ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కాస్ట్లీ కారు గిఫ్టుగా ఇచ్చారు. టాలీవుడ్లో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోలకు డాన్స్ కొరియోగ్రఫీ అందించిన వారిలో జానీ మాస్టర్ ఒకరు. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆయన ఎన్నో సూపర్ హిట్ సాంగ్‌కు అద్భుతమైన మాస్ స్టెప్పులు కంపోజ్ చేశారు. అంతేకాదు, వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఉంది. జానీ మాస్టర్‌కు కష్టం వచ్చినప్పుడు చరణ్ అండగా నిలిచారని స్వయంగా ఆయనే తెలిపిన సందర్భం కూడా ఉంది.
ఇలా హీరోలతో మంచి రిలేషన్ మేయింటైన్ చేస్తూ తమ సినిమాలలోని పాటలకు మంచి డాన్స్ కొరియోగ్రఫీ అందిస్తున్న జానీ మాస్టర్‌పై హీరోలు కూడా అంతే అభిమానం, ప్రేమ చూపిస్తుంటారు. తాజాగా తమిళంలో విజయ్ - పూజా హెగ్డే జంటగా నటిస్తున్న 'బీస్ట్' సినిమాలోనూ రెండు సాంగ్స్‌కు జానీ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు. ఇక కన్నడ స్టార్ హీరో తెలుగులోనూ ఈగ, బాహుబలి, సైరా లాంటి భారీ చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ తెచ్చుకున్న కిచ్చా సుదీప్.. తాజాగా జానీ మాస్టర్‌కు ఖరీదైన మహీంద్ర థార్ కారుని బహుమతిగా ఇచ్చారు. దీని విలువ సుమారు 15 లక్షలు వరకు ఉంటుందట. ఈ సందర్భంగా సుదీప్తో జానీ మాస్టర్ కొత్త కారు ముందు నిలుచొని ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్‌గా మారాయి. కాగా, సుదీప్ హీరోగా నటించిన 'విక్రాంత్ రోణా' చిత్రంలో ఓ పాటకు జానీ మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీ అందించారు. ఇందులో బాలీవుడ్ బూటీ జాక్వెలిన్ పెర్నాండేజ్ అదిరే స్టెప్పులతో సందడి చేయబోతోంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.