‘లే లే లే.. నా రాజా ’ పాట వెనుకున్న కథ తెలిస్తే షాకవుతారు

ABN , First Publish Date - 2021-04-20T03:04:47+05:30 IST

అక్కినేని నాగేశ్వరరావు కెరీర్‌లో ‘ప్రేమనగర్‌’ చిత్రానికి ఉన్న స్థానం ప్రత్యేకం. ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టడమే కాకుండా అద్భుతమైన విజయాన్ని అందించిన చిత్రమది. ఈ సినిమా కూడా ఆడకపోతే చిత్రనిర్మాణానికి పుల్‌స్టాప్‌ పెట్టేసి

‘లే లే లే.. నా రాజా ’ పాట వెనుకున్న కథ తెలిస్తే షాకవుతారు

అక్కినేని నాగేశ్వరరావు కెరీర్‌లో ‘ప్రేమనగర్‌’ చిత్రానికి ఉన్న స్థానం ప్రత్యేకం. ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టడమే కాకుండా అద్భుతమైన విజయాన్ని అందించిన చిత్రమది. ఈ సినిమా కూడా ఆడకపోతే చిత్రనిర్మాణానికి పుల్‌స్టాప్‌ పెట్టేసి పొలం పనులు చేసుకుందామని నిర్ణయానికి వచ్చేసిన రామానాయుడుని నిర్మాతగా నిలబెట్డడమే కాకుండా తెలుగు సహా తమిళ, హిందీ భాషల్లో కూడా తీసే ధైర్యాన్నీ, విజయాన్నీ ఇచ్చిన సినిమా ‘ప్రేమనగర్‌’. ఈ సినిమాలోని పాటలన్నీ హిట్టే. ఆత్రేయ సాహిత్యం, కె.వి.మహదేవన్‌ సంగీతం పోటీ పడ్డాయి. ఆత్రేయ పాటలు అంటేనే మసాలా దినుసులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. వాటికి మరింత  ఘాటు జోడించిన పాట ‘లే లే లే నా రాజా.. నువ్వు లేవనంటావా.. నన్ను లేపనంటావా’ . ఘంటసాల, ఎల్‌.ఆర్‌. ఈశ్వరి పాడిన ఈ పాటను సినిమాలో అక్కినేని, జ్యోతిలక్ష్మిపై చిత్రీకరించారు. ఆ రోజుల్లో ఈ పాట విన్నవారంతా ‘హవ్వ.. నాగేశ్వరరావు సినిమాలో ఇలాంటి పాటా! ’ అని విమర్శించారు. అయితే పైకి అలా తిట్టినా థియేటర్‌కు వెళ్లి  ఈ పాట కాగానే గుట్టుచప్పుడు కాకుండా బయటకి వచ్చిన వారెందరో! 


ఈ పాట చిత్రీకరణ వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. అదేమిటంటే...

ఒక రోజు సెట్‌లో వాణిశ్రీ ఈ పాట వింటున్నారు. అప్పటికి నాగేశ్వరరావు సెట్‌కి రాలేదు. విన్న తర్వాత ‘నాగేశ్వరరావుగారు ఈ పాట విన్నారా?’ అని అడిగారు వాణిశ్రీ. ‘ఇంకా లేదు. ఇప్పుడు ఆయనకు వినిపించాలి. నీకు ఎలా ఉంది?’ అని అడిగారు రామానాయుడు. ‘నాదేముంది లెండి. నాగేశ్వరరావుగారు ఈ పాట వింటే మాత్రం ఒప్పుకోరు’ అంటూ తన అభిప్రాయం చెప్పారు వాణిశ్రీ. ‘ఆయన ఒప్పుకుంటే... ఎంత పందెం’ అన్నారు రామానాయుడు. ‘మీ ఇష్టం.. అనవసరంగా ఓడిపోతారు’ అన్నారు వాణిశ్రీ కాన్ఫిడెంట్‌గా. పక్కనే ఉన్న దర్శకుడు కె.ఎస్‌. ప్రకాశరావు కలగజేసుకొని ‘మీరిద్దరూ ఎందుకలా గొడవపడతారు. కాసేపట్లో ఆయనే వస్తారుగా’ అన్నారు.


డబుల్‌ మీనింగ్‌ ఉన్న పాటలంటే నాగేశ్వరరావుకి ఇష్టం ఉండదు కనుక ఈ పాట ఒప్పుకోరని గట్టి నమ్మకం వాణిశ్రీకి. అందుకే ‘లే.. లే.. నా రాజా...’ అంటూ ఆ పాట పాడటం ప్రారంభించారు. ఇంతలో ఆమె వీపు మీద గట్టిగా చరిచారెవరో! ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశారు.. నాగేశ్వరరావు.

వెంటనే వాణిశ్రీ లేచి నిలబడి ‘నమస్కార మండీ’ అన్నారు. ఆయన ప్రతి నమస్కారం చేసి ‘ఏ సినిమాలోది ఈ పాట తల్లీ’ అనడిగారు.

తన పక్కనే ఉన్న రామానాయుడు, ప్రకాశరావు వంక ఓరగా చూస్తూ ‘పాట ఎలా ఉంది సార్‌’ అనడిగారు వాణిశ్రీ. ‘ నా మొహంలా ఉంది. ఇంకెప్పుడూ ఈ పాట నా ఎదుట పాడకు’ అని సీరియస్‌గా చెప్పారు నాగేశ్వరరావు.

‘సార్‌! ఈ పాట ఎందులోదో తెలుసా? మీరు, నేను కలసి నటిస్తున్న ‘ప్రేమనగర్‌’ చిత్రంలోది’ అని మెల్లిగా చెప్పారు వాణిశ్రీ. 

నాగేశ్వరరావు షాక్‌ తిని ‘నిజమా’ అన్నట్లు రామానాయడు, ప్రకాశరావు వైపు చూశారు. వాళ్లు సమాధానం చెప్పేలోగా ‘అవునండి.. ఈ పిక్చర్‌లోదే. మీరు, జ్యోతిలక్ష్మి పాడతారట’ అని చెప్పారు వాణిశ్రీ.

ఆ మాట వినగానే అక్కినేని ముఖంలో రంగులు మారాయి. ఆయనకు ఆశ్చర్యం, కోపం ఒకేసారి వచ్చినట్లు మిగిలిన ముగ్గురికీ అర్ధమైంది. ‘నాన్సెన్స్‌.: నేను చచ్చినా ఇలాంటి పని చెయ్యను’ అన్నారు.  అంతే. రామానాయుడు గుండెల్లో రాయి పడింది. 

ఇంతలో షాట్‌ రెడీ అంటూ పిలుపు రావడంతో నాగేశ్వరరావు సెట్‌లోకి వెళ్లారు. ఆయన అటు వెళ్లగానే రామానాయుడు వాణిశ్రీ మీద మండిపడ్డారు. ‘అసలు ఆ పాట నిన్నెవరు పాడమన్నారు? కామ్‌గా కూర్చోవచ్చుగా’ అని. ఆయన అలా అనేసరికి వాణిశ్రీకి భయం వేసింది. ‘ఏదో తమాషాకి అంటే .. నాగేశ్వరరావు నిజంగా చెయ్యరేమో: నా వల్లే ఇదంతా జరిగింది’ అని లోలోపల బాధపడిపోయారు.


ఆ మర్నాడు భయపడుతూనే సెట్‌కు వచ్చారు వాణిశ్రీ. రామానాయుడు, ప్రకాశరావు చిరునవ్వు ముఖాలతో కనిపించేసరికి ఆమె మనసు కుదుట పడింది. ‘ఏం హీరోయినూ! హీరో ఒప్పుకొన్నారు. పందెంలో నువ్వు ఓడిపోయావు’ అన్నారు ప్రకాశరావు.

దాంతో ఆమె మనసు కుదట పడింది. కానీ ఆయన ఎలా ఒప్పుకొన్నారా అనే అనుమానం వాణిశ్రీని వదల్లేదు. నాగేశ్వరరావు ఒంటరిగా దొరికినప్పుడు ఆయన్నే అడిగేశారు. అక్కినేని చిరునవ్వు నవ్వి ‘నాకు ఇష్టం లేదు కానీ డైరెక్టర్‌గారు కల్యాణ్‌ కేరెక్టర్‌ గురించి చెప్పి, ఆ పాట ఉంటే బాగుంటుందన్నారు. తీసిన తర్వాత బాగాలేకపోతే క్యాన్సిల్‌ చేద్దామన్నారు. దర్శకుడు చెప్పింది వినాలి కనుక కాదనలేకపోయాను’ అని చెప్పారు. 

అదండీ.. ‘లే లే లే నా రాజా ’ పాట వెనుకున్న కథ!

Updated Date - 2021-04-20T03:04:47+05:30 IST