అమ్మను సరికొత్తగా చూపించే చిత్రం

ABN , First Publish Date - 2022-03-12T06:36:08+05:30 IST

‘‘స్టాండప్‌ రాహుల్‌’ కథ విన్నప్పుడే నాకు చాలా కొత్తగా అనిపించింది.

అమ్మను సరికొత్తగా చూపించే చిత్రం

‘‘స్టాండప్‌ రాహుల్‌’ కథ విన్నప్పుడే నాకు చాలా కొత్తగా అనిపించింది. తెలుగు తెరపై అమ్మను సరికొత్తగా చూపించే చిత్రం అవుతుంది. నేను రాజ్‌తరుణ్‌కు తల్లిగా చేశాను. కథలో ప్రాధాన్యమున్న పాత్ర చేశాను’’ అని నటి ఇంద్రజ అన్నారు. రాజ్‌తరుణ్‌, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. శాంటో మోహన్‌ వీరంకి దర్శకత్వంలో నందకుమార్‌ అబ్బినేని, భరత్‌ మాగులూరి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన విశేషాలను ఇంద్రజ పంచుకున్నారు. ‘నేను చెన్నైలో ఉన్నప్పుడు దర్శకుడు శాండో నాకు ఫోన్‌లో కథ వినిపించారు. మంచి పాత్ర కావడంతో వెంటనే అంగీకరించాను. మురళీశర్మకు భార్య పాత్ర చేశాను.  ఈ తరం భార్యభర్తలు మధ్య ఉండాల్సిన అనుబంధాలు, పిల్లలకు వారికి మధ్య తలెత్తే అపార్థాలను ఎలా పరిష్కరించుకోవచ్చనే చిన్న సందేశం కథలో మిళతమై ఉంది. ఈ తరం యువత తప్పక చూడాల్సిన చిత్రం ఇది. 


నటిగా నన్ను సంతృప్తి పరిచే పాత్రలు ఇప్పటిదాకా రాలేదనే చెప్పాలి. రొటీన్‌ పాత్రలు వస్తుండడంతో కొన్ని సినిమాల్లో అవకాశాలు వదులుకున్నాను. మున్ముందు మరిన్ని మంచి పాత్రలు దక్కుతాయనే నమ్మకం ఉంది. సినీ కెరీర్‌తో పాటు కుటుంబ జీవితం కూడా చాలా ముఖ్యమని భావించి నటిగా బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నాను. ప్రస్తుతం నెలలో 15 రోజులు షూటింగ్‌కు కేటాయిస్తున్నాను. మిగిలిన రోజులు కుటుంబానికి పరిమితం. ప్రస్తుతం నితిన్‌ ‘మాచర్ల నియోజకవర్గం’, ‘బూట్‌కట్‌’ చిత్రాల్లో నటిస్తున్నాను. మరో మూడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి’. 

Updated Date - 2022-03-12T06:36:08+05:30 IST