హిట్‌ జోడీ... మళ్లీ రెడీ!

సినిమా హాళ్ళు సిద్ధమవుతున్నాయి. త్వరలో వెండితెరపై చిత్రాలు విడుదల కానున్నాయి. అప్పుడు, హిట్‌ జోడీలు మరోసారి సందడి చేయనున్నాయి! పినిమాలో హీరో హీరోయిన్‌ కాంబినేషన్‌కు ఉండే కిక్కే వేరు!  అదే అంతకు ముందు వాళ్ళిద్దరూ హిట్‌ సినిమాలో జోడీగా నటిస్తే? సమ్‌థింగ్‌ స్పెషలే కదా! సెకండ్‌ వేవ్‌ తర్వాత స్పెషల్‌ హిట్‌ జోడీలు తెరపైకి వస్తున్నాయి. ప్రేక్షకులను కనువిందు చేయడానికి సినిమాలు సిద్ధమవుతున్నాయి!


కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత థియేటర్లలోకి రానున్న భారీ చిత్రాల్లో ‘ఆచార్య’ ఒకటి. ఇందులో చిరంజీవి, కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటించారు. అంతకు ముందు వీళ్లిద్దరూ ‘ఖైదీ నంబర్‌ 150’లో సందడి చేశారు. అందులో పాటలకు మంచి పేరొచ్చింది. అలాగే, చిరు-కాజల్‌ స్టెప్పులకూ! అయితే, ఇద్దరి మధ్య సన్నివేశాలు తక్కువే. ఇప్పుడు ‘ఆచార్య’లో రెండోసారి జంటగా నటిస్తున్నారు. ఇందులో సన్నివేశాలు ఎక్కువ ఉంటాయేమో చూడాలి. ఇదే సినిమాలో మరో జంట రామ్‌చరణ్‌-పూజా హెగ్డే. వీళ్లిద్దరూ ఇంతకు ముందు జోడీగా నటించలేదు. కానీ, హిట్‌ సాంగ్‌లో జంటగా స్టెప్పులు వేశారు. ‘రంగస్థలం’లో ‘జిగేల్‌ రాణి...’గా పూజా హెగ్డే సందడి చేసిన సంగతి తెలిసిందే. 


తెలుగులో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ జోడీల్లో వెంకటేశ్‌-మీనా జోడీ ఒకటి. ‘చంటి’, ‘సూర్యవంశం’, ‘అబ్బాయిగారు’, ‘సుందరాకాండ’, ‘దృశ్యం’... దాదాపుగా వీళ్లిద్దరూ నటించిన చిత్రాలన్నీ విజయాలు సాధించాయి. ‘దృశ్యం’ సీక్వెల్‌గా ‘దృశ్యం-2’ వస్తున్న సంగతి తెలిసిందే. సీక్వెల్‌ అంటే సేమ్‌ హీరోయిన్‌ను రిపీట్‌ చేస్తారు కదా! సో... మీనాతో మరోసారి వెంకటేశ్‌ నటించారు. ‘ఎఫ్‌ 2’ సీక్వెల్‌ ‘ఎఫ్‌ 3’లో తమన్నాతో ఇంకోసారి జోడీ కట్టారు. కథ పరంగా చూసుకుంటే... ‘ఎఫ్‌ 2’కి ‘ఎఫ్‌ 3’ సీక్వెల్‌ కాదు. కానీ, క్యారెక్టర్లు-క్యారెక్టరైజేషన్లు సేమ్‌ ఉంటాయి. అందుకని, హీరో హీరోయిన్లలో ఎటువంటి మార్పులేదు. ‘ఎఫ్‌ 2’లో జంటగా నటించిన వరుణ్‌తేజ్‌, మెహరీన్‌ కూడా ‘ఎఫ్‌ 3’లో కనువిందు చేయనున్నారు.


వెంకటేశ్‌ మేనల్లుడు, అక్కినేని హీరో నాగచైతన్య కూడా హిట్‌ హీరోయిన్‌ను రిపీట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం చైతూ నటిస్తున్న సినిమా ‘థాంక్యూ’. ఇందులో రాశీ ఖన్నా మెయిన్‌ హీరోయిన్‌. తెలుగు తెరకు ఆమె పరిచయమైనదే చైతూకు జంటగా! ‘మనం’లో అతిథిగా రాశీ ఖన్నా నటించారు. చైతూ ప్రేయసిగా కాసేపు కనిపిస్తారు. ఆ సినిమా వచ్చిన ఐదేళ్లకు గానీ మళ్లీ కాంబినేషన్‌ కుదరలేదు. ‘వెంకీమామ’లో పూర్తిస్థాయి జోడీగా నాగచైతన్య, రాశీ ఖన్నా నటించారు. ఇప్పుడు ‘థాంక్యూ’ చేస్తున్నారు. రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తున్న మరో తెలుగు సినిమా ‘పక్కా కమర్షియల్‌’. హీరో గోపీచంద్‌తో ఆమెకు మూడో చిత్రమిది. ఇంతకు ముందు ‘జిల్‌’, ‘ఆక్సిజన్‌’ చేశారు. ఆ రెండూ భారీ విజయాలు అందుకోలేదు. ‘పక్కా కమర్షియల్‌’ ఆ లోటు తీరుస్తుందేమో చూడాలి.


కరోనా సెకండ్‌ వేవ్‌ బ్రేకులు వేయడంతో థియేటర్లలోకి రాకుండా ఆగిన హీరోల్లో నాని ఒకరు. లేదంటే ‘టక్‌ జగదీశ్‌’తో వేసవి బరిలో వసూళ్ల వేటకు దిగేవారే. ఆ సినిమాలో హీరోయిన్లు రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్‌ నటించారు. ఐశ్వర్యా రాజేశ్‌తో నానికి ఇది తొలి సినిమా. అయితే, రీతూ వర్మతో రెండోది. ‘ఎవడే సుబ్రమణ్యం’లో జంటగా కనిపించారు. కానీ, కాసేపే! ‘టక్‌ జగదీశ్‌’లో మాత్రం రీతూ వర్మతో నానికి చాలా సన్నివేశాలు ఉన్నాయి. కథలోనూ ఆమెది కీలక పాత్ర అని తెలిసింది. ‘ఈ నగరానికి ఏమైంది’లో నటించిన విశ్వక్‌సేన్‌, సిమ్రన్‌ చౌదరి... ‘పాగల్‌’లోనూ నటించారు. ‘కె.జి.యఫ్‌’, ‘పుష్ప’... రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న చిత్రాల్లో, రెండిటిలోనూ హీరో హీరోయిన్లలో మార్పులేవీ ఉండవు. ఇవి కాకుండా మరికొన్ని చిత్రాల్లో హిట్‌ జోడీలు మళ్లీ సందడి చేయడానికి రెడీ అంటున్నాయి.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.