కరోనా అనంతరం చిత్ర పరిశ్రమ కష్టాలను ఎదుర్కొంటుంది. లాక్డౌన్ కాలంలో ప్రజలందరు ఓటీటీ(OTT)లకు అలవాటు పడ్డారు. కథ, విజువల్స్‌కు ప్రాధాన్యం ఉంటే తప్ప థియేటర్‌కు రావడానికీ ఇష్టపడటం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా ఒడుదొడుకులను ఎదుర్కొంటుంది. గత రెండు నెలలుగా ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. నిర్మాతలు ప్రమోషన్స్‌ని ఏ స్థాయిలో చేసినా సరే ప్రేక్షకుల్ని సినిమా హాళ్లకు రప్పించలేక పోతున్నారు. ఇండస్ట్రీని కాపాడుకోవాలని యాక్టివ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆగస్టు 1నుంచి షూటింగ్స్ ఆపేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్క తెలుగు చిత్ర పరిశ్రమ అని మాత్రమే కాకుండా అన్ని ఇండస్ట్రీల పరిస్థితి ఇలానే ఉంది.
మలయాళ చిత్ర పరిశ్రమ పూర్తిగా కథలను నమ్ముకునే సినిమాలు చేస్తుంది. ఆ ఇండస్ట్రీ మొత్తం ఓటీటీల పైనే ఆధారపడి మనుగడ కొనసాగిస్తుంది. ఈ ఏడాది మాలీవుడ్‌లో 126 సినిమాలు విడుదల అయితే అందులో బాక్సాఫీస్ దగ్గర హిట్ అయిదు మాత్రమే హిట్ అయ్యాయి. ‘హృదయం’ (Hridayam), ‘భీష్మ పర్వం’ (Bheeshma Parvam), ‘జనగణమన’ (Jana Gana Mana), ‘కడువా’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచాయి. మిగిలిన సినిమాల్లో చాలా వరకూ మంచి పేరు తెచ్చుకున్నా అవి ఓటీటీ రిలీజ్‌లకి మాత్రమే పరిమితమయ్యాయి. ఈ ఏడాదిలో శాండల్ వుడ్ నుంచి 51 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ‘కెజిఎఫ్:2’ (KGF-2), ‘జేమ్స్’, ‘చార్లి- 777’ ఈ మూడు సినిమాలే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి బయట వాళ్లకి తెలిసేలా చేశాయి. కానీ, మిగిలిన సినిమాల మార్కెట్ అండ్ బిజినెస్ అంతంత మాత్రంగానే ఉంది. కోలీవుడ్‌లో పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. ‘విక్రం’, ‘ఈటీ’, ‘డాన్’ కమర్షియల్‌గా సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా ‘విక్రం’ కోలీవుడ్ మార్కెట్ స్థాయిని పూర్తిగా మార్చేసింది. ఇకపై కోలీవుడ్ నుంచి వచ్చే సినిమాలు కాస్త బెటర్ రెవిన్యూనే రాబట్టే ఛాన్స్ ఉంది. ఇక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే గుర్తొచ్చే బాలివుడ్ పరిస్థితి దాదాపుగా టాలీవుడ్ లాగానే ఉంది. స్టార్ హీరోల సినిమాలు కూడా రిలీజ్ అయినా మొదటి రోజే బాక్సాపీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ‘ది కశ్మీర్ ఫైల్స్’, ‘భూల్ బులయ్యా- 2’, ‘గంగుబాయ్ కతియావాడి’ మాత్రమే బ్రేక్ ఈవెన్ అయ్యాయి. బాలీవుడ్లో ఇప్పటి వరకూ 48 సినిమాలు రిలీజ్ అయితే, ఒక్క సినిమా మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇండియాలో ఉన్న ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీ మనుగడ ప్రశ్నార్థకంగానే ఉంది. కానీ, ఏ చిత్ర పరిశ్రమ కూడా సినిమాల షూటింగ్స్ని ఆపేయాలని నిర్ణయాలు తీసుకోలేదు. మరి ఈ పరిణామం తెలుగు సినిమాని గడ్డు కాలంలోకి తీసుకొని వెళ్తుందో లేదా మళ్లీ గోల్డెన్ డేస్‌లోకి తీసుకోని వెళ్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.