హిందీలో పాపులర్ టీవీ షో అంటే టక్కున గుర్తొచ్చే పేరు ‘కాఫీ విత్ కరణ్’ (Koffee With Karan). ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ (Karan Johar) హోస్ట్ చేస్తున్న ఈ టాక్ షోకి దేశవ్యాప్తంగా చాలామంది అభిమానులు ఉన్నారు. ఈ టాక్ షో (Talk Show)లో కరణ్ బాలీవుడ్ ప్రముఖులను క్రేజీ ప్రశ్నలు అడుగుతూ తికమక పెడుతుంటాడు. ఈ షో ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకొని ప్రస్తుతం ఏడో సీజన్ నడుస్తోంది. ఇప్పటివరకు టెలికాస్ట్ అయిన ఎపిసోడ్స్‌లో ఆలియా భట్, రణ్‌వీర్‌సింగ్, జాన్వీ కపూర్, సారా అలీఖాన్, అక్షయ్ కుమార్, సమంతా రూత్ ప్రభు, విజయ్ దేవరకొండ, అనన్య పాండే అతిథులుగా హాజరై పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు.
అయితే.. కరణ్ అందరిని కామన్‌గా శృంగార జీవితం, బ్రేకప్స్, మాజీ లవర్స్ గురించి ప్రశ్నలు ఎక్కువగా అడిగాడు. దీంతో పలువురు నెటిజన్లు దీనిపై విమర్శిస్తూ ట్వీట్స్ చేశారు. ఒక అభిమాని కాఫీ విత్ కరణ్ 7 గురించి చేసిన ట్వీట్‌లో.. ‘Koffee With Karan 7కి ప్రస్తుతం ఓ టెంప్లేట్ ఉంది.. అవి
1. డేటింగ్ హిస్టరీ, శృంగార జీవితం, బ్రేకప్స్? తర్వాతి ప్రాజెక్టు?
2. మీ గ్రూప్‌లో ఎవరి ఎవరంటే మీకు నచ్చదు?
3. బంధుప్రీతిపై మీ అభిప్రాయం ఏంటి?
4. బయటి వ్యక్తులకు ఏమైన సమస్యలు ఎదురయ్యాయా?
5. కొన్ని ఆటలు.. కప్పులపై సంతకం. చివరిలో తదుపరి ఎపిసోడ్‌లో కలుద్దాం’ అని ప్రతి ఎపిసోడ్‌లో ఇవే ఉంటాయని రాసుకొచ్చాడు. దీనిపై కరణ్ స్పందిస్తూ.. ‘ఏం బ్రేక్‌డౌన్ చేశారు. షోని బాగా ఫాలో అవుతున్నారు. బహుశా మీరు మా బృందంలో ఉండడం కరెక్టేమో?’ అని ఫన్నీగా రిప్లై ఇచ్చాడు.
మరో నెటిజన్.. ‘ఈ శృంగారం, దాని సంబంధించిన విషయాలు తప్ప.. చర్చించడానికి మంచి టాపిక్ లేదా?’ అంటూ రాసుకొచ్చాడు. దాని గురించి మీరు బాధపడకండి అంటూ కరణ్ రిప్లై ఇచ్చాడు. అలాగే మరికొందరికి సైతం కరణ్ రిప్లై ఇవ్వడం ఇక్కడ విశేషం.