పనిలేదు. అయినా చెప్పారంటే ఆయన సంస్కారం ఎంత గొప్పదో అప్పుడర్థమైంది. అలాగే నాకు పద్మశ్రీ పురస్కారం వచ్చినప్పుడు చిరంజీవిగారు కేరళ నుంచి ఫోన్ చేసి అభినందించారు. మా అబ్బాయి పోయినప్పుడు కూడా చిరంజీవిగారు ఇంటికివచ్చి ఓదార్చారు. నేనెప్పుడైనా ట్రాక్‌ మారుతున్నాననిపిస్తే సున్నితంగా మందలించేవారు. ‘మీరు చాలా మంచి నటులు. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి’ అని కన్నబిడ్డ చెప్పినట్టు చెప్పేవారు. చక్కటి సలహాలు ఇచ్చేవారు.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

FilmSerialమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.