అతిశయోక్తులు, పగలు ప్రతీకారాలు లేకుండా నిజానికి దగ్గరగా సరికొత్త లోకంలోకి తీసుకెళ్లి ప్రేక్షకులను మెప్పించేలా ‘గంధర్వ’ చిత్రం తీశానని దర్శకుడు అప్సర్ తెలిపారు. సందీప్ మాధవ్, గాయత్రీ ఆర్. సురేష్ జంటగా ఆయన రూపొందించిన చిత్రం ఇది. సుభాని నిర్మాత. జులై 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అప్సర్ మాట్లాడుతూ
ఇజ్రాయిల్‌లో జరిగిన యథార్థ సంఘటన స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నాను. వయసు పై బడినా యువకుడిలానే కనిపించే వ్యక్తి జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనల సమాహారం ఈ చిత్రం.
క్లైమాక్స్ చాలా బాగా వచ్చింది. కథ 90శాతం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. కుటుంబ అనుబంధాలు, కామెడీ ట్రాక్, సైన్స్.. ఇలా ప్రేక్షకులను మెప్పించే అన్ని అంశాలు సినిమాలో ఉన్నాయి. ఇందులో సందీప్ మాధవ్ కెప్టెన్ అవినాష్ అనే పాత్రలో కనిపిస్తారు. భిన్న ఛాయలున్న పాత్రలో ఆకట్టుకుంటారు. కథానుసారం వచ్చే కొన్ని సన్నివేశాలు పవన్ కల్యాణ్ అభిమానులకు కిక్ ఇస్తాయి.
యుద్ధ సన్నివేశాలు లఢఖ్‌లో చిత్రీకరించాం. గాయత్రీ ఆర్. సురేష్ నటనకు మంచి పేరు వస్తుంది. ప్రస్తుతం రెండు కథలు సిద్ధం చేశాను. నా తదుపరి చిత్రం పెద్ద బ్యానర్లో ఉంటుంది.