ఆ విషయం తెలిసి ఎస్పీ బాలు నన్ను కొట్టారు..: సింగర్ కౌశిక్ మీనన్

ABN , First Publish Date - 2021-09-25T18:40:55+05:30 IST

దేశవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులను శోక సంద్రంలో ముంచెత్తుతూ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరమపదించి నేటితో (శనివారం) ఏడాది పూర్తయింది.

ఆ విషయం తెలిసి ఎస్పీ బాలు నన్ను కొట్టారు..: సింగర్ కౌశిక్ మీనన్

దేశవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులను శోక సంద్రంలో ముంచెత్తుతూ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరమపదించి నేటితో (శనివారం) ఏడాది పూర్తయింది. ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఎంతో మంది అభిమానులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. ఎంతో మంది సెలబ్రిటీలు ఆయనతో తమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో పాటలు పాడుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్న గాయకుడు కౌశిక్ మీనన్.. బాలుతో తన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. 


`నాకు పదహారేళ్ల వయసు వచ్చిన తర్వాత గాయకుడిగా ఎదగాలనే ఉద్దేశంతో చెన్నైకి మకాం మార్చాను. ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడ్డాను. డబ్బులు లేక రాత్రిళ్లు గుడిలో పడుక్కునే వాడిని. అంతకుముందే నాకు బాలుగారితో పరిచయం ఉంది. నేను చెన్నై వచ్చి గుడిలో పడుక్కుంటున్నాననే విషయం తెలిసి ఆయన కోప్పడ్డారు. నేరుగా గుడి దగ్గరకు వచ్చి నన్ను కొట్టారు. చెన్నైలో ఉన్న తన ఫ్లాట్‌కు తీసుకెళ్లారు. తర్వాత ఒక రికమెండేషన్ లెటర్ ఇచ్చి నన్ను చెన్నైలోని ప్రఖ్యాత ఆర్కెస్ట్రాలో జాయిన్ చేశారు. అక్కడి నుంచి నా కెరీర్ మొదలైంది. 


ఆయన లేకపోతే గాయకుడిగా నేను లేను. ఆయనతో నా అనుబంధాన్ని ఎప్పటికీ మరువలేను. నేను గాయకుడిగా స్థిరపడి చెన్నైలో స్వయంగా తపస్ రికార్డింగ్ స్టూడియోను నిర్మించుకున్నాను. ఆ విషయం తెలుసుకుని బాలుగారు ఎంత సంతోషపడ్డారో మాటాల్లో చెప్పలేను. ఆ స్టూడియో ప్రారంభోత్సవానికి ఆయన భారీ వర్షంలో హైదరాబాద్ నుంచి చెన్నై వచ్చారు. ఆయన నా స్టూడియోలోకి వస్తుంటే గుడిలోకి దేవుడు వస్తున్నట్టు అనిపించింద`ని కౌశిక్ తెలిపాడు. 

Updated Date - 2021-09-25T18:40:55+05:30 IST