దర్శకేంద్రుడితోనే వాదనకు దిగిన సిల్క్ స్మిత

ABN , First Publish Date - 2021-06-13T19:45:38+05:30 IST

చెన్నైలోని వాహినీ స్టూడియో...మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘కొండవీటి రాజా’ చిత్రం కోసం రూ. ఐదు లక్షల వ్యయంతో ఓ భారీ సెట్‌ వేశారు. ‘వలయాల ఊయలలో..’ పాటను చిరంజీవి, స్మితపై తీయడం కోసం ఏర్పాట్లు చేశారు. సిల్క్‌ స్మిత ఆ రోజుల్లో చాలా బిజీగా ఉండేవారు.

దర్శకేంద్రుడితోనే వాదనకు దిగిన సిల్క్ స్మిత

చెన్నైలోని వాహినీ స్టూడియో...మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘కొండవీటి రాజా’ చిత్రం కోసం రూ. ఐదు లక్షల వ్యయంతో ఓ భారీ సెట్‌ వేశారు. ‘వలయాల ఊయలలో..’ పాటను చిరంజీవి, సిల్క్ స్మితపై  తీయడం కోసం ఏర్పాట్లు చేశారు. సిల్క్‌ స్మిత ఆ రోజుల్లో చాలా బిజీగా ఉండేవారు. అందుకే నాలుగు నెలల కిందటే ఆమె కాల్షీట్లు తీసుకొన్నారు. రూ. 25 వేలు పారితోషికం ముందుగానే ఇచ్చేశారు నిర్మాత దేవీ వరప్రసాద్‌. అలాగే ఆమె కాస్ట్యూమ్స్‌ కోసం అదనంగా మరో రూ.20 వేలు కూడా ఇచ్చారు. అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం సెట్‌ వర్క్‌ పూర్తి కాగానే పాట చిత్రీకరణ ప్రారంభించారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. అసలు కథ అక్కడే మొదలైంది. స్మిత సెట్‌లోకి అడుగుపెట్టగానే దర్శకుడు రాఘవేంద్రరావు ఆమె వంక పరిశీలనగా చూశారు. అప్పుడే నిద్ర లేచి తల కూడా దువ్వుకోకుండా చింపిరి జుట్టుతో సెట్‌లోకి వచ్చిందామె.


పాటల్లో ఆర్టిస్టులను మరింత అందంగా చూపించడం రాఘవేంద్రరావుకు అలవాటు కనుక హెయిర్‌ స్టయిల్‌ బాగొలేదనీ మార్చమని సూచించారు. సినిమాకు దర్శకుడే కీలకం. ఆయన చెబితే ఎవరైనా పాటించాల్సిందే. అందులోనూ దర్శకేంద్రుడు చెబితే ఎవరూ కాదనరు. కానీ, స్మిత ఆయన సలహా పాటించలేదు సరికదా తన హెయిర్‌ స్టయిల్‌ బాగానే ఉందని ఆయనతో వాదనకు దిగింది. రాఘవేంద్రరావు వాదనను పొడిగించలేదు. ‘సరే నీ ఇష్టం’ అని షాట్‌ తీయడానికి రెడీ అయ్యారు. ఆ విషయంలోనే కాదు.. ఆ రోజంతా చిత్రవిచిత్రంగా ప్రవర్తించింది స్మిత. పాటలోని కొంత భాగాన్ని పొగమంచు వాతావరణంలో  తీయాలన్నది దర్శకుడి ఆలోచన. అయితే మధ్యలో పొగ పోయేలా ఫ్యాన్‌ వేసుకుని కూర్చుని షూటింగ్‌కు అంతరాయం కలిగించిందామె.  


ఇదంతా దూరం నుంచి గమనిస్తున్నారు నిర్మాత దేవీ వరప్రసాద్‌. స్మిత ప్రవర్తన ఆయనకు నచ్చలేదు. కోపం వచ్చినా షూటింగ్‌కు ఇబ్బంది కాకూడదని ఊరుకున్నారు. ఆ రోజు అలాగే గడిచింది. రెండో రోజు కూడా స్మిత వ్యవహారశైలిలో ఏమాత్రం మార్పు రాలేదు. సాధారణంగా సెట్‌లో దర్శకుడి దగ్గరికే నటీనటులు, సాంకేతిక నిపుణులు వెళ్లి మాట్లాడుతుంటారు. కానీ ఓ విషయంలో దర్శకుడు రాఘవేంద్రరావే తన దగ్గరకు వచ్చి మాట్లాడాలని స్మిత చెబుతుండగా దేవీ వరప్రసాద్‌ ప్రత్యక్షంగా చూశారు. ఆమె తీరుపై ఆయనకు కోపం వచ్చింది. దర్శకుడు రాఘవేంద్రరావుతో మాట్లాడి తక్షణమే స్మితను ఆ సినిమా నుంచి తొలగించారు. అయితే రెండు చరణాలు మాత్రం అప్పటికి స్మితపై చిత్రీకరించారు. పల్లవి, ఇంకో చరణం మిగిలి ఉన్నాయి. పల్లవిని జయమాలినితో, చరణాన్ని అనురాధతో చిత్రీకరించి పాట పూర్తి చేశారు. ఒకే పాటలో మెగాస్టార్‌ చిరంజీవి...  స్మిత, జయమాలిని, అనురాధలతో కలసి డ్యాన్స్‌ చేయడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. భలే తీశారే అనుకున్నారు. కానీ అసలు విషయం ఇదీ!. 


- వినాయకరావు 

Updated Date - 2021-06-13T19:45:38+05:30 IST