బాలు గురించి ఆయన చెప్పిన జోస్యం.. అక్షరాలా నిజమైంది..!

ABN , First Publish Date - 2021-09-25T19:01:12+05:30 IST

ఈ రోజు గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం తొలి వర్ధంతి. ఆయన దశాబ్దాల పాటూ భారతీయ సంగీత ప్రియుల్ని తన గాత్రంతో అలరించారు. అయితే, మనమంతా ఎస్పీబీ లెజెండ్‌గా ఎదిగాక ఆయన్ని పొగిడాం. పొగుడుతున్నాం. కానీ, ఒక్క వ్యక్తి మాత్రం... తొలి సినిమా పాట కూడా పాడక ముందే ‘బాలు‘ అనే అద్భుతాన్ని గుర్తించారు...

బాలు గురించి ఆయన చెప్పిన జోస్యం.. అక్షరాలా నిజమైంది..!

ఈ రోజు గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం తొలి వర్ధంతి. ఆయన దశాబ్దాల పాటూ భారతీయ సంగీత ప్రియుల్ని తన గాత్రంతో అలరించారు. అయితే, మనమంతా ఎస్పీబీ లెజెండ్‌గా ఎదిగాక ఆయన్ని పొగిడాం. పొగుడుతున్నాం. కానీ, ఒక్క వ్యక్తి మాత్రం... తొలి సినిమా పాట కూడా పాడక ముందే ‘బాలు‘ అనే అద్భుతాన్ని గుర్తించారు... 

తెలుగు పాటంటే ఘంటసాల మాత్రమే అనుకునే రోజులవి. సరిగ్గా అప్పుడే ‘మేడంటే మేడా కాదు.. గూడంటే గూడూ కాదు’ అంటూ వినిపించిన బాలు లేలేత గొంతు సంగీత ప్రియుల్ని ఆకర్షించింది. ఎవరో కొత్త యువకుడు భలే పాడుతున్నాడే అనుకున్నారు. ఈ పాటకు అవకాశమిచ్చిన సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి మాత్రం కుర్ర బాలులో భవిష్యత్తు గాన గంధర్వుడిని చూశారు.

ఓ పాటల పోటీలో బాలు ప్రతిభకు మెచ్చి దగ్గరకు పిలిపించుకొని సినిమాల్లో పాడతావా? అని అడిగారు. ‘పద్ధతిగా ఉంటే కనీసం 40 ఏళ్లు పాడగలవు’ అని అప్పుడే చెప్పారు. ఆయన జోస్యం పొల్లు పోలేదు. పాటల ప్రియలకు ఎస్పీబీతో బంధం, నాలుగు దశాబ్దాలకు పైగానే పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాదిరిగా పెనవేసుకుపోయింది.  వేదికల్లో గానీ, ఇంటర్వ్యూలో గానీ కోదండపాణి పేరును తీసుకున్నప్పుడల్లా బాలు కళ్లలో నీటి చెమ్మ కనిపించేది. తనకు కోదండపాణి అవకాశాలు ఇచ్చి సరిపెట్టలేదని.. తనను వెంటబెట్టుకొని సంగీత దర్శకులు, నిర్మాతల వద్దకు తీసుకెళ్లి ఎన్నో అవకాశాలు ఇప్పించారని ఓ ఇంటర్వ్యూలో ఎస్బీబీ చెప్పారు.

కోదండపాణి పట్ల కృతజ్ఞతగా బాలు, తన రికార్డింగ్‌ థియేటర్‌కు ఆయన పేరునే పెట్టుకున్నారు ‘‘నాకు ఆయన జీవితాన్నే ఇచ్చారు. నా చర్మాన్ని ఒలిచి ఆయన కుటుంబానికి ఊడిగం చేసినా రుణం తీర్చుకోలేను’’ అని చెప్పేవారు. బాలుకి తన గురువుగారంటే అంతటి కృతజ్ఞత. కోదండపాణి ఇంటిపేరు కూడా ‘శ్రీపతి పండితారాధ్యుల’. ఆ విషయం తనకు మొదట్లో తెలియదని.. తెలిశాక ఆయన్ను అడిగితే.. ‘పళ్లు రాలగొడతా.. అందుకని చాన్స్‌ ఇచ్చాననుకున్నావా?’ అని గట్టిగా కేకలేశారని బాలు చెప్పేవారు.

Updated Date - 2021-09-25T19:01:12+05:30 IST