ఆ విషం సత్యనారాయణ మీద పని చేసి ఉంటే..?

తెలుగు సినిమాను సుసంపన్నం చేసిన విశిష్ట నటుల్లో కైకాల సత్యనారాయణ ఒకరు. అన్ని రసాల్లోనూ తిరుగులేని నటనను ప్రదర్శించిన అరుదైన నటుడు ఆయన. ఐదు దశాబ్దాలకు పైగా ఉన్న తన నటజీవితంలో ఎన్నో వందల పాత్రలు పోషించి, నవరస నటనా సార్వభౌమగా కీర్తి గడించారు సత్యనారాయణ. అటువంటి నటుడు కూడా ఒకప్పుడు  సినిమాల్లో అవకాశాలు దొరక్క చాలా ఇబ్బంది పడ్డారని వింటే ఆశ్చర్యం కలుగుతంది. ఆ రోజుల్లో ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌‌లో దర్శకత్వ శాఖలో పనిచేసే కె.ఎల్‌.ధర్‌ ఆహ్వానంపై గుడివాడ నుంచి మద్రాసు వెళ్లి వేషాల కోసం ప్రయత్నించిన సత్యనారాయణకు నిరాశే ఎదురైంది. కె.వి.రెడ్డి వంటి ప్రముఖులు కూడా నువ్వు పనికి వస్తావు అన్నారే తప్ప వేషాలు ఇవ్వలేకపోయారు. దాదాపు సంవత్సరం పాటు అవకాశాల కోసం ఎంతో తిరిగారు సత్యనారాయణ. ఎవరూ అవకాశం ఇవ్వలేదు. ఓ రోజు నిరాశతో హోటల్‌‌కు వెళ్లి ఆలోచిస్తూ కాఫీ తాగారు సత్యనారాయణ. ఆ కాఫీ కప్పు అడుగున చచ్చిన సాలీడు కనిపించింది. అది చూసి మిగిలిన వారంతా కంగారు పడ్డారు. డాక్టర్‌ దగ్గరకు వెళ్లమని సలహా ఇచ్చారు. అయితే  సత్యనారాయణ మాత్రం కంగారు పడలేదు. ‘‘తెల్లారాక కూడా నేను బతికి ఉంటే నాకు మంచి భవిష్యత్‌ ఉన్నట్లు లెక్క’’ అనుకొని రూమ్‌‌కు వెళ్లి పడుకున్నారు. తెల్లారింది. సత్యనారాయణ మాములుగానే నిద్ర లేచారు. ఆయనకు ఏమీ కాలేదు. దాంతో భవిష్యత్‌ మీద నమ్మకం కలిగింది. కొత్త ఉత్సాహంతో లేచి చకచకా రెడీ అయ్యారు.

ఆ సమయంలోనే డి.ఎల్‌. నారాయణ ‘సిపాయి కూతురు’ సినిమా తీస్తున్నారని తెలిసి ఆయన్ను కలిశారు. ఆయన ఏకంగా హీరో వేషం ఇవ్వడంతో సత్యన్నారాయణ ఆనందానికి అవధులు లేవు. అయితే సిపాయి కూతురు తర్వాత కూడా ఆయనకి అవకాశాలు రాలేదు. దాంతో విరక్తి కలిగి మద్రాసు తనకు కలిసి రాలేదనీ, ఇక ఇంటికి తిరిగి వెళ్లిపోదామని సత్యనారాయణ నిర్ణయించుకొనే సమయంలో సహస్ర శిరచ్చేదా అపూర్వ చింతామణి చిత్రంలో ఓ చిన్న వేషం దొరికింది. అయితే అది విలన్‌ వేషం కావడంతో సత్యనారాయణ సందేహించారు. హీరో కావాలనుకొని మద్రాసుకు వచ్చాక విలన్‌ వేషాలు వేయడమా అని ఆలోచనలో పడ్డారు. ఆ సమయంలో హీరోలు ఎక్కువ మంది ఉన్నారు. విలన్‌ వేషాలు వేసేవారు ఒకరిద్దరే ఉండడంతో విలన్‌ పాత్రలు ఒప్పుకోమని సత్యనారాయణకు సలహా ఇచ్చారు దర్శకుడు విఠలాచార్య. కనకదుర్గ పూజా మహిమ సినిమాలో తొలి విలన్‌ వేషం ఆయనే ఇచ్చారు. ఇక అక్కడినుంచి వెనక్కి తిరిగి చూసుకొనే అవకాశం సత్యనారాయణకు కలగలేదు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.