‘ఇప్పుడొస్తున్న సినిమాల్లో మహిళల పాత్రలు అన్నీ ఒకే మూసలో ఉండి విసుగు తెప్పిస్తున్నాయి. అమ్మ, అక్క, వదిన పాత్రలకు సొంత వ్యక్తిత్వం లేకపోవడం గౌరవప్రదంగా అనిపించలేదు. అందుకే చాలామంది అడిగినా ఇప్పటిదాకా తెలుగు సినిమా చేయలేదు’ అని పాతతరం హీరోయిన్, నటి అర్చన అన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె ‘చోర్ బజార్’ చిత్రంతో తెలుగు తెరపైకి మళ్లీ అడుగుపెడుతున్నారు. పూరి ఆకాష్, గెహనా సిప్పి జంటగా నటించిన ఈ చిత్రానికి జీవన్‌రెడ్డి దర్శకుడు. ఈ నెల 24న విడుదలవుతున్న సందర్భంగా ‘చోర్‌బజార్’లో కీలకపాత్ర పోషించిన అర్చన మీడియాతో ముచ్చటించారు.
ఇప్పటిదాకా నేను నటించిన చిత్రాలతో నాకంటూ ప్రేక్షకుల్లో ఓ గుర్తింపు, గౌరవం ఉంది. దాన్ని తగ్గించుకోవడం ఇష్టంలేకే ఆచితూచి సినిమాలు చేస్తున్నాను.
పాతికేళ్ల పాటు తెలుగు చిత్రాలు చేయకపోవడానికి ఎలాంటి కారణం లేదు. కథానాయికగా వైదొలిగాక సహాయ పాత్రలకు చాలా మంది అడిగారు. కానీ స్ర్కిప్ట్, అందులో నా పాత్రలు సాదాసీదాగా ఉండడంతో చేయలేదు.
‘చోర్‌బజార్’లో జీవన్‌రెడ్డి నా పాత్రను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంది. అందుకే ఈ సినిమా చేశాను. ఇందులో అమితాబ్‌బచ్చన్‌ను ప్రేమించి, అతని కోసం అవివాహితగా మిగిలిపోయిన మహిళ పాత్రలో కనిపిస్తాను. సినిమాను మలుపుతిప్పే పాత్ర నాది. ఓ రెండు నిమిషాలు 16 ఏళ్ల యువతిగా కనిపిస్తాను. ఆ లుక్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో చూడాలి.
ప్రస్తుతం తమిళం, కన్నడంలో ఆర్ట్ ఫిలింస్ చేస్తున్నాను. త్వరలోనే తెలుగు సినిమా చేసే అవకాశం ఉంది.