ఈగ, బాహుబలి, సైరా వంటి చిత్రాలతో తెలుగులోనూ గుర్తింపు పొందిన కన్నడ నటుడు కిచ్చ సుదీప్ (Kiccha Sudeep). ఈ కన్నడ స్టార్ హీరో నటించిన తాజా చిత్రం ‘విక్రాంత్ రోణ (Vikrant Rona)’. భారీ యాక్షన్ ఎమోషనల్ ఫాంటసీ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి అనూప్ భండారీ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) హీరోయిన్గా నటించింది. 3డిలో తెరకెక్కిన ఈ మూవీ జులై 28న కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది.
ఇంతకుముందే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ని అందుకున్నాయి. దీంతో ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేసింది. తాజాగా విడుదలైన ఈ మూవీ ప్రిమియర్స్ చూసిన పలువురు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కిచ్చ సుదీప్ నటించిన ఈ చిత్రం విజువల్ వండరని చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ తర్వాత సౌత్ నుంచి మరో భారీ చిత్రం వచ్చిందని అంటున్నారు. విక్రాంత్ రోణ దేశంలో విడుదలైన బెస్ట్ 3డీ మూవీస్‌లో ఒకటని, సస్పెన్స్, థ్రిల్‌తో ఆకట్టుకుందని చెబుతున్నారు. ఈ సినిమా కన్నడ సినీ పరిశ్రమని మరో స్థాయికి తీసుకెళ్లిందని అంటున్నారు. ముఖ్యంగా సినిమాలో కిచ్చ సుదీప్ నటన హైలెట్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. కైమాక్స్లో వచ్చే బీజీఎం, విజువల్స్ మరో లెవల్ అంటున్నారు.
హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, నిర్మాణ విలువలు చాలా బాగున్నాయని చెబుతున్నారు. ఫస్టాఫ్ చాలా బాగుందని, ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదిరిందని కామెంట్స్ చేస్తున్నారు. షాలిని ఆర్ట్స్ బ్యానర్లో జాక్ మంజునాథ్ నిర్మించిన ఈ మూవీని ఉత్తరాదిన సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్, కిచ్చ క్రియేషన్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. కాగా.. ఈ సినిమాని నార్త్‌లో పీవీఆర్ పిక్చర్స్ పంపిణీ చేయడం విశేషం.