నేనొక నిజాన్ని... అబద్ధానికి లొంగను

ABN , First Publish Date - 2021-12-05T05:30:00+05:30 IST

సాగర సంగమంలో కమల్‌హాసన్‌ గొప్పగా నటించి ఉండొచ్చు. కానీ శరత్‌బాబు తక్కువ చేయలేదు.

నేనొక నిజాన్ని... అబద్ధానికి లొంగను

సాగర సంగమంలో కమల్‌హాసన్‌ గొప్పగా నటించి ఉండొచ్చు. 

కానీ శరత్‌బాబు తక్కువ చేయలేదు.

సితారలో సుమన్‌ హీరో కావచ్చు. కానీ శరత్‌ బాబుని మర్చిపోలేం.

సీతాకోక చిలుక నుంచి శరత్‌ బాబుని తీసి పారేయలేం. కథతో పాటు 

ప్రయాణించి, పాత్రలకు వన్నె తెచ్చిన ఎన్నో సినిమాలు ఆయన ఖాతాలో 

ఉన్నాయి. అందుకే ఇప్పటికీ శరత్‌బాబు స్థానం తెలుగు ప్రేక్షకుల గుండెల్లో 

ఉండిపోయిందలా. చాలాకాలం తరవాత ఓ సినిమా ప్రమోషన్లలో 

భాగంగా  హైదరాబాద్‌ వచ్చారాయన. ఈ సందర్భంగా నవ్య పలకరించి, 

గత జ్ఞాపకాల్లోకి లాకెళ్లింది.


షూటింగ్‌ వాతావరణానికి దూరంగా ఉన్నప్పుడు ఏమైనా మిస్‌ అవుతున్న ఫీలింగ్‌ కలుగుతుందా?

సినిమా నా ప్రాణం. నా జీవితం. రోజూ ఏదో ఓ టీవీలో... నేను నటించిన సినిమా వస్తూనే ఉంటుంది. లేదంటే... ఎవరో ఒకరు ఎదురు పడి.. ‘ఫలానా సినిమాలో మీ నటన బాగుందండీ’ అని గుర్తు చేస్తూ ఉంటారు. అదీ కాదంటే.. నా మన సే సినిమాల గురించి ఆలోచిస్తుంటుంది. ‘మా సినిమాలో మంచి పాత్ర ఉంది.. అందులో నటిస్తారా’ అంటూఓ దర్శకుడు నాకు కబురు పంపుతాడు. అలా సినిమాతో నేను నిత్యం మమేకమవుతూనే ఉన్నా. 


సాగర సంగమం సినిమాలో మీ పాత్ర చూసి ‘ఇలాంటి స్నేహితుడు మనక్కూడా ఉండి ఉంటే బాగుంటుంది’ అని చాలామంది అనుకుంటారు. మీకూ అలానే అనిపించిందా?

అది నా గొప్పదనం కాదు. ఆ పాత్ర గొప్పదనం. రఘు లాంటి స్నేహితుడు కావాలంటే... అవతల బాలు లాంటి వ్యక్తిత్వం ఉండాలి. మీరు రఘు కానప్పుడు బాలు లాంటి స్నేహితుడు కూడా దొరకడదు. ‘అమృత వర్షిణి’ అనే కన్నడ సినిమా చేశా. అది చూసి చాలామంది        అమ్మాయిలు ‘ఇలాంటి భర్త దొరకాలి’ అనుకునేవారు. ఓ సినిమాలో సుహాసినికి అన్నగా నటించా. అది చూసి చాలామంది నాకు చెల్లాయిలుగా తయారయ్యారు.  


మీకూ మంచి స్నేహితులు ఉన్నారా?

ఒకరి పేరని చెప్పలేను. చాలామంది ఉన్నారు. ఈ జనరేషన్‌లో కూడా స్నేహానికి, ఆ బంధానికి మనుషులు విలువ ఇస్తున్నారంటే అది స్నేహానికి ఉన్న గొప్పదనమే.  మనిషి ఉన్నంత కాలం... అన్ని బంధాలూ ఉంటాయి. 


ఇన్నేళ్ల కాలంలో ఏం సంపాదించారు?

మనుషుల్ని, వాళ్ల మనసులో స్థానాన్ని సంపాదించా.  నేను చేసిన పాత్రల ప్రభావం నాపై పడిందో, నా ప్రభావమే పాత్రలపై పడిందో తెలీదు గానీ, నేను చేసిన సినిమాలు, అందులో నా నటన ప్రేక్షకులు గుర్తించారు. ఎంత తపస్సు చేసినా, దేవుడు ఇంతకంటే గొప్ప వరం ఇస్తాడా?


ఓ సీనియర్‌ నటుడిగా సెట్లో మీకు ఇవ్వాల్సిన మర్యాద, గౌరవం ఇస్తున్నారా?

మాతరం నటీనటులెవరూ మర్యాద, గౌరవం ఆశించడం లేదు. ఆశించి భంగపడడం కంటే... ఖాళీ మనసులతో సెట్‌కి వెళ్లడం మంచిది అనిపిస్తోంది. అలాగని వాళ్లేదో మమ్మల్ని అగౌరవ పరుస్తున్నారని కాదు. సెట్లో మా వయసుకి, అనుభవానికీ గౌరవం దక్కితే అదో బోనస్‌ లా భావించాలి. రామారావు, నాగేశ్వరరావు లాంటి మహానుభావుల్ని చూసొచ్చిని వాళ్లం. వాళ్లు ఎక్కడైనా కనిపిస్తే.. పాదాలను తాకాలన్నంత గౌరవం కలిగేది. ఇది మాకెవ్వరూ నేర్పలేదు. అలా వచ్చేసిందంతే. అది జనరేషన్‌ని బట్టి మారుతూ ఉంటుంది. అప్పటి కథలు చూడండి. ఉమ్మడి కుటుంబాలు, అనుబంధాలు, ఆప్యాయతల చుట్టూ సాగేవి. హృదయానికి దగ్గరగా ఉండేవి. ఇప్పటి కథలు కుచించుకుపోతున్నాయి. హృదయం వరకూ వెళ్లకుండా, జేబు వరకూ వెళ్లి ఆగిపోతున్నాయి. అందుకే గౌరవాలు తగ్గుతున్నాయేమో..?


అప్పట్లో ఫ్యాన్‌ మెయిల్‌ మీకు చాలా ఎక్కువ అట కదా..?

అవును. అప్పట్లో వందల కొద్దీ ఉత్తరాలు వచ్చేవి. ప్రతీ ఉత్తరం చదవాలనే ఉండేది. కానీ కుదిరేది కాదు. కొన్ని మాత్రం చదివేవాడ్ని. నా స్వహస్తాలతో ప్రత్యుత్తరాలు రాసేవాడ్ని. నా స్టాఫ్‌ మాత్రం అన్ని ఉత్తరాలూ చదివేవారు. ‘ఈ ఉత్తరం చూడండి. ఎంత బాగుందో’ అని ఇచ్చేవారు. వాటిని ప్రత్యేకంగా దాచుకునేవాడిని. ఇప్పటి తరానికి ఆ జ్ఞాపకాలు, అనుభూతులు లేవు. 


మీ ప్రయాణంలో బాగా గుర్తుండిపోయిన అభిమాని ఎవరు?

చాలామంది ఉన్నారు. ఓసారి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లా. విమానం కోసం ఎదురుచూస్తున్నప్పుడు.. ఓ అమ్మాయి ఎదురుపడింది. నన్ను చూడగానే చాలా ఉద్వేగానికి గురైంది. ఆనందం, ఏడుపు.. రెండూ ఒకేసారి వచ్చేశాయు. తను నా అభిమాని అని అర్థమైంది. ‘మిమ్మల్ని తాకవచ్చా’ అని అడిగింది. ‘సరే..’ అన్నాను. నన్ను తాకి.. ఎంత సంతోషపడిపోయిందో. అదో లైఫ్‌ టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అనుకుంది. ఆ ఆనందంలో.. పక్కసీటులో కూర్చుని ఏడ్చేసింది. ఆ తరవాత.. లేచి, కాళ్లకు దండం పెట్టి వెళ్లిపోయింది. 


ఆర్థిక పరంగా క్రమశిక్షణతో ఉండగలిగారా?

నేను చాలా డిపిప్లెన్‌. టైమ్‌, ఫైనాన్స్‌, హెల్త్‌.. ఇవి మూడూ నాకుచాలా ముఖ్యం. ఈ విషయంలో క్రమశిక్షణ కోల్పోతే... జీవితం అధోగతి పాలవుతుంది. ఇవన్నీ మా అమ్మా నాన్న నాకు నేర్పారు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటా. మితంగా తింటా. శరీరానికి అవసరమైన అన్ని వ్యాయామాలు చేస్తా. యోగా, ప్రాణాయామం... వీటికి ప్రతీరోజూ కొంత సమయం కేటాయిస్తా. ‘మీకు క్లోజప్‌ పెడితే.. ఒక ఆరా కనిపిస్తుందండి.. ఓ వెలుగు మీ చుట్టూ ఉన్నట్టు ఉంటుంది’ అని చాలామంది కెమెరామెన్‌లు చెప్పారు. ఇప్పటికీ వాళ్లది అదే మాట. అదో గొప్ప కాంప్లిమెంట్‌. దాన్ని కాపాడుకోవాలంటే ఇలా శ్రమించాల్సిందే. 


మీకు బలహీనతలు లేవా?

సినిమానే పెద్ద బలహీనత. దాన్ని మించింది ఏదీ లేదు. తాగుడు, వ్యభిచారం అన్ని చోట్లా ఉన్నాయి. ఓ బలహీనమైన క్షణం.. వాటికి లొంగిపోతే, ఆ తప్పు నిన్ను ఆ పరిస్థితుల్లో పడేసిన క్షణాలది కాదు. అచ్చంగా నీదే. ఇండ్రస్ర్టీలో ఎంతమంది క్రమశిక్షణ పాటించి, ఉన్నత శిఖరాలు అధిరోహించలేదు..? వాళ్ల కథలు గుర్తు తెచ్చుకోండి.


ఆలోచించారా?ఆలోచించారా?

మార్పు సహజం. అంతే. అలానే చూడాలి. ఈ దేశంలో చాలా నదులున్నాయి. ఆ నదుల్లో ఏడే పుణ్య నదులు. ఏర్లు, చెరువులు, వాగులు వంకలు.. వీటన్నింట్లోనూ నీరే ఉంటుంది. కానీ.. ఒక్కోదాన్ని ఒక్కో పేరుతో పిలుస్తారు. కొన్నింటికే సార్థకత. 


అన్ని రకాల పాత్రలూ చేశారు కానీ, విలనిజం మీ ఫేసులో పండలేదనిపిస్తుంది. దానికి కారణం ఏమిటా అని ఆలోచించారా?

బహుశా సాత్విక పాత్రల్లో ఎక్కువగా కనిపించడం వల్ల అలా అనిపిస్తోందేమో..? ‘సీతాకోక చిలుక’లో నాది నెగిటీవ్‌ పాత్రే. తను ఊరికి పెద్ద. ఓ మతాన్ని నమ్మినవాడు. తన చెల్లెల్ని అదే మతంలో పెళ్లి చేయాలనుకోవడం న్యాయబద్ధమైన కోరికే కదా? అది సహజమైన పాత్ర. నెగిటీవ్‌ పాత్ర అనలేం.


నటుడిగా విజయవంతమైన జీవితం మీది. మరి నిజ జీవితంలో...?

అంతకంటే సక్సెస్‌ఫుల్‌. నా జీవితంలో స్ర్కిప్టు నాదే. డైలాగులూ నావే. ఎవరి అజమాయిషీ లేదు. ఇక ఒడిదుడుకులు అంటారా? అది లేకపోతే జీవితమే లేదు. నేను రామకృష్ణ పరమహంస కాదు. వివేకానంద కాదు. రాముడూ కాదు. రావణాసురుడూ కాదు. కేవలం శరత్‌ బాబుని. క్లిష్టమైన పరిస్థితుల నుంచి కూడా విజయవంతంగా బయటకు వచ్చా. బంధాలను గౌరవిస్తా. కానీ నన్ను విడిచి వెళ్లిపోయిన వాళ్ల గురించి క్షణం కూడా ఆలోచించను. నా జీవితంలో ప్రతీ చాఫ్టర్‌ నాకు ముఖ్యమే. అందులో గెలుపు, ఓటమి ఏమైనా ఉండొచ్చు. అవన్నీ కలిసే ఓ శరత్‌ బాబు తయారయ్యాడు. 


పుస్తకాలు చదువుతారా? అవి ఏం నేర్పాయి?

పుస్తకాలు కొన్ని నేర్పాయి. జీవితం మాత్రం అన్నీ నేర్పింది. నా సినిమాలూ, నేను చేసిన పాత్రలు, నాకు ఎదురైన మనుషులూ.. ఇవన్నీ నేర్పిస్తూనే ఉన్నాయి.


మీ ప్రయాణం ఓ పుస్తకంగా రాయొచ్చు కదా?

నా కథని  చెప్పాలని ఉంది. ఎలా అనేది ఇంకా డిసైడ్‌  అవ్వలేదు. కానీ కచ్చితంగా చెబుతా. 


అవార్డుల పట్ల వ్యతిరేకత.. అసంతృత్తి లేదా?

ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. భగవంతుడు కోరికను బట్టి కాదు. అర్హత బట్టి ఇస్తాడన్నది గీతా సారాంశం. దాన్ని నేను నమ్ముతా. 


మీ వైవాహిక జీవితం గురించి రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తూ ఉంటాయి. దానిపై స్పందించాలని ఉండదా?

నా గురించి ఒకరు ఏదేదో మాట్లాడారు. దానికి నేను సమాధానం అప్పుడే ఇచ్చా. మళ్లీ ఎందుకు ఇవ్వాలి..? ఇన్నేళ్ల తరవాత కూడా ఒకరు నా వైవాహిక జీవితం గురించి మాట్లాడుతున్నారంటే, ఇంకా దాన్ని మార్కెట్‌ చేసుకోవాలని చూస్తున్నారంటే.. నేను వాళ్లకంటే అందనంత ఎత్తులో ఉన్నానని అర్థం. అలాంటి వాళ్ల గురించి నేనెప్పుడూ పట్టించుకోను. నేను నిజాన్ని. అబద్ధాలను ఎప్పటికీ లొంగను.





నేనే కాదు.. ఎవరూ వాళ్ల తల్లిదండ్రుల్ని ఎంపిక చేసుకోలేరు.  మరి ఎందుకు అక్కడే పుట్టాం..? అది కర్మ సిద్ధాంతమే కదా? కొంతమంది మనతో జీవితాంతం ఉండి ఉంటే బాగుంటుంది అనుకుంటాం. కానీ మధ్యలోనే మనల్ని ఎందుకు వదిలేసి వెళ్లిపోతారు? ఆఖరి మెట్టు ఎక్కాలంటే.. ముందున్న పది మెట్లూ పూర్తవ్వాలి కదా? ఇదంతా కర్మే.



నేను రామకృష్ణ పరమహంస కాదు. వివేకానంద కాదు. రాముడూ కాదు. రావణాసురుడూ కాదు. కేవలం శరత్‌ బాబుని.  బంధాలను గౌరవిస్తా. కానీ నన్ను విడిచి వెళ్లిపోయిన వాళ్ల గురించి క్షణం కూడా ఆలోచించను. నా జీవితంలో ప్రతీ చాఫ్టర్‌ నాకు ముఖ్యమే. అందులో గెలుపు, ఓటమి ఏమైనా ఉండొచ్చు. అవన్నీ కలిసే ఓ శరత్‌ బాబు తయారయ్యాడు.


                                                                                                        అన్వర్‌

Updated Date - 2021-12-05T05:30:00+05:30 IST