అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాలభామ నయనతార (Nayanthara). దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకునే తారల్లో ఆమె ఒకరు. నయన్ గత కొంతకాలంగా స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)తో డేటింగ్ చేస్తుంది. ఈ సెలబ్రిటీ లవ్‌బర్డ్స్ త్వరలోనే తిరుపతిలో పెళ్లి చేసుకోబోతున్నారు. గత కొన్ని రోజులుగా ‘కేన్స్ ఫిలిం ఫెస్టివల్’ (cannes film festival) లో ఆమె పాల్గొనబోతున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ వేడుకలో భారత్ తరఫున నయన్ సందడి చేయనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ వదంతులు మీడియాలో షికార్లు కొడుతుండటంతో నయనతారతో సన్నిహితంగా మెలిగేవారు స్పందించారు. ‘కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో’ నయన్ పాల్గొనడం లేదని తెలిపారు. ‘‘నయన్ జూన్ 9న విఘ్నేశ్ శివన్‌ను పెళ్లి చేసుకోబోతుంది. అందువల్ల ఈవెంట్లో పాల్గొనడం లేదు’’ అని ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. లేడీ సూపర్ స్టార్ పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారని తెలుస్తోంది. పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీలోని స్నేహితుల కోసం చెన్నైలో గ్రాండ్‌గా రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నారని సమాచారం. ఈసారి ‘కేన్స్ ఫిలిం ఫెస్టివల్’ కు దక్షిణాది నుంచి అనేక మంది సెలబ్రిటీలు హాజరవుతున్నారు. పూజా హెగ్డే (Pooja Hedge), తమన్నా భాటియా (Tamannaah Bhatia), ఆర్. మాధవన్ (R Madhavan) , ఏఆర్. రెహమాన్(AR Rahman) తదితరులు రెడ్‌కార్పెట్‌పై నడవనున్నారు.