‘ఇదే మా కథ’ మూవీ రివ్యూ

చిత్రం: ‘ఇదే మా కథ’

విడుదల తేదీ: 02, అక్టోబర్ 2021

స‌మ‌ర్ప‌ణ‌: శ్రీ‌మ‌తి మ‌నోర‌మ

బ్యాన‌ర్‌: గుర‌ప్ప ప‌ర‌మేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్

సంగీతం: సునీల్ కశ్యప్

ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ

సినిమాటోగ్రఫీ: సి. రామ్‌ప్రసాద్

నిర్మాత: జి. మహేష్

కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: గురు పవన్


ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి కలలు కనడం సహజమే. కానీ ఆ కలల గమ్యస్థానానికి చేరుకునేది కొందరే. విభిన్న నేపథ్యం ఉన్న నలుగురు వ్యక్తులు తమ కలల గమ్యస్థానం ఎలా చేరుకున్నారనే కథాంశంతో.. రోడ్ జర్నీ అడ్వెంచర్‌గా తెరకెక్కిన చిత్రమే ‘ఇదే మా కథ’. సుమంత్ అశ్విన్, తాన్య హోప్, శ్రీకాంత్, భూమికలు బైకులతో జర్నీకి వెళుతున్న పోస్టర్స్‌తోనే ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా భూమిక రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుపై కనిపించిన తీరు.. సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. అలాగే సుమంత్ అశ్విన్ అవతారం, శ్రీకాంత్ రఫ్ లుక్, తాన్య హోప్ గ్లామర్‌ వంటివే కాకుండా టాలీవుడ్‌లోనే ఈ తరహా చిత్రం ఫస్ట్ టైమ్ అని మేకర్స్ చెప్పడం, గత వారం రోజులుగా జరుగుతున్న ప్రమోషన్ కార్యక్రమాలు వంటివి ఈ సినిమాపై అంచనాలకి కారణమయ్యాయి. మిగతా వారి సంగతి ఎలా ఉన్నా.. హీరో సుమంత్‌ అశ్విన్‌కి ఈ చిత్రం చాలా ముఖ్యం. సరైన బ్రేక్ కోసం అతను ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడో తెలియంది కాదు. మొత్తంగా నలుగురు వ్యక్తుల కథగా, గాంధీ జయంతి సందర్భంగా నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా జర్నీ ఎలా సాగిందో మన రివ్యూలో తెలుసుకుందాం. 


కథ: 

అజయ్ (సుమంత్ అశ్విన్).. అజయ్-అడ్వెంచర్స్ యూట్యూబర్‌గా ప్రతీది రికార్డ్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటాడు. బైక్‌పై అడ్వంచర్స్ చేసి నేషనల్ ఛాంపియన్ అవ్వాలనే డ్రీమ్‌తో ఉండే అజయ్ లోకల్‌‌గా జరిగే ప్రతి పోటీలో ఓడిపోతుంటాడు. అజయ్‌‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తండ్రి (శ్రీకాంత్ అయ్యంగార్).. అతని ఓటములను తట్టుకోలేక అడ్వంచర్స్ మానుకుని బిజినెస్ లేదంటే బుద్దిగా చదువుకోమంటాడు. తండ్రి మాటను లెక్క చేయకుండా.. ల‌ద్దాఖ్‌లో జరిగే ఇంటర్నేషనల్ అడ్వంచర్ రేస్‌కి పయనమవుతాడు.


శ్రీకాంత్ (మహేంద్ర).. యంగ్ ఏజ్ నుండి రోడ్ జర్నీ‌ని ఇష్టపడే మహేంద్ర.. 25 సంవత్సరాల క్రితం చేసిన ఓ జర్నీలో లద్దాఖ్‌లో తులసి అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. కానీ వారి ప్రేమ ఫలించదు. 25 సంవత్సరాలుగా ఆమెను తలుచుకుంటూ అనారోగ్యానికి గురవుతాడు. ప్రేమలో విఫలమైన 25 సంవత్సరాల తర్వాత ఇంకా వారం, పది రోజులు మాత్రమే బ్రతుకుతాడనే స్టేజ్‌లో తన ప్రేయసిని కలిసేందుకు ల‌ద్దాఖ్‌ పయనమవుతాడు.


లక్ష్మీ (భూమిక).. మధ్యతరగతి గృహిణి అయిన లక్ష్మీ.. తన తండ్రి డ్రీమ్‌ని నెరవేర్చడం కోసం లద్దాఖ్‌లో జరిగే రాయల్ ఎన్‌ఫీల్డ్ యాన్యువల్ ఫంక్షన్‌కి అటెండ్ అవ్వాలనుకుంటుంది. కానీ కుటుంబ బాధ్యతలు ఆమెకు అడుగడుగునా అడ్డుపడుతుంటాయి. భర్త (సమీర్) అసలు అంగీకరించడు. కానీ తన కూతురు ప్రోత్సాహంతో.. కుటుంబాన్ని వదిలి తన తండ్రి కనిపెట్టిన హైబ్రీడ్ ఇంజన్-వీల్ లాక్ ఫార్ములాని ప్రజంట్ చేయడానికి లద్దాఖ్ పయనమవుతుంది.


మేఘన (తాన్య హోప్).. చంఢీఘర్‌కి చెందిన మేఘన.. హైదరాబాద్‌ వ్యక్తిని ప్రేమిస్తుంది. అతని కోసం తెలుగు కూడా నేర్చుకుంటుంది. కానీ అతను మేఘనని మోసం చేసి వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమవుతాడు. ఇది తెలుసుకున్న మేఘన హైదరాబాద్ వచ్చి.. అతనికి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది. అతనికి గుడ్ బై చెప్పేసి.. అతనికి గిఫ్ట్‌గా ఇచ్చిన బైక్ తీసుకుని చంఢీఘర్‌కి పయనమవుతుంది. ఆ పయనం కాస్తా లద్దాఖ్ వైపు దారి తీస్తుంది. 


సింపుల్‌గా చెప్పాలంటే ఇవే దర్శకుడు చెప్పాలనుకున్న నాలుగు కథలు. ఈ కథలతో మొదలైన జర్నీలో నలుగురు వ్యక్తులు ఎలా కలుసుకున్నారు? దారిలో ఎదురైన సమస్యలను ఎలా జయించారు? మహేంద్ర తన ప్రేయసిని చేరుకున్నాడా? లక్ష్మీ తన తండ్రి డ్రీమ్‌ని నెరవేర్చిందా? అజయ్-మేఘనల మధ్య ప్రేమ ఎలా మొదలైంది? ఇంటర్నేషనల్ రేసులో అజయ్ గెలిచాడా? ఒకరి సక్సెస్‌ను మరొకరు చూడాలనుకున్న వారి కోరిక నెరవేరిందా? వంటి ఆసక్తికర విషయాలకు సమాధానమే మిగతా కథ.

విశ్లేషణ:

నేటి యువత మైండ్ సెట్‌కి అద్దం పట్టేలా సుమంత్ అశ్విన్ పాత్రను దర్శకుడు డిజైన్ చేశాడు. ఈ పాత్రకు సుమంత్ అశ్విన్ నూరు శాతం న్యాయం చేశాడు. అతని ఎనర్జీ ఎక్కడా డ్రాప్ కాలేదు. నటనలోనూ సుమంత్ అశ్విన్ మెప్పిస్తాడు. రఫ్ అండ్ టఫ్ పాత్రలో తాన్య హోప్ నటన యూత్ ఆడియన్స్‌ని కట్టిపడేస్తుంది. సినిమాకి కావాల్సిన గ్లామర్ టచ్ ఇస్తూనే.. డేరింగ్ అండ్ డ్యాషింగ్ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. తాన్య హోప్‌కు ఈ చిత్రం హోప్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక శ్రీకాంత్, లక్ష్మీ పాత్రలు ఈ సినిమాకి ప్రాణం. మధ్యతరగతి గృహిణిగా, రైడర్‌గా, తండ్రి డ్రీమ్ తీర్చే కూతురిగా ఇలా భూమిక వైవిధ్యమైన నటనతో అలరించింది. మహేంద్రగా శ్రీకాంత్‌ని తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేనంతగా సీనియారిటి, సిన్సియారిటీని ప్రదర్శించాడు శ్రీకాంత్. గిరిగా సప్తగిరి కాసేపు నవ్వించాడు. పృథ్వీ పాత్రను కావాలని ఇరికించినట్లు ఉంది. సమీర్, సుబ్బరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, జబర్దస్త్ రామ్ ప్రసాద్ వంటి వారంతా వారి పాత్రల పరిధిమేర నటించారు.


సాంకేతికంగా ఈ సినిమాకి సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం, రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ హైలెట్ అని చెప్పుకోవచ్చు. పాటలు పర్లేదు.. అనిపించినా నేపథ్య సంగీతానికి సునీల్ కశ్యప్ ప్రాణం పెట్టేశాడు. ఇటువంటి జర్నీ, రేస్ మూమెంట్స్‌ని రామ్‌ప్రసాద్ కెమెరా చక్కగా బంధించింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉండాల్సింది. కొన్ని సీన్లు ఈ జర్నీకి అవసరం లేదనిపిస్తుంది. ప్రొడక్షన్ విలువలు పర్వాలేదనిపిస్తాయి. ఇక దర్శకుడికి ఇది తొలి చిత్రమే అయినా.. నాలుగు విభిన్నమైన కథల్ని రోడ్డు జర్నీ నేపథ్యంతో చెప్పాలనుకోవడం సాహసమే. ఈ సాహసంలో గురు పవన్ చాలా వరకు విజయం సాధించినట్లే. పాత్రలను పరిచయం చేసిన తీరు బాగున్నా.. ఆ తర్వాత కథనం నడిచిన తీరుకి ప్రేక్షకులు కనెక్ట్ అవ్వలేరు. ఇంటర్వెల్, తర్వాత వచ్చే కొన్ని సీన్లు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. తాన్య హోప్ పాత్రని లైట్‌గా తేల్చేశాడు దర్శకుడు. అన్నీ లద్దాఖ్‌కే లింక్ చేయడం కూడా అంత కరెక్ట్ అనిపించదు. అలాగే సుమంత్ అశ్విన్, తాన్యల మధ్య ప్రేమ కూడా కృత్రిమంగా అనిపిస్తుంది. ‘ప్రేమించుకునే వారికి మాత్రమే వయసుంటుంది.. ప్రేమకు కాదు’, ‘ఆశలకే అలసట.. డ్రీమ్స్‌కి కాదు’ వంటి డైలాగ్స్ బాగున్నాయి. ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కూడా భారత్ టూర్ చేస్తున్నట్లుగా అనేక రాష్ట్రాలను, ఆ రాష్ట్రాలలోని ముఖ్య ప్రాంతాలను చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. లక్ష్మీ, మహేంద్ర పాత్రలతో ఎమోషనల్‌గా కనెక్ట్ చేసిన దర్శకుడు.. అడ్వంచర్స్‌ విషయంలో మాత్రం రొటీన్‌గా వెళ్లిపోయాడు. ఫైనల్‌గా చెప్పాలంటే భారీగా ఊహించుకోకుండా వెళితే మాత్రం ప్రేక్షకుడు డిజప్పాయింట్ అవ్వడు. 


ట్యాగ్‌లైన్: మలుపులే.. మెరుపుల్లేవ్

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.