‘‘వయలెన్స్.. వయలెన్స్.. వయలెన్స్..
ఐ డోంట్ లైక్.. ఐ అవాయిడ్...
బట్ వయలెన్స్ లైక్స్ మి..
ఐ కాన్ట్ అవాయిడ్’’ అంటూ పవర్ఫుల్ డైలాగ్‌లతో ఆకట్టుకున్నారు రాకింగ్‌స్టార్ యశ్. ఆయన నటించిన ‘కేజీఎఫ్ ఛాప్టర్–2’ తెలుగు ట్రైలర్‌ను మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ వేదిక ఆదివారం సాయంత్రం విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. ఏప్రిల్ 14న ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుందీ చిత్రం.
‘కేజీఎఫ్’లో గరుడను చంపేసిన తర్వాత ఏం జరిగింది? మీరు చదువుతారా? అంటూ మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ‘రక్తంతో రాసిన కథ ఇది. సిరాతో ముందుకు తీసుకెళ్లలేం. ముందకెళ్లాలంటే మళ్లీ రక్తాన్నే అడుగుతుంది’ అంటూ ప్రకాశ్‌రాజ్ పలికిన మాటలు ఆకట్టుకుంటున్నాయి.
‘‘నాకు ఎవ్వడి దోస్తీ అక్కర్లేదు.. నాతో దుష్మణి ఎవ్వడు తట్టుకోలేరు’ అని యశ్ చెప్పిన డైలాగ్ పవర్‌ఫుల్‌గా ఉంది. ఈ సన్నివేశంలో యశ్ లుక్, గంభీరమైన వాయిస్ చూస్తుంటే ‘కేజీఎఫ్–1’ను మించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ‘కత్తి విసిరి రక్తం చిందించి యుద్ధం చేసేది నాశనానికి కాదు.. ఉద్ధరించడానికి! అక్కడ పడే పీనుగులు కూడా పనికొస్తాయి.. కావాలంటే రాబందులను అడుగు’ అంటూ అధీరా పాత్ర పోషించిన సంజయ్ దత్ పలికిన పవర్ఫుల్ డైలాగ్, సన్నివేశాలు చూస్తుంటే రొమాలు నిక్కబోడిచేలా ఉన్నాయి. రవి బస్రూర్ అందించిన నేపథ్యసంగీతం ఆకట్టుకుంటుంది. యశ్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, సంజయ్‌దత్, రావు రమేశ్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.