బాలీవుడ్ ఫిల్మ్ మేకర్, ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ (Karan Johar) పలు హిట్ సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే. డైరెక్టర్, హోస్ట్, జడ్జి వంటి ఇతర పాత్రలను కూడా అతడు నిర్వహిస్తుంటాడు. కరణ్ తెరకెక్కించిన ఐకానిక్ ఫిలిం ‘కభీ ఖుషీ, కభీ గమ్’ (Kabhi Khushi Kabhi Gham). ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ (Shahrukh Khan), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), హృతిక్ రోషన్ (Hrithik Roshan), కాజోల్ (Kajol), కరీనా కపూర్ (Kareena Kapoor) తదితరులు నటించారు. ఫ్యామిలీ డ్రామాగా భారీ తారాగణంతో ఈ చిత్రం నిర్మితమైంది. బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్‌గా నిలిచింది. ‘కభీ ఖుషీ, కభీ గమ్’ లాంటి చిత్రాన్ని నేడు నిర్మించడం కష్టమని కరణ్ జోహార్ పేర్కొన్నాడు.
‘కభీ ఖుషీ, కభీ గమ్’ అనంతరం సినీ ఇండస్ట్రీలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అందువల్ల నేడు ఇటువంటి చిత్రాన్ని రూపొందించడం కష్టమని కరణ్ జోహార్ తెలిపాడు. తాజాగా కరణ్ ఓ ఈవెంట్లో పాల్గొన్నాడు. ‘‘నేడు ‘కభీ ఖుషీ, కభీ గమ్’ లాంటి సినిమాను రూపొందించడం కష్టం. నటుల రెమ్యూనరేషన్స్ ఆకాశనంటుతున్నాయి. అందువల్ల ఆరుగురితో సినిమా చేయడం ఎంత కష్టమో ఊహించుకోండి. ఎక్కువ మంది ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే వీక్షకులకు బిగ్ ట్రీట్‌లా ఉంటుంది. అది జరగాలని నేను ఆశిస్తున్నాను. కానీ, ఆర్థికపరంగా ఇది కష్టం’’ అని కరణ్ జోహార్ పేర్కొన్నాడు. కరణ్ జోహార్ గత కొంతకాలంగా సినిమాల నిర్మాణంపైనే దృష్టి సారించాడు. చివరగా ‘యే దిల్ హై ముస్కిల్’ కు దర్శకత్వం వహించాడు. తాజాగా ‘రాకీ ఔర్, రాణీ కీ ప్రేమ్ కహానీ’ (Rocky Aur Rani Ki Prem Kahani) కీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్, ఆలియా భట్ హీరో, హీరోయిన్స్‌గా నటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.