నేను చెప్పడం, వాళ్ళు నవ్వడం.. అలా నవ్వీ నవ్వీ పొట్టలు పట్టుకున్నారు: కోట (పార్ట్ 11)

ABN , First Publish Date - 2021-08-28T03:25:06+05:30 IST

నేను చెప్పడం, వాళ్ళు నవ్వడం.. రెండు గంటలసేపు అందరూ నవ్వీ నవ్వీ పొట్టలు పట్టుకున్నారు. ‘కొత్త సంవత్సరానికి మేం ఆనందంగా ఆహ్వానం పలికామండీ. పొట్టలు చెక్కలయ్యేలా నవ్వించారు’ అని ముచ్చటపడి నన్ను చాలా బాగా చూసుకున్నారు. అప్పట్లో రెండు రూపాయల కాగితాలు వచ్చిన కొత్త. ఆ కొత్త నోట్లతో 200 రూపాయలు చేతిలో పెట్టి..

నేను చెప్పడం, వాళ్ళు నవ్వడం.. అలా నవ్వీ నవ్వీ పొట్టలు పట్టుకున్నారు: కోట (పార్ట్ 11)

టి.కృష్ణగారికి కొత్త థాట్‌.. స్ర్కిప్టులో మార్పులు

ఒక్క నిమిషం ఉండు అని టి. కృష్ణగారికి ఫోన్ చేశాడు పి.ఎల్‌.నారాయణ. ఆయనొచ్చి ‘ఏంది నారాయణ’ అన్నారు. ‘ఇప్పుడు చెప్తాడు చూడు మనోడు’ అని నన్ను చూసి ‘అందుకోరా’ అన్నాడు. నేను మంచి ఊపుమీద ఆ డైలాగు చెప్పా. ఆయన విని కామ్‌గా వెళ్ళిపోయారు. ‘అర్థరాత్రి దాటిన తర్వాత ఆయన్ని పిలిచావు. ఆయనేమో ఏమీ అనకుండా వెళ్ళిపోయాడు. ఆయనకి నచ్చలేదేమో. ఇప్పుడెందుకు’ అన్నాను నేను. ‘ఉండు. టి. కృష్ణగారి సంగతి నీకు తెలియదురా. నచ్చకపోతే బాలేదని మొహమ్మీదే చెప్పేస్తారు. అలాంటిది ఏమీ మాట్లాడకుండా వెళ్ళారంటే ఏదో ఉంది. చూడు.. పావుగంటలో ఏదో చెప్తారు’ అన్నాడు. వాడు అన్నట్టుగానే పావుగంటలో టి. కృష్ణగారు సబ్జెక్ట్‌ ఫైల్‌ పట్టుకుని వచ్చారు. పి.యల్‌.కి అప్పటికే ఆ సబ్జెక్ట్‌ మొత్తం తెలుసు. ‘భలే ఉంది ఐడియా. మంచి థాట్‌ వచ్చింది. . నన్ను పిలిచి చాలా మంచి పనిచేశావ్‌. సబ్జెక్ట్‌ మొత్తం నీకు తెలుసు కదా అంకుల్‌. ఇది చదివి ఈయన పాత్ర ఎక్కడెక్కడ ఇరికించగలమో.. మొత్తం ఇరికించెయ్‌’ అన్నారు. నాకు దడ వచ్చేసింది.


ఆ రోజు రాత్రి 12.30 నుంచి ఒంటిగంట మధ్యన మొదలుపెట్టాడు పి.యల్‌. తెల్లారుజామున ఐదు దాకా మొత్తం ఎనిమిదో తొమ్మిదో సీన్లు రాశాడు. కృష్ణగారు అన్నిటినీ చెక్‌చేసుకుని ఓకే చేశారు. పాత్ర నిడివి పెరగడంతో బ్యాంకుకు అదనంగా సెలవు పెట్టాల్సి వచ్చింది. అయినా సరే సెలవుపెట్టి వైజాగ్‌లోనే ఉండి నాలుగైదు రోజులు షూటింగ్‌ వర్క్‌ పూర్తిచేశా. ఆ రోజుల్లో సీన్లు చాలా త్వరగా తీసేవాళ్ళు. అందులోనూ కృష్ణగారి ప్లానింగ్‌ చాలా కచ్చితంగా ఉండేది. ఆయన భావాలు చాలా ప్రత్యేకంగా ఉండేవి. ఆయన సినిమాల్లో సమస్యను చర్చించడం మాత్రమే కాదు. మంచో చెడో ఇలా ఉంటే బావుంటుందని ఆన్సర్‌ కూడా చెప్పేవారు. మహానుభావుడు తొందరగా కన్నుమూశారుగానీ ఆయనే ఉంటే నాకు ఇంకా రకరకాల పాత్రలు ఇచ్చేవారండీ. ప్చ్‌! సర్లెండి. అలా ముందుగానే నేను చెప్పినట్టు, నేను సినిమాను వెతుక్కుంటూ ఏ రోజూ అడుగు వేయలేదు. కానీ అలా... సినిమాయే నన్ను పిలిచింది.


ఇప్పుడు నేను ఆ విషయం చెప్పుకుంటే గొప్పగా ఉంటుంది. ఇప్పటి మిమిక్రీ ఆర్టిస్టుల్ని చూస్తే నాకు గతం గుర్తుకొస్తుంది. వాళ్ళు చేసే కొన్ని కొన్ని ఐటమ్స్‌ చూసి ‘ఇలాంటివి ఎప్పుడో చేశానయ్యా బాబూ..’ అనుకుంటాను. ఇప్పుడది ప్రొఫెషన్‌ అయిందిగానీ అప్పుడు నేను సరదాగా చేసేవాణ్ణి. ఒక పాపులర్‌ పాట తీసుకుని రకరకాలుగా పాడేవాణ్ణి. అలా పాపులర్‌ అయిన స్కిట్‌ ‘దేవదాసు’. ‘దేవదాసు’ చిత్రాన్ని మళ్ళీతీస్తే ఎలా ఉంటుంది? అందులోని పాటల్ని రేడియో ప్రముఖులు పాడితే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో చేసిన స్కిట్‌ అది. అప్పట్లో రేడియోలో ప్రముఖులు వెంకటేశ్వర్లుగారు, చిత్తరంజన్ గారు, ఓగిరాల నరసింహమూర్తిగారు, ఎమ్మెస్‌ రామారావుగారు లాంటి వ్యక్తుల్ని ఇమిటేట్‌ చేస్తూ దేవదాసు పాటలు పాడేవాణ్ణి. అప్పట్లో నా ప్రోగ్రామ్స్‌లో ఇవి చాలా ఫేమస్‌.


బ్యాంకులో పనిచేస్తుండగా, సరదాగా నా అంతట నేను నేర్చుకుని పాడి నలుగురితో శభాష్‌ అనిపించుకున్న స్కిట్‌లు ఎంతో ఫేమస్‌ అయ్యాయి. ఆ రోజుల్లో కమర్షియాలిటీ లేదు. ఇవాళ ఏ కాస్త నేర్చుకున్నా కమర్షియలైజ్‌ చేసి, డబ్బుకు ముడిపెట్టేస్తున్నారు. అప్పుడు నాకు డబ్బులు తీసుకోవాలనే ఐడియాలే లేవసలు. ఒక్కసారి మాత్రం పారితోషికం అందుకున్నా. నా గురించి ఆనోటా ఈనోటా విన్నారు ఒక రాజుగారు. ఆయనకు ఇండస్ట్రీ ఏదో ఉండేది. ‘31 డిసెంబర్‌కి మాతో ఉండాలండీ సరదాగా’ అని తీసుకెళ్ళి, వరుసపెట్టి నాతో తెలంగాణ యాసలో రామాయణం దగ్గర్నుంచి అన్నీ చెప్పించుకున్నారు. ఆయన, వారి బంధువులందరితో ఆ ఆవరణంతా సందడిగా ఉంది. నేను చెప్పడం, వాళ్ళు నవ్వడం.. రెండు గంటలసేపు అందరూ నవ్వీ నవ్వీ పొట్టలు పట్టుకున్నారు. ‘కొత్త సంవత్సరానికి మేం ఆనందంగా ఆహ్వానం పలికామండీ. పొట్టలు చెక్కలయ్యేలా నవ్వించారు’ అని ముచ్చటపడి నన్ను చాలా బాగా చూసుకున్నారు. అప్పట్లో రెండు రూపాయల కాగితాలు వచ్చిన కొత్త. ఆ కొత్త నోట్లతో 200 రూపాయలు చేతిలో పెట్టి, శాలువాకప్పి ‘థాంక్సండీ’ అన్నారు. అదొకటి నాకు బాగాగుర్తు. అంటే నా మిమిక్రీ ప్రోగ్రామ్‌కి డబ్బులు తీసుకోవడం అదే తొలిసారి.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-08-28T03:25:06+05:30 IST