పంచదార బొమ్మ ఈ మిత్రవిందా!

‘లక్ష్మీ కల్యాణం’లో లక్ష్మీ..

‘చందమామ’లో మహాలక్ష్మీ..

‘మగధీర’లో మిత్రవిందా..

‘ఆర్య 2’ గీత..

‘డార్లింగ్‌’ నందిని

‘బృందావనం’లో భూమి

‘బిజినెస్‌మెన్‌’ చిత్ర

‘నేనే రాజు నేనే మంత్రి’లో రాధ

‘ఖైదీ నంబర్‌ 150’లో లక్ష్మీ...

ఇలా పాత్ర ఏదైనా ఒదిగిపోవడం కాజల్‌లో ఉన్న ప్రత్యేక గుణం. అందుకే ఆమెను అసలు పేరుతో కన్నా పోషించిన పాత్రలతోనే ఎక్కువగా పిలుస్తుంటారు అభిమానులు. 

పట్టు పరికిణి కట్టినా, చీర కట్టినా.. చూడీదార్‌ ధరించినా, ట్రెండీ జీన్స్‌ వేసినా తన అందం మాత్రం చందమామను మైమరించేలా ఉంటుంది. 2004లో హిందీ సినిమాతో కెరీర్‌ ప్రారంభించి కాజల్‌ 2007 లక్ష్మీ కల్యాణం’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. పదిహేనేళ్లకు పైగా కెరీర్‌లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారరు 60 చిత్రాల్లో కాజల్‌ నటించారు. అప్పుడప్పుడు ప్రత్యేక గీతాల్లోనూ నటించారు. శనివారం కాజల్‌ పుట్టిన రోజు సందర్భంగా పంచదార బొమ్మ కెరీర్‌, జర్నీపై ఓ లుక్కేద్దాం..కాజల్‌ చదువంతా  ముంబైలో సాగింది. మాస్‌ కమ్యునికేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి తర్వాత మోడలింగ్‌ చేశారు. ఆ తరుణంలోనే హిందీ ‘క్యు హో గయా న’ (2004) సినిమాలో ఓ పాత్ర పోషించే అవకాశం దక్కింది. ఆ సినిమా తర్వాత భారతీరాజా దర్శకత్వంలో ‘బొమ్మలాట్టమ్‌’ సినిమాతో హీరోయిన్‌గా దక్షిణాది పరిశ్రమకు పరిచయం కావాల్సింది. ఆ సినిమా వాయిదా పడడం వల్ల తెలుగులో ‘లక్ష్మీ కల్యాణం’ (2006) హీరోయిన్‌గా ఆమెకు తొలి సినిమా అయింది. తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశించిన ఫలితం అందించలేదు. రెండో సినిమా ‘చందమామ’లో మహాలక్ష్మీ పాత్రతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమా సూపర్‌హిట్‌ కావడంతో కాజల్‌కు అవకాశాలు వరుస కట్టాయి. కానీ తదుపరి రెండు చిత్రాలు సరైన విజయాన్ని అందించలేకపోయాయు. 2009లో రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మగధీర’లో మిత్రవిందా దేవి, ఇందు పాత్రల్లో ఒదిగిపోయింది. ఈ చిత్రంతో కెరీర్‌లో మరచిపోలేని విజయాన్ని సొంతం చేసుకుంది కాజల్‌. దీనితో కాజల్‌ కెరీర్‌ మలుపు తిరిగింది. అక్కడి నుంచి స్టార్‌ హీరోలా సరసన అవకాశాలు అందుకుంది. డార్లంగ్‌, మిస్టర్‌, హిందీ ‘సింగమ్‌’, ‘బిజినెస్‌ మేన్‌’, ‘టెంపర్‌’, ‘నాయక్‌’, ‘తుపాకీ’, ‘వివేకం’, ‘ఖైదీ నెంబర్‌ 150’, ‘మెర్సల్‌’  లాంటి హిట్‌ చిత్రాల్లో నటించి సక్సెస్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. తనని టాలీవుడ్‌కి పరిచయం చేసిన తేజ కమ్‌ బ్యాక్‌ సినిమా ‘నేనేరాజు నేనే మంత్రి’లో కాజల్‌ పోషించిన రాధ పాత్రతో కాజల్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

ప్రయోగాత్మక చిత్రం.. 

అప్పటికే బాలీవుడ్‌ ‘స్పెషల్‌ చబ్బీస్‌’, సింగం’ సినిమాలతో ఆకట్టుకున్న కాజల్‌ ప్రయోగాత్మక చిత్రం ‘దో లఫ్జోంకి కహానీ’ సినిమాలో అంధురాలిగా నటించి మెప్పించింది. కమర్షియల్‌గా ఈ సినిమా సక్సెస్‌ సాధించకపోయినా నటిగా కాజల్‌ సక్సెస్‌ అయ్యారు. ఈ సినిమా తర్వాత అంధుల కష్టాలను తెలుసుకుని తన తదనంతరం  కళ్లను దానం చేస్తానని చెప్పి పెద్ద మనసును చాటుకుంది.పరాజయాల పరంపర..

తమిళ చిత్రం ‘మెర్సల్‌’ తర్వాత కాజల్‌ నటించిన చిత్రాలు వరుసగా పరజయాలను చవిచూశాయి. తెలుగులో ‘ఎమ్మెల్యే’, ‘కవచం’, ‘రణరంగం’, సీత, ‘మోసగాళ్లు’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టాయి. అయినా కాజల్‌కు అవకాశాలు తగ్గలేదు.  ఖైౖదీ నంబర్‌ 150 తర్వాత మరోసారి ‘ఆచార్య’ చిత్రంతో చిరంజీవి సరసన అవకాశం అందుకుంది. కమల్‌ హాసన్‌ సరసన ‘భారతీయుడు–2’లోనూ అవకాశం అందుకుంది. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో సినిమాకు సినిమాకు మేకర్స్‌ కొత్త అందాలను కథానాయికలుగా ఎంచుకుంటున్నారు. అయితే కాజల్‌ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తయినా ఇంకా తన హవా కొనసాగిస్తుంది.  లాక్‌డౌన్‌లో  గౌతమ్‌ కిచ్లును పెళ్లాడిన ఈ అమ్మడు మరింత జోరు పెంచింది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి. 

ఆస్ట్రోనాట్‌ కావాలని...

కాజల్‌కు చదువుకునే రోజుల్లో ఆస్ట్రోనాట్‌ కావాలని కోరిక ఉండేది. అయితే చదువు తదనంతరం మోడలింగ్‌లో బిజీ కావడం వల్ల ఆ కోరికను అలాగే పక్కన పెట్టారు. కాజల్‌కు సేవా గుణం కూడా ఎక్కువే. అరకు ప్రాంతంలో గిరిజనులు నివశించే ప్రాంతాల్లో ఆమె స్కూల్‌ నడిపిస్తున్నారు. ఎన్నో రకాలుగా గుప్తదానాలు చేస్తుంటారు కాజల్‌. మేడం టుస్సాడ్‌లో కాజల్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దక్షిణాది కథానాయికల్లో ఈ ఘనత దక్కించుకున్న తొలి కథానాయికగా కాజల్‌ నిలిచింది.


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.