‘‘నా మాతృభాష తమిళం. అది వర్థిల్లాలి అని చెప్పడం నా బాధ్యత. హిందీ భాషకు నేను వ్యతిరేకిని కాను. అలాగని నా మాతృభాషకు అడ్డుపడితే మరో ఆలోచన లేకుండా ఎదుర్కోడానికి రెడీగా ఉన్నాను. మాతృభాషను మరువకండి’’ అని విశ్వనటుడు కమల్‌హాసన్ (Kamal hassan)అన్నారు. ఆయన హీరోగా స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం ‘విక్రమ్’(Vikram trailer). లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫహద్ ఫాజిల్, విజయ్‌సేతుపతి కీలక పాత్రధారులు. సూర్య ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. జూన్ 3న విడుదల కానుందీ సినిమా. చెన్నైలో జరిగిన ‘విక్రమ్’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కమల్‌హాసన్ మాట్లాడుతూ.. ‘‘సినిమా, రాజకీయం కవలపిల్లలు. అదే నేను చేస్తున్నా. మాతృభాషకు ఎవరు అడ్డువచ్చినా ఎదుర్కొంటాను. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. నేను హిందీకి వ్యతిరేకిని కాను’’ అని అన్నారు. భాషపై ఈ మధ్యకాలంలో జరిగిన చర్చల నేపథ్యంలో కమల్ ఇలా స్పందించారు.