సేమ్ సీన్ రిపీట్.. MAA ఎన్నికల్లో ఊహించని పరిణామం.. సినీ వర్గాల్లో విశాల్ ప్రస్తావన..!
ABN , First Publish Date - 2021-10-06T18:10:53+05:30 IST
గతంలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (`మా`) ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి.

గతంలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (`మా`) ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు హీరో విష్ణు తమ తమ ప్యానెళ్లతో బరిలో దిగుతున్నారు. దాదాపు 900 మంది సభ్యులుగా ఉన్న ఈ సంస్థకు ఈ నెల 10వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మా ఎన్నికల హడావుడి వేడెక్కిపోయింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు హోరెత్తుతున్నాయి. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ప్రాంతీయత గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది.
తాజాగా నటుడు, దర్శకుడు రవిబాబు కూడా నాన్-లోకల్ అంశం గురించి మాట్లాడారు. ఈ పరిణామం తమిళ నటీనటులు సంఘం (నడిగర్) ఎన్నికల హడావుడిని గుర్తుకు తెస్తోంది. నడిగర్ సంఘం ఎన్నికలు జరిగినప్పుడు జరిగిన రచ్చ, వివాదాలు, ఆరోపణలు అన్నీ ప్రస్తుతం తెలుగు నాట కూడా రిపీట్ అవుతున్నాయి. నడిగర్ సంఘం ఎన్నికల్లో తెలుగు వాడైన విశాల్ రెడ్డి ఒక ప్యానెల్ తరఫున పోటీకి దిగారు. దీంతో ప్రత్యర్థి శిబిరంలోని రాధిక.. విశాల్ ప్రాంతీయత గురించి మాట్లాడారు. విశాల్ తెలుగువాడంటూ అతడి కులాన్ని కూడా ప్రస్తావించారు. అయినా విశాల్ వెనక్కి తగ్గకుండా ఎన్నికల్లో తలపడ్డారు. ఆ ఎన్నికల్లో నడిగర్ సంఘం సభ్యులు ప్రాంతీయత అంశాన్ని పట్టించుకోకుండా విశాల్ ప్యానెల్‌నే గెలిపించారు.
ప్రస్తుతం ప్రకాష్ రాజ్ విషయంలో కూడా ప్రాంతీయతే ప్రధాన చర్చగా మారింది. ప్రకాష్ రాజ్ తెలుగువాడు కాదంటూ విష్ణు ప్యానెల్‌కు చెందిన నటుడు నరేష్ విమర్శలు చేస్తున్నారు. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ అంశం మరింతగా హైలెట్ అవుతోంది. దానికి ప్రకాష్ రాజ్ వర్గం కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తోంది. తాను పాతికేళ్లుగా తెలుగు సినిమాలు చేస్తున్నానని, హైదరాబాద్‌లోనే నివాసం ఏర్పాటు చేసుకున్నానని, తెలుగు రాష్ట్రాల్లో గ్రామాలనే దత్తత తీసుకున్నానని చెబుతున్నారు. మరి `మా` సభ్యులు ఎవరి వాదానికి మద్దతు పలుకుతారో చూడాలి.