నేను రెండు జోన్స్‌లో ఉంటా: రామ్

ABN , First Publish Date - 2021-01-10T05:53:04+05:30 IST

హీరోగా 15 ఏళ్లు కొనసాగడం అంత సులభమైన విషయమేమి కాదు. అందులోనూ విలక్షణమైన చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకులను మెప్పించడం మరింత

నేను రెండు జోన్స్‌లో ఉంటా: రామ్

హీరోగా 15 ఏళ్లు కొనసాగడం అంత సులభమైన విషయమేమి కాదు. అందులోనూ విలక్షణమైన చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకులను మెప్పించడం మరింత కష్టం. దేవదాసు సినిమాతో రామ్‌ పోతినేని సినీ ప్రయాణం మొదలై రేపటికి 15 ఏళ్లు.  ఆయన నటించిన తాజా చిత్రం రెడ్‌ కూడా విడుదలకు రెడీగా ఉంది. ఈ సందర్భంగా రామ్‌ను నవ్య పలకరించింది. ఆ విశేషాలలోకి వెళ్తే..


మీరు తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సమయంలో మీ అనుభవాలేమిటి?

నేను చాలా చిన్న వయస్సులో సినీ రంగంలోకి వచ్చా. దేవదాసు ప్రారంభమయ్యేనాటికి నా వయస్సు 15 ఏళ్లు. ఆ సినిమా పెద్ద హిట్‌. ఆ తర్వాతి సినిమా అంత హిట్‌ కాలేదు. ఆ తర్వాత వచ్చిన రెఢీ మళ్లీ పెద్ద హిట్‌. సినిమా హిట్‌ అయినప్పుడు గొప్ప జోష్‌ ఉండేది. సినిమా ఆశించనంత హిట్‌ కాకపోతే- వాతావరణమంతా స్తబ్దుగా అయిపోయేది. టీనేజ్‌ కాబట్టి- ఏం జరుగుతోందో అర్థమయ్యేది కాదు.

క్రమేపీ సినీ రంగం ఎలా వర్క్‌ చేస్తుందో తెలిసింది. చిన్నప్పటి నుంచి నాకు తెలిసినవి రెండే రెండు. ఒకటి సినిమా. రెండు నా ఫ్యామిలీ. సినిమా అంటే ఉన్న క్రేజ్‌ అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉంది. కుటుంబానికి నేను ఇచ్చే ప్రాధాన్యంలో కూడా ఏ మాత్రం మార్పు లేదు. 


కొవిడ్‌ అందరి జీవితాల్లోను అనేక మార్పులు తీసుకువచ్చింది.. మీపై కోవిడ్‌ ప్రభావం ఎలా ఉంది?

మా ఫ్రెండ్స్‌కు కొవిడ్‌ వచ్చింది. తగ్గింది. అదృష్టవశాత్తు నాకింకా రాలేదు. ఏడాది నుంచి బంధువులు, స్నేహితులు అందరి మధ్య ఇదే చర్చ. కొవిడ్‌ అందరిలోనూ ఒక విధమైన అనిశ్చితిని కలగజేసింది. ఎవరికి వస్తుందో తెలియదు.. ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఎలా తగ్గుతుందో తెలియదు. ఈ తరహా అనిశ్చితి వల్ల అందరిలోను ఆందోళన పెరిగింది. ఇక నా విషయానికి వస్తే- నా జీవితంలో పెద్ద మార్పు రాలేదు.


వాస్తవానికి ఉంటే షూటింగ్‌లో ఉంటా.. లేకపోతే ఇల్లు.. వెళ్తే వేకేషన్‌. నాకు వేరే వ్యాపకాలేమి లేవు. బయటకు వెళ్లకుండా ఉండటం నాకు కొత్త కాదు. నా వృత్తి జీవితంలో ఏడాది గ్యాప్‌ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అప్పుడు మనకిష్టమై బ్రేక్‌ తీసుకున్నాం. ఇప్పుడు తప్పనిసరై బ్రేక్‌ తీసుకోవాల్సి వచ్చింది. అంతే తేడా! 


వ్యాపకాలేమి లేవంటున్నారు.. లైఫ్‌ బోర్‌ కొట్టదా?

నేను సాధారణంగా రెండు జోన్స్‌లో ఉంటా. షూటింగ్‌ చేసేటప్పుడు వేరే విషయాలేమి పట్టించుకోను. పాత్రలో నిమగ్నమయిపోతా! షూటింగ్‌ లేనప్పుడు ఇంట్లో ఉంటా. పార్టీలకు వెళ్లను. కలిస్తే స్నేహితులను కలుస్తా. నా బెస్ట్‌ఫ్రెండ్‌తో వరసగా నాలుగు నెలలు మాట్లాడని సందర్భాలు కూడా ఉన్నాయి. మళ్లీ కలిసినప్పుడు అంతా మామూలే. ఇలా నేను నా జోన్‌లో ఉన్నప్పుడు బోర్‌ కొట్టదు. వీటితో పాటు- నాకు ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టం. చాలా సార్లు ఒంటరిగా విదేశాలు వెళ్తూ ఉంటా.

ఎక్కడికైనా వెళ్లాలని బలంగా అనిపించినప్పుడు వెళ్లిపోతానంతే! ఎయిర్‌పోర్టుకు వెళ్తూ టిక్కెట్లు కొనుక్కున్న సందర్భాలు అనేకం. ఇలా యూరప్‌లో అనేక దేశాలు తిరిగా. ఏ దేశమైనా వెళ్తే అక్కడ కొద్ది కాలం ఉంటా. ఆ ప్రాంతంలో సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకుంటా! 


ఇలా చెప్పాచేయకుండా హఠాత్తుగా వెళ్లిపోతుంటే ఇంట్లో వాళ్లు కంగారు పడరా..?

ఒకప్పుడు కంగారు పడేవారు. ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఒకసారి మా అమ్మ నేను రూమ్‌లో ఉన్నాననుకుంది. ఒక రోజు అయిపోయింది. ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వస్తోంది. దీంతో చాలా కంగారు పడింది. మా అన్నయ్యను అడిగితే- నేను వేరే దేశం వెళ్లానని చెప్పాడు. వచ్చిన తర్వాత పెద్ద క్లాస్‌.. ఆ తర్వాత నుంచి ఎక్కడికి వెళ్లినా మా అన్నయ్యకు తప్పనిసరిగా చెప్పి వెళ్తా! 


మీరు ఇప్పటి దాకా చేసిన సినిమాల్లో ఇష్టమైన క్యారెక్టర్‌ ఏమిటి?

అన్నీ మంచి క్యారెక్టర్లే.. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కథలో, డైరక్టర్‌లో క్లారిటీ ఉంటే ఎలాంటి పాత్ర అయినా అద్భుతంగా పండుతుంది. ఈ క్లారిటీలో తేడా వస్తే సినిమా అంత బాగా రాదు. సాధారణంగా నేను ఒక క్యారెక్టర్‌ చేస్తుంటే- దానికి సంబంధించిన అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తా! ఉదాహరణకు ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా తీసుకుందాం. దాంట్లో హీరో జీవితానికి.. నిజజీవితంలో నా జీవితానికి ఏ మాత్రం సంబంధం లేదు. నేను తెలంగాణ యాసలో మాట్లాడను. రఫ్‌గా ఉండను. యాగ్రిసివ్‌గా ఉండను.


అయితే పూరీగారితో ఈ క్యారెక్టర్‌ గురించి అనేక సార్లు మాట్లాడా! ఆ పాత్ర ఎలా ప్రవర్తిస్తుందో అనుక్షణం ఆలోచిస్తూ ఉండేవాడిని. మనం పాత్రలో జీవించటం మొదలుపెడితే- బాడీలాంగ్వేజ్‌.. మనం చూసే విధానం.. మన వ్యక్తిత్వం- వాటంతట అవే మారిపోతాయి. ఇక ఇప్పటి దాకా నేను చేసిన వాటిలో రెడ్‌లో చేసిన డబుల్‌ రోల్‌ ఒక ఛాలెంజ్‌ అని చెప్పాలి. నేను డబుల్‌ రోల్‌ చేయటం ఇదే మొదటిసారి.  సాధారణంగా డబుల్‌రోల్‌ అంటే- రెండు పాత్రలు వేర్వేరు మేకప్‌లతో.. వ్యక్తిత్వాలతో ఉన్నట్లు చూపిస్తారు. కానీ ఇందులో అలా ఉండదు. ఇద్దరూ చూడటానికి ఒకేలా ఉంటారు. కానీ వారి ప్రవర్తనలో తేడా ఉంటుంది. ఈ రెండు పాత్రలు ప్రేక్షకులకు తప్పనిసరిగా నచ్చుతాయనుకుంటున్నా!


మీరు వైవిధ్యమైన చిత్రాలు అనేకం చేశారు కదా.. వాటిలో అత్యంత కష్టమైనవి ఏవి?

కామెడీ, కుటుంబ కథా చిత్రాలు చేయటం   సులభమే! కానీ కమర్షియల్‌ సినిమాలు చేయటం చాలా కష్టం. ఎందుకంటే మొత్తం సినిమాను హీరో తన భుజాలపై వేసుకొని నడిపించాలి. ఒక సీన్‌లో ఫైటర్‌, మరో సీన్‌లో కమేడియన్‌, ఇంకొక సీన్‌లో డ్యాన్సర్‌ అవ్వాలి. ఇలా రకరకాల పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. అందువల్ల నా దృష్టిలో కమర్షియల్‌ సినిమాలు చేయటం చాలా కష్టం. 


మీరు చేసిన సినిమాలు హిందీలోకి డబ్బింగ్‌ అయ్యాయి.. ఉత్తరాదిన మీకు మంచి క్రేజ్‌ ఉంది. మరి మీ బాలీవుడ్‌ ఎంట్రీ ఎప్పుడు..

మొదట్లో నాకు డబ్బింగ్‌ సినిమాలకు ఉన్న ప్రాధాన్యం అర్థమయ్యేది కాదు. ఎప్పుడైనా ముంబయి వెళ్తే అక్కడ నన్ను గుర్తుపట్టి- రకరకాల హిందీ సినిమా పేర్లు చెప్పేవారు. అవి డబ్బింగ్‌ సినిమా పేర్లని అర్థమయ్యేవి అంతే! యూట్యూబ్‌లో చూస్తే డబ్బింగ్‌ సినిమాలకు లక్షల్లో వ్యూస్‌ ఉండేవి. ఇలా మరచిపోలేని సంఘటన దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో జరిగింది. ఇస్మార్ట్‌ శంకర్‌ విడుదలయిన తర్వాత దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో డ్యూటీ ఫ్రీ షాపులో షాపింగ్‌ చేస్తున్నా. దాంట్లో పాట వినిపిస్తోంది. ఎవరైనా రింగ్‌ టోన్‌ పెట్టుకున్నారేమో అనుకున్నా.


పాట వాల్యూం బాగా పెరిగింది. ఎందుకు పెరిగిందో అర్థం కాక వెనక్కి తిరిగి చూస్తే- డ్యూటీ ఫ్రీ షాపులో ఉన్న ఉద్యోగులందరూ నావైపే చూస్తున్నారు. నా దృష్టిని ఆకర్షించటానికి వాల్యూం పెంచారట! వారందరూ ఈస్మార్ట్‌ శంకర్‌ చూశారట. నాతో  ఫోటోలు దిగారు. వాళ్లలో మన దేశం వాళ్లేవరూ లేరు. దుబాయ్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌.. ఇలా ఇతర దేశాలకు చెందినవారే. ఈ సంఘటన తర్వాత డబ్బింగ్‌ చిత్రాలకున్న శక్తి అర్థమయింది. ఇక బాలీవుడ్‌ విషయానికి వస్తే- రెఢీ తర్వాత కొన్ని ఆఫర్స్‌ వచ్చాయి. మంచి కథ దొరికినప్పుడు తప్పనిసరిగా చేస్తా. ప్రస్తుతమయితే బాలీవుడ్‌ ప్రపోజల్స్‌ ఏమి లేవు!


నేను సింగిల్‌

పెళ్లి సమయం వచ్చినప్పుడు జరుగుతుంది. ఎప్పుడు చేసుకోవాలనే విషయంపై నాకు కచ్చితమైన అభిప్రాయాలేమి లేవు.. ఇంట్లో పెళ్లి చేసుకొమ్మని అడిగారంతే! వాళ్లకు నా తత్వం తెలుసుకాబట్టి ఒత్తిడి చేయటం లేదు.. ప్రస్తుతం నేను సింగిల్‌..




ఇల్లు.. షూటింగ్‌.. హైదరాబాద్‌లో ఈ రెండే నాకు తెలుసు.  అమ్మతో చాలా సన్నిహితంగా ఉంటా.. అన్నీ షేర్‌ చేసుకుంటా! సాధారణంగా నేను బయట పార్టీలకు వెళ్లను. నాకు రెండో తరగతిలో ఉన్న స్నేహితులే ఇప్పటికీ కొనసాగుతున్నారు. రితేష్‌ దేశ్‌ముఖ్‌, జెలీనియాలు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌. ముంబయికి వెళ్లినప్పుడు వాళ్లను కలుస్తా. వాళ్లు హైదరాబాద్‌ వస్తే మా ఇంటికి వస్తారు.  


నేను ఏ విషయానికి ఎక్కువగా ఎమోషనల్‌ అవ్వను. షూటింగ్‌ చేస్తుంటే దాని మీదే ఫోకస్‌ పెడతా! ఎక్కడికైనా వెకేషన్‌కు వెళ్తే ఇతర విషయాలు పట్టించుకోను. చాలా కూల్‌గా ఉంటా. ఒక సారి యూరప్‌ ట్రిప్‌లో నా పర్సు, పాస్‌పోర్టు, దుస్తులు అన్నీ ఉన్న బ్యాగ్‌ ట్యాక్సీలో మర్చిపోయా! చేతిలో నయా పైసా లేదు. మా స్నేహితులందరూ విపరీతంగా కంగారు పడ్డారు.  అయినా నేను కూల్‌గానే ఉన్నా.


నటన నన్ను చాలా ఎక్సైట్‌ చేస్తుంది. నటన కాకుండా ఇతర దేశాల సమాజాలు, సంస్కృతుల గురించి తెలుసుకోవటం చాలా ఇష్టం. అక్కడికి వెళ్లినప్పుడు అక్కడ స్థానికంగా దొరికే ఆహారం తింటా. వాళ్లతోనే ఉంటా. ఒక దశలో యూరప్‌లో బరిస్టాలో కాఫీ మేకింగ్‌ కోర్సులో చేరా. కాఫీ చేయటం నేర్చుకున్నా. ఇలా రకరకాల ప్రయోగాలు చేయటం నాకిష్టం. 


జిమ్‌ చేయటమంటే నాకు బోరు. కానీ కొన్ని సినిమాల కోసం చేయాల్సి వస్తుంది. అప్పుడు విపరీతంగా చేస్తా. ఇస్మార్ట్‌ శంకర్‌లో హీరో చాలా బండగా, బలంగా ఉంటాడు. అలాంటి శరీరం కోసం రోజుకు నాలుగైదు గంటలు జిమ్‌ చేసేవాడిని. 


ఓటీటీ వచ్చి ప్రేక్షకుల అభిరుచులను మార్చేసిందనే వాదన నేను వింటున్నా. తమిళం, మలయాళం, బెంగాలీ.. ఇలా ఒక్కొక్కరిది ఒకో పద్ధతి. ఆ సినిమాలు బాగున్నాయి.. తెలుగు సినిమాలు బాగాలేవనే వాదనను నేను అంగీకరించను. తెలుగు  ప్రేక్షకులు ఈ తరహా సినిమాలే కోరుకుంటున్నారేమో? నా ఉద్దేశంలో- కొవిడ్‌ వల్ల ప్రేక్షకులు చిన్నతెరలపై సినిమాలు చూసి విసిగిపోయారు. వారు థియేటరికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోరుకుంటున్నారు.


 సివిఎల్‌ఎన్‌

ఫొటోలు: లవకుమార్‌


Updated Date - 2021-01-10T05:53:04+05:30 IST