Afghanistan: అప్పుడు నాగార్జున.. ఇప్పుడు సత్యదేవ్‌

ABN , First Publish Date - 2021-08-17T00:58:21+05:30 IST

కొన్నేళ్ల క్రితం సినిమా షూటింగ్‌ అంటే దేశం దాటి వెళ్లిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. సినిమాల స్పాన్‌ పెరిగే కొద్దీ గ్రాండియర్‌ కోసం విదేశాల్లో షూటింగ్‌కు మక్కువ చూపిస్తున్నారు. గ్రాండియర్‌ కోసం అమెరికా, ఆస్ట్రేలియా, బొలీవియా, స్లోవేకియా, ప్రాన్స్‌, మొరాకో వంటి ప్రాంతాల్లో చిత్రీకరణ చేయడం వేరు.

Afghanistan: అప్పుడు నాగార్జున.. ఇప్పుడు సత్యదేవ్‌

సాహసంతో ఆఫ్ఘాన్‌లో షూటింగ్‌ చేసిన భారతీయ చిత్రాలు

అప్పుడు ‘ఖుదా గవాహ్‌’ కోసం నాగార్జున

ఇప్పుడు హబీబ్‌’ కోసం సత్యదేవ్‌

కొన్నేళ్ల క్రితం సినిమా షూటింగ్‌ అంటే దేశం దాటి వెళ్లిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. సినిమాల స్పాన్‌ పెరిగే కొద్దీ గ్రాండియర్‌ కోసం విదేశాల్లో షూటింగ్‌కు మక్కువ చూపిస్తున్నారు. గ్రాండియర్‌ కోసం అమెరికా, ఆస్ట్రేలియా, బొలీవియా, స్లోవేకియా, ప్రాన్స్‌, మొరాకో వంటి ప్రాంతాల్లో చిత్రీకరణ చేయడం వేరు. తాలిబన్ల నివాసానికి అడ్డా అయిన ఆఫ్ఘనిస్తాన్‌లో చిత్రీకరణ చేయడం వేరు. అయితే ఆఫ్ఘాన్‌లో చిత్రీకరణ చేసే చిత్రాలు అరుదనే చెప్పాలి. అక్కడ సినిమా షూటింగ్‌ చేసే ఽసాహసం అంత త్వరగా ఎవరూ చేయరు. కథకు ఆ లొకేషన్‌ తప్పనిసరి అంటేనే మేకర్స్‌ అనుమతులతో ఆ సాహసం చేస్తారు. అలా భారతదేశంలో తెరకెక్కిన కొన్ని చిత్రాలు ఆఫ్ఘాన్‌లో చిత్రీకరణ చేశారు. అ విశేషాలు...



టోర్బాజ్‌(2020) 

సంజయ్‌ దత్‌, నర్గీస్‌ ఫక్రీ కీలక పాత్రధారులుగా తెరకెక్కిన ‘టోర్బాజ్‌’ చిత్రీకరణ 2017లో మొదలైంది. దాదాపు ఈ చిత్రం షూటింగ్‌ ఆఫ్ఘానిస్థాన్‌లో జరిగింది. ఈ దేశంలోని  ఛైల్డ్‌ సూసైడ్‌ బాంబర్స్‌ ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రమిది. మూడేళ్ల పాటు చిత్రీకరణ సాగిన ఈ సినిమా గత ఏడాది నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా విడుదలైంది. అలాగే ఆస్ర్టేలియా, పర్షియన్‌, రష్యన్‌ సినిమాలు కూడా ఆఫ్ఘాన్‌లో షూటింగ్‌ చేసుకున్న సందర్భాలున్నాయి. 


ఆఫ్ఘాన్‌ షూట్‌ చేసొచ్చిన రెండో తెలుగు హీరో...

తెలుగు హీరో సత్యదేవ్‌ నటించిన హిందీ చిత్రం ‘హబీబ్‌’. ‘‘కొంత మంది చిన్నపిల్లలను ఇండియా నుంచి సరిహద్దు దాటించి పాకిస్థాన్‌ తీసుకెళ్లి ఉగ్రవాద చర్యలు చేయడానికి శిక్షణ ఇప్పిస్తుంటారు. పలు ఉగ్రవాద చర్యలను చేయడానికి పాకిస్థాన్‌ నుంచి ఆ పిల్లలను అఫ్ఘనిస్థాన్‌కు పంపుతారు. అలా  ఉగ్రవాదుల చేతుల్లో చిక్కుకున్న తన కొడుకుని వెతుక్కుంటూ అఫ్ఘనిస్థాన్‌కు వెళ్లే ఇండియన్‌ ఆర్మీ ఆఫసర్‌ కథే ‘హబీబ్‌’. ఆఫ్ఘనిస్థాన్‌ సైన్యం, మరికొంత మంది అక్కడి సాధారణ ప్రజల సహకారంతో ఆర్మీ ఆఫీసర్‌ తన కొడుకుతో పాటు అక్కడున్న ఇతర పిల్లల ఆచూకీని కనిపెడతాడు. ఆ ఉగ్ర చెర నుంచి ఆ పిల్లల ప్రాణాలను కాపాడే ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రం 40రోజులపాటు ఆఫ్ఘాన్‌, కాబూలి ప్రాంతాల్లో చిత్రీకరించారు.  దీని గురించి హీరో సత్యదేవ్‌ మాట్లాడుతూ ‘‘50 మంది క్రూ ఆఫ్ఘాన్‌ వెళ్లాం. 40రోజులు షూట్‌ చేశాం. మొదటిరోజు అనుమతి లేకుండా షూటింగ్‌ చేస్తుంటే అక్కడివాళ్లు పాయింట్‌ బ్లాక్‌లో గన్‌ పెట్టారు. ఆ తర్వాత ఆప్ఘన్‌ జనాలు నాకెంతో సహకరించారు. ఆ అనుభవాల్ని ‘కాబూల్‌ డైరీస్‌’ పేరుతో సినిమా చేయాలనుంది. హీరోగా నువ్వేం చేశాం అంటే ‘ఆఫ్ఘానిస్థాన్‌లో సినిమా షూటింగ్‌ చేశా’ అని గొప్పగా చెప్పుకొంటా. నాకు తెలిసి తెలుగు హీరోల్లో నేను ఆ సాహసం చేశాననకుంటా’’ అని అన్నారు. 



‘ఎస్కేప్‌ ఫ్రమ్‌ తాలిబన్‌’ (2003)

ఓ బెంగాలీ యువతి, ఆఫ్ఘాన్‌ వ్యాపారవేత్తతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని ఓ ఐదేళ్లు అక్కడే ఉండి, ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయి వచ్చిన నేపథ్యంలో సాగే కథ ఇది. మనీషా కోయిరాలా, నవాబ్‌షా నటించిన ఈ చిత్రం 2003లో విడుదలైంది. ఈ సినిమాను ఎక్కువ శాతం ఆఫ్ఘానిస్థాన్‌ పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించారు. 

కాబూల్‌ ఎక్స్‌ప్రెస్‌ (2006)

జాన్‌ అబ్రహాం కథానాయకుడిగా కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘కాబూల్‌ ఎక్స్‌ప్రెస్‌ (2006)లో విడుదలైన ఈ చిత్రంలో కొదరు పాకిస్థాన్‌, ఆఫ్ఘానిస్థాన్‌ నటులు నటించారు. ఆఫ్ఘానిస్థాన్‌లో ఉన్న దర్శకుడి స్నేహితుడు రాజన్‌ కపూర్‌ అనుభవాల ఆధారంగా తెరకెక్కింది. ఇందులో పలు సన్నివేశాలను ఆఫ్ఘాన్‌లో చిత్రీకరించారు. 


‘ధర్మాత్మ’(1975). 

తొలిసారి ఆఫ్ఘాన్‌ గడ్డపై చిత్రీకరణ జరుపుకొన్న చిత్రం ‘ధర్మాత్మ’(1975). ఫిరోజ్‌ఖాన్‌ స్వీయ దర్శకత్వంలో హేమమాలిని, రేఖా కథానాయికలుగా నటించిన థ్రిల్లర్‌ చిత్రమిది. అప్పట్లోనే సాహసం చేసి ఆఫ్ఘాన్‌లో చిత్రీకరణ చేశారు. 

‘ఖుదా గవాహ్‌’(1992)

అమితాబ్‌ బచ్చన్‌, శ్రీదేవి, నాగార్జున అక్కినేని కీలక పాత్రదారులుగా నటించిన ‘ఖుదా గవాహ్‌’ చిత్రం ఆఫ్ఘాన్‌లో చిత్రీకరించిన మరో సినిమా. ఆఫ్ఘాన్‌ సరిహద్దు గ్రామాల్లో నివశించే ప్రజల నేపథ్యంలో సాగే చిత్రమిది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆఫ్ఘానిస్థాన్‌ షూటింగ్‌లో పాల్గొన్న నటుడు అక్కినేని నాగార్జున. 

Updated Date - 2021-08-17T00:58:21+05:30 IST