పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల ‘రాధేశ్యామ్’ చిత్రంతో అభిమానుల్ని ఖుషీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ ‘ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె’, లాంటి బడా పాన్ ఇండియా మూవీస్ ను పట్టాలెక్కించారు. వీటిలో ‘ఆదిపురుష్’ చిత్రం పూర్తిగా పౌరాణికం కాగా.. ‘సలార్’ మూవీ కంప్లీట్ యాక్షన్ మూవీ. ఇక ‘ప్రాజెక్ట్ కె’ చిత్రం సోషియో ఫాంటసీగా తెరకెక్కుతోందని టాక్స్ వినిపిస్తున్నాయి. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇదే మాట వినిపిస్తోంది. అయితే ఎలాంటి కథ అనేది ఇప్పటి వరకూ తెలియలేదు. తాజాగా ఈ సినిమా కథపై పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ టైటిల్ లో గల ‘కె’ అనే అక్షరం దేనికి సంకేతం అనే దానిపై ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ‘ప్రాజెక్ట్ కె’ సినిమా కథాంశం మహాభారతంలోని రెండు ప్రధాన పాత్రల బేస్ గా రూపొందుతోందట. అందులో ఒకటి విష్ణు మూర్తి కల్కి అవతారమైతే.. రెండోది అశ్వథ్ధామ పాత్ర అని టాక్. కల్కి పాత్ర ను ప్రభాస్ చేస్తుండగా.. అశ్వథ్థామ పాత్రను అమితాబ్ చేస్తున్నారని టాక్. మహాభారతంలో ద్రోణుడి కొడుకైన అశ్వథ్థామ చిరంజీవి. ఆయనకి మరణం లేదు. అసలు ‘ప్రాజెక్ట్ కె’ అంటే ‘ప్రాజెక్ట్ కల్కి’ అని అర్ధమని టాక్స్ వినిపిస్తున్నాయి. విష్ణు మూర్తి పదవ అవతారం కల్కి. కలియుగాంతంలో విష్ణువు కల్కిగా అవతరించబోతున్నట్టు పురాణాలు చెబుతున్నాయి. వీర ఖడ్గం ధరించి, తెల్లటి గుర్రంపై విహరిస్తూ దుష్ట సంహారం గావించే ఆ అవతారం బేస్ గా ‘ప్రాజెక్ట్ కె’ ను నాగ్ అశ్విన్ ఆసక్తికరంగా మలుస్తున్నట్టు సమాచారం. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే నటిస్తోంది.