బయటిలోకానికేం.. ‘అబ్బా కోట’ అనే అనుకుంటారు: కోట (పార్ట్ 2)

ABN , First Publish Date - 2021-08-14T03:16:09+05:30 IST

భగవంతుడి లీలలు అర్థం కావు. లేకుంటే అప్పుడే పోవాల్సిన వయసా వాడిది? అసలు ఆ కడుపుకోత ఎలా తట్టుకున్నానో? మా ఆవిడ పరిస్థితి ఏంటి? కోడలుపిల్ల గంపెడు దుఃఖం కడుపులోనే దాచుకుంది. దేవుడు మామూలు పరీక్షలు పెట్టలేదు. ఒకటి పొయ్యేసరికి ఇంకొకటి..

బయటిలోకానికేం.. ‘అబ్బా కోట’ అనే అనుకుంటారు: కోట (పార్ట్ 2)

ఒక్కరోజులోనే మూడు రాష్ర్టాల్లో షూటింగ్‌!

‘మా ఆవిడ. తనకీ ఆరోగ్యం పెద్దగా బావుండదు. కానీ మా పిల్లలు వజ్రాలు. వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకున్నారు. సినిమా వాళ్ళ పిల్లలంటే ఎలాగెలాగో ఉంటారని అనుకుంటారు కదా. కానీ మా పిల్లలు.. బుద్ధిమంతులు. నేనేమో ఇల్లు వాకిలి అనుకోకుండా ఉదయం చెన్నైలో, మధ్యాహ్నం హైదరాబాద్‌లో, సాయంత్రం కర్ణాటకలో షూటింగ్‌ చేసిన రోజులున్నాయి. విమానాశ్రయాల్లోనే స్నానాలు కానిచ్చేసే వాణ్ణి. నేను, బాబూమోహన్, బ్రహ్మానందం కలిసి ఇలా ఒకే రోజు మూడు రాష్ట్రా‌ల్లో షూటింగ్స్‌లో పాల్గొన్న రోజులు కోకొల్లలు. అంతటి బిజీగా ఉన్న నాకు, మా పిల్లలు ఏం చదువుతున్నారో అడిగి తెలుసుకునే తీరిక ఉండేది కాదు. కానీ పిల్లలు అర్థం చేసుకున్నారు. వాళ్ళంతట వాళ్ళు ఉన్నత చదువులు చదువుకున్నారు. కుదురుగా ఉన్నారు.’ చెప్పారాయన.‘టీ తీసుకోండి’ అంటూ వచ్చిందా ఇల్లాలు.


కడుపుకోత

గోడమీద గెటప్పులకేసి చూస్తున్న నన్ను ఉద్దేశించి అన్నారిలా కోట. ‘ఏంటి ఆ పోస్టర్‌ చూస్తున్నారా? మా అబ్బాయి చేయించాడు. ఇల్లు ఎలా ఉండాలి? అందులో నా షీల్డ్‌లు ఎలా ఉండాలి? ఎక్కడుండాలి? అంతా దగ్గరుండి డిజైన చేయించింది అబ్బాయే. నేను నటించిన సినిమాల్లోని ఫొటోలన్నీ వెతికి పట్టుకుని అలా వినైల్‌ లాగా చేయించి ఈ గోడకి పెట్టించాడు. ప్చ్‌... భగవంతుడి లీలలు అర్థం కావు. లేకుంటే అప్పుడే పోవాల్సిన వయసా వాడిది? అసలు ఆ కడుపుకోత ఎలా తట్టుకున్నానో? మా ఆవిడ పరిస్థితి ఏంటి? కోడలుపిల్ల గంపెడు దుఃఖం కడుపులోనే దాచుకుంది. దేవుడు మామూలు పరీక్షలు పెట్టలేదు. ఒకటి పొయ్యేసరికి ఇంకొకటి.. ఎలా తట్టుకున్నానో, ఎలా ఈదానో.. భగవంతుడికే తెలియాలి.. ఒకటా రెండా? మా రెండో అమ్మాయి పెళ్లీడు కొచ్చిన పిల్ల... యాక్సిడెంట్‌ అయింది. కాలు తీసేశారు. మూడు పూటలా నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లగలిగేలా తిండి పెట్టగలం. జీవితాన్ని ఇవ్వలేం. అది మహా క్షోభ. సరే. తనకి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాం. బంగారంలాంటి అల్లుడొచ్చాడు. అంతా బావుంది, జీవితం గాడినపడింది అనుకుంటున్నప్పుడు చెట్టంత కొడుకుపోతే అసలు మనిషనేవాడు ఎలా తట్టుకోగలడు?.. ప్చ్‌...’’ కాసేపు మౌనం. అంత పెద్దాయన్ని ఏమని ఓదార్చాలి.. అందరూ తేలిగ్గా ‘సారీ’ అంటారు. కానీ నాకు ఆ క్షణంలో ‘సారీ’ అనే పదం వాడాలనిపించలేదు. ఎదుటివారిని ఓదార్చే శక్తి ‘సారీ’కుందా? కాసేపటికి ఆయనే తేరుకున్నారు. ఈ వయసులోనూ షూటింగ్‌ ఆఫర్లు...‘‘రేయ్‌ రాజూ... ఈ కప్పులు తీసెయ్‌’’ అని మళ్ళీ కాసేపు మౌనంగా కూర్చున్నారు కోట. అంతలో ఫోన్ మోగింది..‘కాల్షీట్‌ కోసం అడుగుతున్నారు సార్‌..’ రాజు వినయంగా ముందు నిల్చున్నాడు. ‘ఎక్కడంట షూటింగ్‌’. ‘కనుక్కుంటాను సర్‌’ రాజు సమాధానం. ‘ఎన్ని రోజులు కావాలి? వివరాలు తెలుసుకో. నేను ఈ మీటింగ్‌ తర్వాత మాట్లాడతానని చెప్పు’ రాజుకు చెప్పారు.



‘నాకు 70 ఏళ్లు దాటాయి. నటుడుగా ఇంకా బిజీగా ఉండటమంటే అదృష్టం కాక మరేమిటి? నా పెళ్లైన కొన్నాళ్లకి మా ఆవిడకి అనారోగ్యం చేసింది. ఆ విషయం ఎవరికీ చెప్పేవాణ్ణి కాదు. సెట్‌కి వెళ్తే నటుడిగానే ఉండేవాణ్ణి. ఏ రోజూ కుటుంబ విషయాలు పక్క వాళ్లకి చెప్పుకోలేదు. తోటి నటీమణులను, మిగిలిన వాళ్లని గానీ పర్సనల్‌ విషయాలు ఎప్పుడూ అడగలేదు. అందుకే నా కుటుంబం గురించి ఏ విషయాలూ బయట తెలిసేవి కావు. ఒకవైపు జనాల్లో పేరు, ప్రతిష్ట, ‘అబ్బా, కోట ఏం చేశాడు’ అనే ప్రశంసలు, వరుస సినిమాలు, మరోవైపు ఇంట్లో మా ఆవిడకి అనారోగ్యం, మా పాపకి యాక్సిడెంట్‌, కన్నకొడుకు కనుమరుగైపోవడం... బయటిలోకానికేం ‘అబ్బా కోటా’ అనే అంటుంది. లోపల ఇబ్బందులు నా మనసుకే తెలుసు. అయినా రెండు వైపుల్ని బ్యాలన్స్ చేసుకుని రాగలిగానంటే అది నా గొప్పతనం కానే కాదు. ఇంతటి ఆత్మవిశ్వాసం ఆ భగవంతుడిచ్చిందే. దీన్ని అదృష్టం కాక మరేమనాలి? జీవితం ఎవరికైనా జీవితమే! నేనొక్కటే నమ్ముతా. బతకాలి... బతకనివ్వాలి. ఎదుటివాడికి జీవించే అవకాశం కల్పించాలి. ఇందాక మిమ్మల్ని లోపల కూర్చోబెట్టాడే రాజు.. వాళ్ళంతా నన్ను నమ్ముకుని ఉంటున్నారు. ఉన్నపళాన వారిని ‘వద్దుపో’ అంటే ఎలా? వీటినే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-08-14T03:16:09+05:30 IST