‘ఈరోజు నుంచి హాస్యానికి 11 రోజులు మైల’ అన్నా..: కోట (పార్ట్ 20)

జంధ్యాలగారు చాలా గొప్ప రచయిత. ఆయన రచనల్లో తెలుగు ఉట్టిపడుతూ ఉంటుంది. మాతృత్వం ఉంటుంది. ఎక్కడా వల్గారిటీ ఉండదు. అప్పటి హాస్యం ఎంత గొప్పదంటే ఎవరైనా, ఎన్నేళ్ళ వయసు వాడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరితోనైనా చెప్పుకుని నవ్వుకోవచ్చు ఆ జోక్స్‌. అంత గొప్పగా ఉంటాయి. ఇప్పటివాళ్ళు చెప్పే జోక్స్‌ని కొన్ని కొన్ని చోట్ల చెప్పుకోలేం. సరే... ఏదో కాలం మారింది, ఆ డిస్కషన్ వేరనుకోండి.


జంధ్యాల డైలాగులు..

జంధ్యాల అనగానే కేవలం కామెడీ అనుకుంటే తప్పే. నా వరకు ఆయన పేరు చెప్పగానే సాగరసంగమం, శంకరాభరణం చిత్రాలు గుర్తుకొస్తాయి. ఎంత గొప్పగా ఉంటాయండీ ఆ చిత్రాలు. విశ్వనాథ్‌గారికి నేను పాదాభివందనం చేస్తా. శంకరాభరణం కొత్త నటులతో తీసిన సినిమా. వేటూరి సుందరరామ్మూర్తిగారు, జంధ్యాలగారు, మహదేవన్‌గారు... ముగ్గురూ ఆ చిత్రానికి జీవం పోశారు. మాటలు, పాటలు, సంగీతం ఎంత కీలకమండీ, ఆ సినిమాకి? జంధ్యాలగారు ఏ సినిమా చేసినా ఆయన మార్కు ఉండేది. భాషని ఎంతో కమ్మగా వాడేవారు. కొన్ని డైలాగులు అప్పుడప్పుడూ గుర్తుకు వస్తుంటాయి. ‘శ్రీవారికి ప్రేమలేఖ’లో మిశ్రోగారు ఓ వేషం వేశారు. అది వేలుగారు వేయాల్సిన వేషం. ఏమైందోగానీ మిశ్రోగారు నటించారు. హీరో తండ్రి వీరభద్రరావు. ఎవరిమీదైనా కోపంవస్తే పక్కనే ఉన్న మిశ్రోకి గుండు కొట్టించమని అంటుంటాడు. ఓ సారి అతని చేతిని కుక్క కరుస్తుంది. కొడుక్కి ఉత్తరం రాయాలి. పక్కనే ఉన్న మిశ్రో చేత ఉత్తరం రాయిస్తాడు.‘ఒరేయ్‌ శుంఠా’ అని మొదలుపెడతాడు. అందుకు మిశ్రో ‘అలా అంటే బావుండదండీ’ అంటాడు.


‘నేను కన్న కొడుకు, నేను కొన్న కవరు నా ఇష్టం వచ్చినట్టు రాసుకుంటా’ అంటాడు వీరభద్రరావు. ఆ షాట్‌లో జంధ్యాలగారు ఎంత మంచి డైలాగులు రాశారండీ...! ‘‘సరిగా గడ్డాలు, మీసాలు గొరుక్కోని పంజాబ్‌ రాష్ట్రంలో బార్బర్‌ షాప్‌ పెట్టినవాడిలాగా ఆ మొహం ఏంట్రా’ అని ఇంకో సినిమాలో ఓ డైలాగ్‌ ఉంటుంది. ఇంకో చిత్రంలో ‘ఆయన ఎప్పుడొస్తారో’ అని హీరో అడుగుతాడు. అందుకు నాయిక ‘ఆయన రారు. మనమే వెళ్ళాలి’ అంటుంది. ‘సాగరసంగమం’లో ‘వాడు 365 రోజులు తాగేది ఈ ఒక్కరోజు బతికిఉండటం కోసం’ అని రాశారు. ‘బావాబావా పన్నీరు’ లోనూ చాలా గొప్ప డైలాగులున్నాయి. ఆయన మాటలు ఎంత బావుంటాయో. మనిషి కూడా అంతే మంచివాడు. నాటకాల నుంచి వచ్చిన వారి కోసం, కొత్త కొత్త ఆర్టిస్టుల కోసం వందలాది క్యారెక్టర్లు క్రియేట్‌ చేయడం ఆయనకే చెల్లింది. బైట ఎంత సరదాగా ఉంటారో సెట్లో ఉన్నప్పుడు అంత స్ట్రిక్ట్‌గా ఉంటారు.


వైట్‌ అండ్‌ వైట్‌ కాస్ట్యూమ్స్‌, తెల్ల టోపీ, భుజాన తెల్ల టవల్‌ వేసుకుని జంధ్యాల సెట్లో డైరెక్టర్‌ కుర్చీలో కూర్చుంటే ఇంకేమీ మాట్లాడటం ఉండదు. పిచ్చి పిచ్చి జోకులు చెప్పరు. ఏయ్‌ ఏంట్రా వెధవా అని అన్నారంటే ఆ పూట పిచ్చకోపం వచ్చినట్టు లెక్క. అంత కంట్రోల్డ్‌గా ఉంటారు. ప్రతిరోజూ ఉదయం ఏడు గంటలకే షాట్‌ తీసేసేవారాయన. వేసవి కాలంలో 11.30-12 గంటలకి బ్రేక్‌ ఇచ్చేవారు. మళ్ళీ మధ్యాహ్నం మూడున్నరకి అందరినీ పిలిచి మొదలుపెట్టేసేవారు. ఆ రోజుల్లో ఏడు గంటల వరకు వెలుతురు ఉండేది కదా.. అంతసేపూ తీసేవారు. చాలా తక్కువసేపే నిద్రపోయేవారు. అర్థరాత్రిదాకా మెలకువతో ఉన్నా తెల్లారుజామున 5.30కి లేచి పట్టెమంచం మీద కూర్చుని రాస్తూ ఉండేవారు. రోజూ రెండు సీన్లు రాసేవారు. అక్కడికి వచ్చిన కో డైరెక్టర్‌కి ఆ సీన్ ఇచ్చి ‘ఇది ప్లాన్ చేయండి’ అనేవారు. ఆయన దగ్గర పనిచేసే కో డైరెక్టర్ల పని చాలా సులువుగా ఉండేది. ఎందుకంటే ఆయన రాసే సీన్లలో సెట్‌ ప్రాపర్టీ పెద్ద హడావిడిగా ఏమీ ఉండేది కాదు. ‘అది తేవాలి, ఇది కావాల్సిందే’ అని ఏ రోజూ అడిగేవారు కాదు. ఉదాహరణకు ‘పోలీసు మోటార్‌ సైకిల్‌లో రావాలి’ అని రాసుకుని ఉంటారనుకుందాం. సమయానికి మోటార్‌ సైకిల్‌ దొరకలేదనుకుందాం. టెన్షన్ పడరు. పెట్టరు.‘పర్లేదు, సైకిల్‌ మీద కానిస్టేబుల్‌ వచ్చినట్టు తీసేద్దాం’ అనేవారు. అంత తేలిగ్గా ఉండేది ఆయన శైలి.

నేనే వంటమాస్టర్ని

జంధ్యాలగారితో షూటింగ్‌లో ఉన్నన్ని రోజులు ఆయనకి నేనే వంట మాస్టర్‌ని. నా చేత్తో నేను ఏం వండిపెట్టినా ఆయన చాలా సంతోషంగా తినేవారు. నా షాట్‌లు ముందు తీసేసి ‘ఇక నువ్వుపోయి నీ పని చూడు’ అనేవారు. అంటే వంట కార్యక్రమం మొదలుపెట్టమని. చిన్నప్పుడు మా అక్క వంట చేస్తుంటే చూసేవాణ్ణి. ఎప్పుడన్నా అడపాదడపా చేసేవాణ్ణి. మరీ ముఖ్యంగా సినిమాల్లోకి వచ్చిన తర్వాతే నేర్చుకున్నా. పచ్చడో, పులుసో, పప్పో ఏదో ఒకటి చేసేవాణ్ణి. ఒంటిగంటకు ఆయన వచ్చేసరికి సిద్ధంగా టేబుల్‌ మీద పెట్టేవాణ్ణి. ‘కోటా ఎంత బాగా వండుతాడో’ అని అందరితో చెప్పేవారు. ఏం పెట్టినా ఇష్టంగా తినేవారు.


హాస్యానికి 11 రోజులు మైల

ఓసారి జంధ్యాలగారి చివరి రోజుల్లో అనుకుంటా.. నా చేత్తో వంట చేసుకుని ఆయన్ని చూడ్డానికి వెళ్ళాను. షూటింగ్‌ నాటి అనుభవం గుర్తొచ్చిందేమో.. నా వైపు, కూరవైపు మార్చి మార్చి చూశారు. ఇద్దరం కాసేపు ఏమీ మాట్లాడుకోలేదు. ఇంతలో అక్కడికి ఒక పెద్దాయన వచ్చారు. జంధ్యాలగారి పరిస్థితిని చూసి, ‘ఏంటిది జంధ్యాల..’ అని బాధపడ్డారు ఆ పెద్దాయన. ‘ఆ ఏముంది.. అప్పుడు అనుభవించాను కదా... ఇప్పుడు అనుభవిస్తున్నాను’ అన్నారు. అది విన్న నాకు ఆ క్షణం కళ్ళమ్మట నీళ్ళు ఆగలేదు. బాధ కలిగింది. అక్కడి నుంచి వచ్చేశాను.


‘అనుభవించాను కదా.. అనుభవిస్తున్నాను’ అని జంధ్యాలగారిలా ఎంతమంది ఒప్పుకుని చెప్పగలరు చెప్పండి? ఆయన సంస్కారవంతుడు. అందుకే చెప్పగలిగారు అని అనుకుంటూ ఇంటికొచ్చా. ఆ తర్వాత కూడా ఆ మాట చాలా సార్లు గుర్తుకొచ్చింది. కొన్నాళ్ళకి ఆయన కన్నుమూశారని తెలిసింది. నాకు కాలూ చేయీ ఆడలేదు. వెళ్ళాను. పంజాగుట్ట శ్మశానం చేరుకున్నా. అక్కడ సుందర్రామ్మూర్తి ఉన్నారు. పక్కనే నేనూ కూర్చున్నా. పత్రికలవారొచ్చి... ‘ఆయనతో ఉన్న అనుబంధం చెప్పండి’ అన్నారు. ఏం చెప్పాలి? ఎంతని చెప్పాలి? కాసేపు ఆలోచించా. ‘ఈరోజు నుంచి హాస్యానికి 11 రోజులు మైల’ అన్నా. అంతకు మించి నాకు గొంతు పెగల్లేదు. పక్కనే ఉన్న సుందర్రామ్మూర్తిగారు ‘జంధ్యాల గురించి ఒక్క వాక్యంలో ఎంత బాగా చెప్పారండీ’ అని నాతో అని పత్రికల వారితోనూ అదే మాట అన్నారు.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

FilmSerialమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.