ఎప్పటికీ గుర్తుండిపోయే విజయం ఇది

ABN , First Publish Date - 2022-05-18T05:56:27+05:30 IST

‘ఇది సక్సెస్‌ సెలబ్రెషన్‌లా లేదు. వంద రోజుల వేడుక జరుపుతున్నట్లుగా ఉంది. ‘సర్కారు వారి పాట’ విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అన్నారు...

ఎప్పటికీ గుర్తుండిపోయే విజయం ఇది

‘ఇది సక్సెస్‌ సెలబ్రెషన్‌లా లేదు. వంద రోజుల వేడుక జరుపుతున్నట్లుగా ఉంది. ‘సర్కారు వారి పాట’  విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అన్నారు మహేశ్‌బాబు. ఆయన నటించిన ఈ చిత్రం విజయవంతమైన నేపథ్యంలో కర్నూలులో సోమవారం రాత్రి  విజయోత్సవాన్ని నిర్వహించారు.  ఇందులో నిర్మాతలు నవీన్‌ యర్నేని, రవిశంకర్‌, దర్శకుడు పరశురామ్‌, సంగీత దర్శకుడు తమన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో మహేశ్‌ మాట్లాడుతూ ‘ఒక్కడు సినిమా షూటింగ్‌ కోసం ఇంతకుముందు కర్నూలు వచ్చాను. ‘సర్కారు వారి పాట’ వేడుక నిర్వహించాలని తక్కువ సమయంలోనే అనుకోవడంతో ఇంత మంది వస్తారని ఊహించలేదు. మీ అందరినీ చూసిన ఉత్సాహంతో స్టేజ్‌ పైకి వచ్చి డ్యాన్స్‌ చేశాను. మీ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. మా ఫ్యామిలీతో ఈ సినిమా చూశాను. పూర్తయ్యాక మా అబ్బాయి గట్టిగా హగ్‌ చేసుకున్నాడు. అన్ని సినిమాలకంటే ఇందులో బాగా చేశాననీ, అందంగా ఉన్నాననీ సితార పాప చెప్పింది. ‘పోకిరి’, ‘దూకుడు’ చిత్రాలను మించి పోతుందని నాన్నగారు చెప్పారు. ఈ క్రెడిట్‌ దర్శకుడు పరశురామ్‌కు దక్కుతుంది. ప్యాండమిక్‌లో అందరం చాలా కష్టపడ్డాం. కానీ మీరు ఇచ్చిన విజయంతో ఆ కష్టాన్ని మరిచిపోయాం. మైత్రి మూవీ మేకర్స్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. వాళ్లకు నేను ‘శ్రీమంతుడు’ ఇచ్చానని ఎప్పుడూ థ్యాంక్స్‌ చెబుతుంటారు. కానీ ఈ రోజు నాకు ‘సర్కారు వారి పాట’తో ఘన విజయం ఇచ్చారు. నాన్నగారి ఫ్యాన్స్‌ ఎప్పుడూ నా గుండెల్లో ఉండిపోతారు’ అన్నారు.

‘మహేశ్‌గారి ‘ఒక్కడు’ సినిమా చూసి డైరెక్టర్‌ కావాలని ఇండస్ర్టీకి వచ్చాను. ఆయన సినిమాకు  దర్శకత్వం వహించడం, ఆ సినిమా కర్నూలులో విజయోత్సవం జరుపుకోవడం నాకు లైఫ్‌ టైమ్‌ గిఫ్ట్‌. మహేశ్‌గారికి మంచి సినిమా ఇస్తానని మాట ఇచ్చాను. దీన్ని నిలబెట్టుకున్నందుకు   ఆనందంగా ఉంది’ అన్నారు దర్శకుడు పరశురామ్‌. ‘మహేశ్‌గారి  ఫిగర్‌ క్లాస్‌.. కానీ ఆయనకు వచ్చే కలెక్షన్స్‌ మాత్రం మాస్‌. ‘దూకుడు’ నుండి మా ప్రయాణం మొదలైంది. ఒక్కో సినిమాకు తన  రేంజ్‌ పెంచుకుంటూ  వెళుతున్నారు’ అన్నారు సంగీత దర్శకుడు తమన్‌. ఈ సినిమాలో ఐదు పాటలు రాసే  అవకాశం ఇచ్చిన దర్శకుడు పరశురామ్‌కు ధన్యవాదాలు తెలిపారు గీత రచయిత అనంత శ్రీరామ్‌. 


Updated Date - 2022-05-18T05:56:27+05:30 IST