ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోతుంది

ABN , First Publish Date - 2021-08-06T07:29:10+05:30 IST

‘‘ఇప్పటిదాకా మధ్య తరగతి నేపథ్యంలో తండ్రీ కొడుకుల అనుబంధంపై చాలా సినిమాలు వచ్చి హిట్టయ్యాయి. ఈ చిత్రంలో తండ్రీ కొడుకుల బంధాన్ని సరికొత్తగా ఆవిష్కరించాం...

ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోతుంది

‘‘ఇప్పటిదాకా మధ్య తరగతి నేపథ్యంలో తండ్రీ కొడుకుల అనుబంధంపై చాలా సినిమాలు వచ్చి హిట్టయ్యాయి. ఈ చిత్రంలో తండ్రీ కొడుకుల బంధాన్ని సరికొత్తగా ఆవిష్కరించాం. మనసుకు హత్తుకునే భావోద్వేగాలున్న కథ ఇది’’ అని కిరణ్‌ అబ్బవరం అన్నారు. ఆయన కథానాయకుడిగా శ్రీధర్‌ గాదె దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం’. శుక్రవారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా కిరణ్‌ అబ్బవరం చెప్పిన 


విశేషాలు...

సినిమా కథ కల్యాణ మండపం నేపథ్యంలో వినోదాత్మకంగా సాగుతూనే అంతర్లీనంగా మానవ సంబంధాలను చర్చిస్తుంది.  సినిమా చివరి అరగంటలో ప్రేమ, కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోతాయి. సాయికుమార్‌ గారు తన నటనతో మంత్రముగ్ధులను చేస్తారు. ఆయన పాత్రలోని భిన్న ఛాయలు సినిమాను మరో స్థాయికి తీసుకెళతాయి. 


ఓటీటీలో విడుదల చేయమని మంచి ఆఫర్‌లు వచ్చాయి. కానీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. అందుకే థియేటర్లలో విడుదల చేస్తున్నాం.


ఎక్కువ భాగం రాయలసీమ నేపథ్యంలో సాగే కథ కావడంతో తన ఆహార్యం, సంభాషణల కోసం ప్రియాంక జవాల్కర్‌ బాగా సన్నద్ధమయ్యారు. ఆమె కష్టం తెరపై కనిపిస్తుంది. 


ఈ సినిమాతో నాది ఏడాదిన్నర ప్రయాణం. మధ్యలో రెండు లాక్‌డౌన్‌లు అడ్డొచ్చాయి. షూటింగ్‌ ఎప్పుడు పూర్తవుతుందో, థియేటర్లు తెరుచుకుంటాయో, లేదో అనే ఒత్తిళ్ల నడుమ పనిచేస్తూ వచ్చాం. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాగలుగుతున్నాం అంటే ఈ కష్టకాలంలో మా నిర్మాతలు ప్రమోద్‌, రాజు అందించిన సహకారం వల్లే. 


ప్రస్తుతం ‘సెబాస్టియన్‌ పి.సి 524’ చిత్రం చేస్తున్నాను. ఇది తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతుంది. మరో మూడు సినిమాలు అంగీకరించాను. వాటిని వచ్చే ఏడాది సెట్స్‌పైకి తీసుకెళ్తాం.

Updated Date - 2021-08-06T07:29:10+05:30 IST