ఆకట్టుకునే అక్షయ గీతం

వరుస చిత్రాలతో విరామం లేకుండా పనిచేసే హీరోల్లో అక్షయ్‌కుమార్‌ ఒకరు. సినిమాలతో బిజీగా ఉన్నా కొత్త ప్రయోగాలతో అభిమానులను అలరించడం అక్షయ్‌కు అలవాటు. ఆయన నటించిన వీడియో సాంగ్‌ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 2019లో ‘ఫిల్హాల్‌’ (ప్రస్తుతానికి...) అనే హిందీ మ్యూజిక్‌ వీడియోలో ఆయన నటించారు. కృతీసనన్‌ సోదరి నుపూర్‌ సనన్‌ అక్షయ్‌కు జోడీగా కనిపించి ఆకట్టుకున్నారు. అప్పట్లో ఆ పాట ఘన విజయం సాధించింది. దానికి కొనసాగింపుగా మేకర్స్‌ ‘ఫిల్‌హాల్‌ 2’ వీడియో సాంగ్‌ను రూపొందిస్తున్నారు. ఈ నెల 30న ఈ పాట టీజర్‌ విడుదల చేస్తున్నట్లు గురువారం అక్షయ్‌కుమార్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. సాంగ్‌ పోస్టర్‌ను ఆవిష్కరించిన అక్షయ్‌ ‘‘వేదన కొనసాగుతుంది.. ‘ఫిల్హాల్‌’ మీ మనసును తాకితే ‘ఫిల్హాల్‌ 2’ మీ హృదయాన్ని తాకుతుంది’’ అనే వ్యాఖ్యను జోడించారు. నుపూర్‌సనన్‌ బండిపైన కూర్చొని అక్షయ్‌ను గాఢంగా హత్తుకొని కూర్చున్న దృశ్యం ఆకట్టుకునేలా ఉంది. అరవింద్ర ఖైరా దర్శకత్వంలో రూపొందిన ఈ పాటను బి. ప్రాక్‌ ఆలపించారు. జానీ సంగీతం సమకూర్చారు.

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.