సినిమాటోగ్రఫీ చట్ట సవరణపై కోలీవుడ్‌ ఫైర్‌

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సినిమాటోగ్రఫీ చట్టంపై కోలీవుడ్‌ తీవ్రంగా మండిపడుతోంది. పలువురు ప్రముఖులు ఈ చట్టానికి వ్యతిరేకంగా తమ నిరసన గళాన్ని ట్విట్టర్‌ వేదికగా తెలుపుతున్నారు. అటు బాలీవుడ్‌లోనూ ఇదే తరహా నిరసన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. గత జూన్‌ నెల 18వ తేదీన సినిమాటోగ్రఫీ చట్టం 2021 సవరణలను ప్రకటించింది. 1952 నాటి ఈ చట్టానికి మార్పులు చేసిన కేంద్రం తొలుత గత యేడాది ఫిబ్రవరి 12వ తేదీన రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత గతనెలలో ప్రవేశపెట్టి ఆమోదించింది. 


ఇపుడు మళ్ళీ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇందులో చేసిన సవరణలకు బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌ పరిశ్రమలకు చెందిన అనేక మంది దర్శకులు, నటీనటులు తమ వ్యతిరేకతను తెలిపారు. ఈ చట్టంలో కొత్తగా చేసిన సవరణల ప్రకారం... ఒక చిత్రానికి కేంద్ర సెన్సార్‌ బోర్డు సెన్సార్‌ చేసి సర్టిఫికెట్‌ మంజూరు చేసిన తర్వాత కేంద్రం మళ్ళీ సెన్సార్‌ చేయాలని కోరే అవకాశం ఉంది. అంటే, ఇంతకాలం స్వతంత్రంగా వ్యవహరిస్తూ వచ్చిన సెన్సార్‌ బోర్డు కంటే కేంద్రానికి పూర్తి అధికారం ఉంటుంది. అదేసమయంలో ఒక చిత్రంలోని సన్నివేశాలు లేదా స్టోరీని కాపీ కొట్టినట్టయితే జైలు శిక్షతో పాటు అపరాధం విధించవచ్చు. ఇలాంటి అనేక నిబంధనలు ఈ కొత్త చట్టంలో ఉన్నాయి. 

దీంతో ఈ కొత్త చట్టం వెల్లడైనప్పటి నుంచి సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా, బాలీవుడ్‌కు చెందిన అనురాగ్‌ కశ్యప్‌, నందితాదాస్‌, ఫర్హాన్‌ అఖ్తర్‌, తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో పాటు 1400 మందికిపైగా సినీ ప్రముఖులు తమ నిరసనను తెలుపుతూ కేంద్రానికి లేఖ రాశారు. ఒక చిత్రాన్ని సెన్సార్‌ చేసిన తర్వాత మళ్ళీ సెన్సార్‌ చేయాలని ఆదేశించే అధికారం కేంద్రానికి ఉండటం అనేది వాక్‌స్వాత్రంత్యపు హక్కును హరించేదిగా ఉందని పలువురు హీరోలు, దర్శకనిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త సవరణ చట్టాన్ని విశ్వనటుడు కమల్‌హాసన్‌ ఆరంభంలోనే తీవ్రంగా వ్యతిరేకించారు. ఇపుడు కోలీవుడ్‌ హీరోలు సూర్య, కార్తీ, విశాల్‌, దర్శకుడు అమీర్‌ వంటి వారు తీవ్ర వ్యతిరేకతను తెలుపుతూ తమ ట్విటర్‌లో నిరసన వ్యక్తం చేశారు. అయితే, ఈ కొత్త చట్టంపై కేంద్ర సమాచార, ప్రచార మంత్రిత్వ శాఖ మాత్రం మరోలా చెబుతోంది. 


దొంగతనంగా సినిమాలు విడుదల చేయడానికి అడ్డుకట్ట వేయవచ్చని.. కేంద్రానికి, చిత్ర పరిశ్రమకు ఏర్పడే భారీ నష్టాన్ని నివారించవ్చని ఇలాంటి ప్రతికూల అంశాలన్నింటిని గాడిలో పెట్టవచ్చని వాదిస్తోంది. కానీ, హీరోలు మాత్రం ఈ చట్టం వాక్‌స్వాతంత్ర్యాన్ని హరించేలా ఉందని వాపోతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొంది, అనేక అంతర్జాయతీ వేదికలపై గొప్ప గౌరవ మర్యాదలు పొందుతున్న భారత్‌... స్వదేశీయంగా మాత్రం వాక్‌స్వాతంత్య్రపు హక్కును హరించేలా చట్టాలు చేస్తూ సర్వాధికార ప్రభుత్వంగా నడుచుకుంటోందని వారు ఆరోపిస్తున్నారు. పైగా ఈ సవరణలు కోర్టు తీర్పులకు వ్యతిరేకమని, అందువల్ల తక్షణం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.