నేను డైరెక్టర్‌ని కాదు... మీడియేటర్‌ని!

ABN , First Publish Date - 2022-06-28T05:45:41+05:30 IST

చిన్న సినిమాలతో పెద్ద స్థాయికి ఎదిగిన దర్శకుడు మారుతి. ఆయన కెరీర్‌లో ‘భలే భలే మగాడివోయ్‌’, ‘మహానుభావుడు’, ‘ప్రతిరోజూ పండగే’ లాంటి సూపర్‌ హిట్లు ఉన్నాయి...

నేను డైరెక్టర్‌ని కాదు... మీడియేటర్‌ని!

చిన్న సినిమాలతో పెద్ద స్థాయికి ఎదిగిన దర్శకుడు మారుతి. ఆయన కెరీర్‌లో ‘భలే భలే మగాడివోయ్‌’, ‘మహానుభావుడు’, ‘ప్రతిరోజూ పండగే’ లాంటి సూపర్‌ హిట్లు ఉన్నాయి. త్వరలోనే ప్రభా్‌సతో ఓ సినిమా చేయబోతున్నారు. చిరంజీవి కోసం ఆయనో కథ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్‌’ రూపొందించారు. జులై 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మారుతి ఏమంటారంటే..?!


మీతో ఓ సినిమా చేస్తున్నానని ‘పక్కా కమర్షియల్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో చిరంజీవి చెప్పేశారు. ఆ సినిమా ఎలా ఉండబోతోంది?

నేను ఏ సినిమా చేసినా ప్రేక్షకుడిగానే ఆలోచిస్తా. నా దృష్టిలో నేను డైరెక్టర్‌ని కాదు. మీడియేటర్‌ని. ప్రేక్షకులకు ఏం కావాలో అది ఇస్తా. నిర్మాతలకు, ప్రేక్షకులకూ మధ్య సంధాన కర్తగా ఉంటాను. చిరంజీవిగారు ఎలాంటి కథైనా, ఎలాంటి పాత్రయినా చేయగలరు. కానీ నా బలాలేమిటి? నేను ఆయన్ని ఎలా చూడాలనుకొంటున్నాను? అనేది ముఖ్యం. దాన్ని బట్టే ఆ సినిమా ఉంటుంది. చిరంజీవిగారికి సరిపడా కొన్ని లైన్లు నా దగ్గర ఉన్నాయి. వాటి గురించి ఆయనతో కూడా మాట్లాడాను. పూర్తి స్థాయిలో కథ సిద్ధం చేయాలి. చిరంజీవిగారి లాంటి వ్యక్తి నాతో పనిచేస్తా అని చెప్పడం నాకు గొప్ప ఎనర్జీ ఇచ్చింది.


చాలా తక్కువ రోజుల్లో, నాణ్యమైన చిత్రాల్ని అందిస్తారన్న పేరు తెచ్చుకొన్నారు. ఈ టెక్నిక్‌ ఎలా పట్టుకోగలిగారు?

ఓ మంచి ప్రేక్షకుడు మంచి దర్శకుడు అవ్వగలడు. సినిమాలో ఏ సీన్‌కి బాగా ఎంజాయ్‌ చేస్తారు? దేనికి లేచి వెళ్లిపోతారు? అనే విషయంలో జడ్జిమెంట్‌ చాలా ముఖ్యం. మనం మనతో నిజాయితీగా ఉంటే.. స్ర్కిప్టు రాసేటప్పుడే దాని మంచి చెడ్డలు తెలిసిపోతాయి. ‘రాసిందంతా తీసేసి, చివర్లో ఎడిటింగ్‌ టేబుల్‌ దగ్గర చూద్దాంలే..’ అనుకోను. అలా చేస్తే డబ్బు, సమయం రెండూ వృథా అవుతాయి. ఈ రోజుల్లో దర్శకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. థియేటర్‌ వ్యవస్థని కాపాడుకోవాలి. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాలి. ఒకవేళ ఓటీటీ కోసం సినిమా తీస్తే.. వాళ్లను బుల్లితెర నుంచి చూపు మరల్చలేని కంటెంట్‌ ఇవ్వాలి. 


‘పక్కా కమర్షియల్‌’ ఎలాంటి సినిమా?

పేరుకి తగ్గట్టే ఉంటుంది. పక్కా పైసా వసూల్‌ సినిమా. గోపీచంద్‌ని మళ్లీ ఫామ్‌లోకి తీసుకొచ్చే సినిమా ఇది. ‘పక్కా కమర్షియల్‌’ అనే పేరు పెట్టడం వల్ల చాలా సౌలభ్యం ఉంది. క్రియేటీవ్‌ ఫ్రీడమ్‌ తీసుకొనే అవకాశం దొరికింది. సినిమా కాస్త రెగ్యులర్‌గా ఉన్నా.. ‘ఇది పక్కా కమర్షియల్‌ సినిమా రా’ అంటుంటారు. వాళ్లకు ఆ అవకాశం ఇవ్వకుండా ముందు మాకు మేమే ‘ఇది పక్కా కమర్షియల్‌ సినిమా’ అనేసుకొన్నాం.


‘ప్రతిరోజూ పండగే’ టీమ్‌లోని వాళ్లే ఇందులోనూ కనిపిస్తున్నారు?

రావు రమేశ్‌, సత్యరాజ్‌ గొప్ప నటులు. వాళ్లకు ప్రత్యామ్నాయం వెతకాలని నాకు అనిపించలేదు. ‘నీకు ఎంత వీలైనంత అంత.. మన తెలుగు నటీనటులకు అవకాశం ఇవ్వు’ అని బన్నీ నాకు చెబుతుంటాడు. నేను దాన్ని ఫాలో అవుతుంటాను. మనదైన నటులు ఉన్నప్పుడే మన భాష, యాస మరింతగా వెలుగులోకి వస్తాయి.


మీరు కూడా మీ సినిమా రేట్లని బాగా తగ్గించినట్టు ఉన్నారు?

ఏ సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలి అనే విషయంలో ప్రేక్షకులకు ఓ అవగాహన ఉంది. అంతకంటే ఎక్కువ ఉంటే థియేటర్లకు రావడం లేదు. అందుకే మా సినిమా రేట్లు కూడా తగ్గించాం. 


ప్రభా్‌సతో సినిమా ఎప్పుడు? ఎలా ఉండబోతోంది?

ప్రభా్‌సతో సినిమా తప్పకుండా ఉంటుంది. దానిపై కొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుంది. ఈలోగానే ఈ సినిమా జానర్‌పై, కథపై, టైటిల్‌ పై రకరకాల ఊహాగానాలు వచ్చేస్తున్నాయి. చూస్తుంటే... వాళ్లే సినిమా తీసేసి.. దర్శకుడిగా నా పేరు వేసేలా ఉన్నారు (నవ్వుతూ).

Updated Date - 2022-06-28T05:45:41+05:30 IST