తమిళనాడులో సినిమా థియేటర్స్ తెరుచుకునేదెప్పుడు..?

ABN , First Publish Date - 2021-08-21T00:46:19+05:30 IST

కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ అయి.. వారానికి రెండు మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. తెలంగాణలో పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకున్నా, ఏపీలో మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకోలేదు. చలన చిత్ర రంగానికి..

తమిళనాడులో సినిమా థియేటర్స్ తెరుచుకునేదెప్పుడు..?

కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ అయి.. వారానికి రెండు మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. తెలంగాణలో పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకున్నా, ఏపీలో మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకోలేదు. చలన చిత్ర రంగానికి ఏపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా పెద్ద సినిమాల రిలీజ్ విషయంలో నిర్మాతలు ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో కూడా ఇంకా థియేటర్లు తెరుచుకోలేదు. ముఖ్యంగా తమిళనాడు విషయానికి వస్తే.. సెప్టెంబర్‌లో థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తమిళనాడులో థియేటర్లు తెరుచుకునే విషయంపై నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ చిత్రజ్యోతితో మాట్లాడారు. 


ఆయన మాట్లాడుతూ.. ‘‘తమిళనాడు రాష్ట్రంలో ఇంకా థియేటర్లు ఓపెన్ కాలేదు. ప్రస్తుతం సీఎంతో చర్చల కోసం ఎగ్జిబిటర్లు వెయిట్ చేస్తున్నారు. సీఎం నుంచి ఇంకా అపాయింట్‌మెంట్ రాలేదు. వచ్చిన తర్వాత థియేటర్లు తెరుచుకునే విషయంపై ఓ క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే తమిళనాడులోని థియేటర్లన్నింటిని ఆన్‌లైన్ చేసే ప్రక్రియ జరుగుతోంది. మొత్తం బి,సి సెంటర్స్‌లోని థియేటర్లని కూడా ఆన్‌లైన్ చేస్తున్నారు. బుక్ మై షో ద్వారా బుక్ చేసుకోవడానికి కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒప్పుకోవడం లేదు. గవర్నమెంట్‌కు ప్రొడ్యూసర్ కౌన్సిల్ టచ్‌లో ఉంటుంది. అందుకని ప్రొడ్యూసర్‌కి రూ. 10, ఎగ్జిబిటర్‌కి రూ. 10, బుక్ మై షోకి రూ. 10 అనే విధంగా ఒప్పందం కుదిరింది. ఇంతకు ముందు బుక్ మై షో, థియేటర్ వాళ్లే చూసుకున్నారు. ప్రొడ్యూసర్‌కి ఏమీ ఉండేది కాదు. నా కంటెంట్ మీద నువ్వు టిక్కెట్స్ అమ్ముకుంటున్నావ్ కాబట్టి.. నాకూ షేర్ కావాలని ప్రొడ్యూసర్స్ సీఎం ద్వారా చెప్పించారు. ఆ రూ. 30ని ఇప్పుడు ముగ్గురూ షేర్ చేసుకునేలా ఒప్పందం జరిగింది.


ప్రస్తుతం ఎగ్జిబిటర్లకి సీఎంతో అపాయింట్‌మెంట్ కుదరలేదు. దీపావళికి మాత్రం ఖచ్చితంగా థియేటర్లు తెరుస్తారు. ఈలోపు అంటే సెప్టెంబర్‌ ఎండింగ్‌కి తెరిచే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం షూటింగ్స్‌ అంతరాయం లేకుండా జరుగుతున్నాయి. సినిమా థియేటర్లు ఓపెన్ అయితే రావడానికి కంటెంట్ కూడా రెడీగా ఉంది. కాకపోతే పెద్ద సినిమాలు ఇప్పుడు రిలీజ్ చేయడానికి భయపడుతున్నారు. మెయిన్ ఏరియాలైన కేరళ, కర్ణాటక ప్రస్తుతం లేవు. చిన్న చిన్న సినిమాలకు ఇబ్బంది లేదు కానీ ఈ ఏరియాలు లేకుండా పెద్ద సినిమాలకు మాత్రం ఇబ్బందే. టాలీవుడ్‌లోని పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వాలన్నా కూడా ఈ ఏరియాలు తప్పనిసరిగా కావాలి. ఆర్ఆర్ఆర్, ఆచార్య వంటి సినిమాలు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఓవర్సీస్ ఏరియాలు లేకుండా విడుదల కష్టం. ఇక ఏపీ సంగతి సరేసరి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పెద్ద సినిమాల విడుదల విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. త్వరలోనే వీటన్నింటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..’’ అని అన్నారు.

Updated Date - 2021-08-21T00:46:19+05:30 IST