భారతీయ మూలాలు హాలీవుడ్‌లో విజయాలు

కళకు ఎల్లలు లేవు. అలాగే, కళాకారులకు సరిహద్దులూ లేవు. ప్రాంతం, భాష, దేశం... వీటికి అతీతంగా ప్రేక్షకుల మనసుల్లో గూడుకట్టుకున్న నటీనటులు మనకు కనిపిస్తారు. ప్రస్తుతం హిందీలో చిత్రాలు చేస్తున్న జాక్వలిన్‌ ఫెర్నాండేజ్‌ శ్రీలంక భామ. ఆ మాటకొస్తే... కట్రీనా కైఫ్‌ హాంకాంగ్‌లో జన్మించారు. గతంలో తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన ఎమీ జాక్సన్‌ది బ్రిటన్‌. పాకిస్తానీ మహీరా ఖాన్‌, అమెరికన్‌ నర్గిస్‌ ఫక్రి హిందీలో నటించారు. 


బట్‌, ఫర్‌ ఏ ఛేంజ్‌... భారతీయ మూలాలు ఉన్న అమ్మాయిలు, ఇప్పుడు హాలీవుడ్‌లో విజయబావుటా ఎగరేస్తున్నారు. ఇండియన్‌ ఆరిజన్‌ యాక్టర్లుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. విదేశీ నటీమణుల మధ్య ప్రత్యేకంగా నిలుస్తున్నారు. వాళ్ళను ఓసారి చూడండి...


‘నెవర్‌ హ్యావ్‌ ఐ ఎవర్‌’ - ఓటీటీలో విజయవంతమైన వెబ్‌ సిరీస్‌. జూలై 15న సెకండ్‌ సీజన్‌ విడుదల కానుంది. తొలి సీజన్‌తో పేరు తెచ్చుకున్న మైత్రేయి రామకృష్ణన్‌, రెండో సీజన్‌లోనూ కనిపించనున్నారు. రామకృష్ణన్‌... పేరు చూస్తే తమిళియన్‌ అనిపిస్తుందా? నిజమే! మైత్రేయి తండ్రి తమిళియన్‌. భారతీయ మూలాలు ఉన్న శ్రీలంక తమిళ శరణార్థి. ఆమె చిన్నతనంలో కెనడా వెళ్లారు. పదో తరగతి నుంచి మైత్రేయి నటన మీద దృష్టి పెట్టారు. తొలుత స్కూల్‌లో స్టేజ్‌ షోలు చేశారు. ‘నెవర్‌ హ్యావ్‌ ఐ ఎవర్‌’ కోసం 15000మంది ఆడిషన్‌కు వెళితే... మైత్రేయి రామకృష్ణన్‌ను అవకాశం వరించింది. నెట్‌ఫ్లిక్స్‌ ఫిల్మ్‌ ‘ద నెదర్‌ఫీల్డ్‌ గాళ్స్‌’లోనూ నటించే అవకాశం ఆమెకు దక్కిందని సమాచారం. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న అమెరికన్‌ యాక్షన్‌ కామెడీ థ్రిల్లర్‌ ‘రెడ్‌ నోటీ్‌స’లో నటించిన రీతూఆర్య కూడా ఇండియన్‌ ఆరిజన్‌ యాక్టరే. బ్రిటీష్‌ టీవీ సిరీస్‌ ‘డాక్టర్స్‌’తో తొలుత పేరు తెచ్చుకున్నారు. ‘హ్యూమన్స్‌’ ఆమెకు మరింత గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు ‘రెడ్‌ నోటీస్‌’లో డ్వేన్‌ జాన్సన్‌, గాల్‌ గాడట్‌ వంటి స్టార్స్‌తో నటించే అవకాశం అందుకున్నారు. ‘ద అంబరిల్లా అకాడెమీ’ రెండో సీజన్‌ రీతూఆర్యకు ఎంతో పేరు తెచ్చింది.


‘బ్యాడ్‌ ఎడ్యుకేషన్‌’లో జర్నలి్‌స్టగా, ‘హలా’లో స్కేటర్‌గా జెరాల్డీన్‌ విశ్వనాథన్‌ నటించారు. పేరులో విశ్వనాథన్‌ను బట్టి తమిళియన్‌ అని సులభంగా చెప్పవచ్చు. జెరాల్డీన్‌ తండ్రి మలేషియన్‌ తమిళ్‌. తల్లిది స్విట్జర్లాండ్‌. ‘బ్లాకర్స్‌’ సినిమా ఆమెకు తొలి గుర్తింపు తీసుకొచ్చింది. హాలీవుడ్‌ స్టార్స్‌ హ్యూ జాక్‌మెన్‌, డానియల్‌ రాడ్‌క్లిఫ్‌ వంటి స్టార్స్‌తో జెరాల్డీన్‌ నటించారు. వచ్చే ఏడాది విడుదల కానున్న ‘రంబుల్‌’లో మిన్నీ పాత్రకు గాత్రదానం చేశారు.


కథానాయిక ప్రియాంకా చోప్రా నిర్మించిన హాలీవుడ్‌ సినిమా ‘ఈవిల్‌ ఐ’లో నటించిన సునీతా మణి ఉన్నారుగా! ఆమె కూడా భారతీయ మూలాలు ఉన్న నటే. అందులో నటించిన సరితా చౌదరి కూడా! రెండేళ్లుగా సునీతా మణికి సినిమాల్లో ఛాన్సులు బాగా వస్తున్నాయి. టీవీ సిరీస్‌ ‘మిస్టర్‌ రోబోట్‌’, కామెడీ వెబ్‌ సిరీస్‌ ‘గ్లో’ ఆమెకు పేరు తెచ్చాయి. ప్రస్తుతం ‘మీరా, రాయల్‌ డిటెక్టివ్‌’ టీవీ సిరీ్‌సలో నటిస్తున్నారు. అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘గ్రాండ్‌ ఆర్మీ’లో నటించిన ఆష్లీ గేంగర్‌... బ్రిటీష్‌ టీవీ సిరీస్‌ ‘వండర్‌ల్‌స్ట’తో నటిగా ప్రయాణం ప్రారంభించి, ఆ తర్వాత ‘ద విచర్‌’లో ఛాన్స్‌ అందుకున్న అన్యా ఛలోట్రా సైతం భారతీయ మూలాలు ఉన్న నటీమణులే.


దివంగత నటులు ఇర్ఫాన్‌ఖాన్‌, ఓం పురి హాలీవుడ్‌ చిత్రాలు చేశారు. కథానాయికలు ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌, దీపికాపదుకోన్‌ హాలీవుడ్‌ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ప్రియాంకా చోప్రా హాలీవుడ్‌కు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నారు. కబీర్‌ బేడి, పంకజ్‌ త్రిపాఠీ, డింపుల్‌ కపాడియా, రణదీప్‌ హుడా వంటి నటులకు అప్పుడప్పుడూ అవకాశాలు వస్తున్నాయి. అయితే, భారతీయ మూలాలు ఉన్న అమ్మాయిలు హాలీవుడ్‌ టీవీ, సినిమాల్లో విజయబావుటా ఎగరేస్తూ... అందరికీ గర్వకారణంగా నిలుస్తున్నారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.